iDreamPost
android-app
ios-app

ఎంఐఎంతో పొత్తు లేదంట.. తప్పైతే శిక్షించాలంటున్న కేటీఆర్‌..

ఎంఐఎంతో పొత్తు లేదంట.. తప్పైతే శిక్షించాలంటున్న కేటీఆర్‌..

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య పొత్తుపై ఊహాగానాలకు తెరపడింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు ఉండదని, ఒంటరిగానే 150 డివిజన్లలో పోటీ చేస్తామని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చెప్పారు. గత ఎన్నికల్లో పాత బస్తీలో టీఆర్‌ఎస్‌ ఐదు డివిజన్లలో గెలిచిందని, ఈ సారి ఆ ఐదు డివిజన్లతోపాటు మరో ఐదు డివిజన్లలోనూ గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మేయర్‌ పీఠాన్ని ఈ సారి కూడా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో సత్తా చాటేందుకు కేటీఆర్‌ దూకుడుగా వెళుతున్నారు. ఆగమేఘాలపై నిర్ణయాలు తీసుకుంటూనే.. మరో వైపు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. నిన్న 105 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించిన కారు పార్టీ.. ఈ రోజు మరో 20 అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో సిట్టింగ్‌లకే సీట్లు ఇచ్చిన కేటీఆర్‌.. ఈ సారి మాత్రం కొత్తముఖాలకు చోటు కల్పించారు. మిగిలిన 25 డివిజన్లకు అభ్యర్థులను ఈ రాత్రి లేదా రేపు ఉదయం కల్లా ప్రకటించనున్నారు. నామినేషన్ల గడువు రేపటితో ముగుస్తున్న నేపథ్యంలో సీట్లు దక్కిన వారు నామినేషన్లు దాఖలు చేసేందుకు యుద్ధప్రాతిపదికన సిద్ధం అవుతున్నారు.

అభివృద్ధి, శాంతి మంత్రాన్ని కేటీఆర్‌ ఎన్నికల ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. గత ఆరేళ్లలో హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని వివరిస్తున్నారు. గతంలో కరెంట్‌ ఉంటే వార్త అని.. ఇప్పుడు కరెంట్‌పోతే వార్త అవుతోందన్నారు. హైదారాబాద్‌ను ప్రశాంతతకు కేంద్రంగా మలిచామని పేర్కొంటున్నారు. తాను చెప్పేవి తప్పైతే ఎన్నికల్లో శిక్షించాలని, నిజమైతే ఓట్లు వేసి ఆశీర్వదించాలని కేటీఆర్‌ ప్రజల్లోకు వెళుతున్నారు. కేటీఆర్‌ మాటలు తప్పా.. నిజమా.. అనేది తెలియాలంటే డిసెంబర్‌ 5వ తేదీ వరకు ఆగాలి.