iDreamPost
android-app
ios-app

పాతనగరంలోనూ బీజేపీ పాగా..!

పాతనగరంలోనూ బీజేపీ పాగా..!

గ్రేటర్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 4 నుంచి 48 స్థానాలకు పుంజుకున్న విషయం తెలిసిందే. మజ్లిస్‌కు పెట్టని కోట అయిన ఓల్డ్‌ సిటీలోకి కూడా బీజేపీ బలం భారీగా పెరిగింది. బీజేపీ పాతబస్తీలో ఎంఐఎంను పెద్దగా ఢీకొట్టలేకపోయినా టీఆర్‌ఎస్‌ను మాత్రం వెనక్కి నెట్టేసింది. గతం కంటే అత్యధిక సంఖ్యలో ఓట్లను పెంచుకుంది. అంతేకాదు.. 2016లో ఆ ప్రాంతంలో టీఆర్‌ఎస్‌ సాధించిన 9 స్థానాలను కూడా బీజేపీయే సాధించింది. 2020 ఎన్నికలు జరగక ముందు వరకూ పాతబస్తీలో ఎంఐఎంకు, టీఆర్‌ఎస్‌కే స్థానాలు ఉండేవి. ప్రస్తుతం అక్కడ టీఆర్‌ఎస్‌ కనుమరుగైంది. ఓట్లు వచ్చినా సీట్లు రాలేదు. బీజేపీకి ఓట్లు, సీట్లు రెండూ వచ్చాయి.

గ్రేటర్‌లోని పాతబస్తీ పరిధిలోకి 8 నియోజకవర్గాలు ఉన్నాయి. 49 డివిజన్లు ఉన్నాయి. మలక్‌పేట, కార్వాన్‌, యాకుత్‌పురా, బహదూర్‌పురా, రాజేంద్రనగర్‌, చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, నాంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 49 డివిజన్లలో ఎంఐఎంకు 5.50 లక్షల ఓట్లు రాగా 40 డివిజన్లను దక్కించుకుంది. బీజేపీకి 2.34 లక్షల ఓట్లు రాగా 9 డివిజన్లను దక్కించుకుంది. టీఆర్‌ఎస్‌కు 1.70 లక్షల ఓట్లు వచ్చినా ఒక్క సీటు కూడా రాలేదు. 2016 ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ నామమాత్రంగానే ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ కంటే 64 వేల ఓట్లను అధికంగా పొందడం విశేషం.

ఎల్‌బీనగర్‌, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలోని 13 డివిజన్లలో టీఆర్‌ఎస్‌, బీజేపీ హోరాహోరీగా తలపడినా చివరకు బీజేపీనే క్లీన్‌స్వీప్‌ చేసింది. గతంలో ఒక్క స్థానమూ లేని ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో మొత్తం 11 స్థానాలనూ బీజేపీ దక్కించుకుంది. మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు డివిజన్లను కూడా సొంతం చేసుకుంది. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో టీఆర్‌ఎస్‌కు 12 సిట్టింగ్‌ స్థానాలు ఉండగా అన్నీ బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. టీఆర్‌ఎస్‌కు 1,12,533 ఓట్లు రాగా.. బీజేపీకి 1,59,027 ఓట్లు వచ్చాయి. బీజేపీ 13 డివిజన్లలో 10 చోట్ల 2 వేలపైన ఆధిక్యతను సొంతం చేసుకోగా, మూడు డివిజన్లలో మాత్రమే అత్యల్ప ఓట్లతో విజయం సాధించింది.