iDreamPost
android-app
ios-app

గ్రేటర్‌ వార్‌ : టీడీపీ బేజార్‌..!

గ్రేటర్‌ వార్‌ : టీడీపీ బేజార్‌..!

ఒకప్పుడు హైదరాబాద్‌లో రాజకీయ ఆధిపత్యం తెలుగుదేశం పార్టీదే. 2002లో ప్రత్యక్షంగా జరిగిన ఎన్నికల్లో సైతం నాడు ఆ పార్టీ నేత అయిన తీగల కృష్ణారెడ్డి మేయర్‌గా ఎన్నికై ఐదేళ్లు పాలించారు. రాష్ట్ర అవతరణ అనంతరం జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గ్రేటర్‌లో తెలుగుదేశానిదే ఆధిక్యత. అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు దేశాన్ని దూరం చేశాయి. ఎమ్మెల్యేలందరూ కారెక్కారు. ఫలితంగా ఇప్పుడు ఉనికి కోసం పార్టీ అగచాట్లు పడుతోంది. కనీంం కార్యకర్తలు కూడా ఉన్నారో.. లేరో తెలియని పరిస్థితి. అయినప్పటికీ ప్రస్తుతం గ్రేటర్‌ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లకు గాను 106 చోట్ల అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. కానీ.. వాటిలో సగానికి పైగా స్థానాల్లో ప్రచారం చేయడానికి కార్యకర్తలు కూడా కరువయ్యారు. 2016లో 95 స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకున్న టీడీపీ ప్రస్తుతం పోటీ చేసే స్థానాలు పెరిగినా.. గెలిచే స్థానాలు ఉంటాయా..? అనే ప్రచారం గ్రేటర్‌లో సాగుతోంది. ఇందుకు కార‌ణం టీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య సాగుతున్న హోరాహోరీ ప్ర‌చారంలో తెలుగుదేశం వెనుక‌బ‌డి ఉండ‌డమే.

సైబరాబాద్‌ లో ఘోర ఓటమి…

చంద్రబాబు నాయుడు ఊ అంటే సైబరాబాద్‌ నిర్మించింది తానే అంటూ చెప్పుకొస్తారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పరిస్థితి ముందు గొయ్యి.. వెనుక నుయ్యి అన్న చందంగా తయారైంది. ఒకప్పుడు శేరిలింగంపల్లి ప్రాంతం టీడీపీకి కంచుకోట. హైటెక్‌ సిటీ కారణంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రపంచస్థాయి గుర్తింపు పొందింది. తమ నాయకుడు చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధి కారణంగానే హైదరాబాద్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించుకుందని ఆ పార్టీ నేతలు పలుమార్లు చెబుతుంటారు. అందులోని నిజానిజాలు అలా ఉంచితే.. నియోజకవర్గంలో ఒకప్పుడు ఉన్న బలమైన పట్టును ఆ పార్టీ పూర్తిగా కోల్పోయిందన్నది మాత్రం వాస్తవం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శంకర్‌గౌడ్‌పై టీడీపీ అభ్యర్థి గాంధీ 79,800 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అయితే.. 2018 ఎన్నికలకు ముందు ఆయన టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ నుంచి గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో నిలిచిన ఆనంద్‌ ప్రసాద్‌ 40వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అంతకు ముందు.. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరపున పది డివిజన్లలో పోటీ చేసిన అభ్యర్థులంతా టీఆర్‌ఎస్‌ చేతిలో దారుణ ఓటమిపాలయ్యారు. ఆ ఫలితంతో నియోజకవర్గంలో తెలుగుదేశం కేడర్‌ చతికిలపడింది. అనంతరం కీలక నాయకుడు మొవ్వా సత్యనారాయణ బీజేపీలో చేరడంతో నియోజకవర్గంలో టీడీపీకి నాయకత్వలోపం ఎదురైంది. ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ అన్ని డివిజన్లలోనూ పోటీ చేస్తోంది. కానీ సగానికి పైగా అభ్యర్థులు ప్రచారంలో వెనుకంజలో ఉన్నారు.

2014 తర్వాత నుంచి కష్టాలు మొదలు..

సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2014 వరకూ టీడీపీ మెరుగ్గానే ఉండేది. ఆ తర్వాత కీలక కేడర్‌ అంతా పార్టీని వీడటంతో కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుత గ్రేటర్‌ వార్‌లో అన్ని డివిజన్లలోనూ అభ్యర్థులను పోటీకి దించింది. మిగిలిన పార్టీలతో పోల్చుకుంటే.. టీడీపీ అభ్యర్థుల వెంట కనిపించే కేడర్‌ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఇక ఒక్కరైనా విజయం సాధిస్తారా..? అనే చర్చ జరుగుతోంది. సనత్‌ నగర్‌, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాలలోనూ టీడీపీ పరిస్థితి దిక్కుతోచని విధంగా ఉంది. ఇక ముషీరాబాద్‌, అంబర్‌పేట నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని 5 డివిజన్లలో టీడీపీ తరఫున అభ్యర్థులు బరిలో ఉన్నారు. కనీసం రెండు చోట్లయినా గెలవాలనే పట్టుదల ముందుకు సాగుతున్నారు. కానీ ప్రధాన పార్టీల దూకుడును అందుకునే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. ఎల్‌బీ నగర్‌ నియోజకవర్గంలో ఒకప్పుడు టీడీపీ హవా కొనసాగేది. ప్రస్తుతం అక్కడ పార్టీకి బలం లేకపోయినా నియోజకవర్గంలోని 11 డివిజన్లలోనూ అభ్యర్థుల్ని నిలిపింది. వీరిలో ఎంత వరకు విజయం సాధిస్తారో చెప్పలేని పరిస్థితి ఉంది. వీటితో పాటు ఉప్పల్‌, రాజేంద్రనగర్‌ తదితర నియోజకవర్గాలు కూడా ఒకప్పుడు ఆ పార్టీకి కంచుకోటలే. కానీ పార్టీ ప్రస్తుతం కష్టాల సముద్రంలో ఈదుతోంది.