iDreamPost
android-app
ios-app

ప్రత్యర్ధులు కోరుకుంటున్నారా?!

  • Published Nov 23, 2020 | 2:23 AM Updated Updated Nov 23, 2020 | 2:23 AM
ప్రత్యర్ధులు కోరుకుంటున్నారా?!

ఎక్కడైనా ఎన్నికల్లో స్టార్‌ కేంపైనింగ్‌ అంటే ఎదుటి పార్టీ వాళ్ళకు చెమటలు పడతాయి. ఏవరైనా సెలబ్రిటీ ఒక పార్టీ తరపున ప్రచారానికి వస్తుంటే, ఆయా సమావేశాలకు విపరీతమైన క్రౌడ్‌ తరలివస్తుంది. తద్వారా స్టార్‌ను తెచ్చుకున్న పార్టీకి వీలైనంత తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రచారం లభిస్తుంది. స్టార్‌ కేంపైనింగ్‌ వెనుక ఉన్న మౌలిక రాజకీయసూత్రం ఇదే. ఈ నేపథ్యంలో ఎదుటి పార్టీకంటే మాంచి సెలబ్రిటీని తమ తరపున ప్రచారానికి తెచ్చుకోవాలని ఆయా పార్టీలు తెగ ఉబలాటపడిపోతుంటాయి. అయితే ఇలా స్టార్‌లు చేసిన కేంపైనింగ్‌లు ఎంత వరకు విజయవంతమయ్యాయి అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పడం మాత్రం కష్టమే.

ఇదిలా ఉండగా ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాదు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేస్తోంది. అయితే ఎక్కడ గెలుస్తుందన్నది మాత్రం బ్రహ్మరహస్యం. అక్కడ మాక్కూడా బలమైన కేడర్‌ ఉంది, మా సత్తా కూడా చాటుతాం అంటూ అక్కడి నాయకులు ప్రసంగాల్లో దంచేస్తున్నారనుకోండి. కానీ వాస్తవంగా ఎన్ని చోట్ల గెలుస్తారు అంటే మాత్రం చెప్పడం టీడీపీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబునాయుడి వల్ల కూడా కాదని తెలంగాణాలో టీడీపీకి ప్రత్యర్ధి నాయకులు కామెంట్లు చేస్తున్నారు.

అయితే టీడీపీ తరపున స్టార్‌ కేంపైనర్లుగా చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణను దింపడానికి స్కెచ్‌ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈయనకు తోడుగా అల్లుడు లోకేష్‌బాబును కూడా ప్రచారానికి వాడుకుంటారట. అయితే ఇది టీడీపీ తరపున పోటీ చేస్తున్న వారివైపు నుంచి కొంత ఊరటనిచ్చే అంశమే. కానీ వీరిద్దరు తెలంగాణాలో ప్రచారానికి వస్తే తమకే మేలన్న భావనలో ప్రత్యర్ధులు కూడా వీరే రావాలని కోరుకుంటున్నారని సోషల్‌ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అంటే ప్రత్యర్ధులు కూడా బాలయ్యబాబు, లోకేష్‌బాబులు తెలంగాణాలో టీడీపీ తరపున ప్రచారం చేస్తే తమకే మేలు చేకూరుతుందని ధీమాను వ్యక్తం చేస్తున్నారన్నమాట.

ఇందుకు కూడా కారణం లేకపోలేదు. గతంలో మామా అల్లుళ్ళు అనేక వేదికలపై తమ ప్రతాపాన్ని చూపించడాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. బాలయ్యబాబు చేత్తోను, లోకేష్‌బాబు నాలుకతోనూ చేసే విన్యాసాలకు భారీగానే ప్రచారం లభించడం ఖాయం. కానీ ఈ ఇద్దరు స్టార్‌ల కేంపైనింగ్‌తో సొంత పార్టీకి ఎంత వరకు మైలేజి వస్తుందో తెలియదుగానీ, ప్రత్యర్ధి పార్టీలకు మాత్రం మాంచి స్టఫ్‌ దొరికేస్తుందంటున్నారు. ఎన్ని గెలుస్తామో తెలియని గ్రేటర్‌ ఎన్నికల్లో టీడీపీ పక్కా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్లుగా ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే చంద్రబాబు నేరుగా ప్రచారానికి రాకుండా మామా, అల్లుళ్ళను తోలుతున్నారంటున్నారు. ఈ వ్యూహం ఎంత వరకు సక్సెస్‌ను అందుకుంటుందన్నది టీడీపీకి పడే ఓట్లపైనే ఆధారపడి ఉంటుందన్నమాట.