Idream media
Idream media
ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టడం లేదంటూ ఇప్పటి వరకూ గగ్గోలు పెట్టిన కొత్త కార్పొరేటర్లు.. ఇప్పుడు ఆ రోజు ఎందుకు పెడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి చెందిన కార్పొరేటర్లు దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బల్దియా పాలక మండలి ప్రమాణ స్వీకారానికి సెంటిమెంట్ అడ్డుపడనుందా..? మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా.. లేదా..? ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కాకుండా మరో తేదీన కొత్త కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకు కారణం ముహూర్తం పెట్టిన రోజు అమావాస్య కావడమే.
గతేడాది చివర్లో హోరాహోరీగా జీహెచ్ ఎంసీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1న పోలింగ్ జరగగా.. అదే నెల 4న ఫలితాలు వచ్చాయి. టీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44,కాంగ్రెస్2 సీట్లు గెలుపొందాయి. అయితే బీజేపీ తరపున గెలిచిన లింగోజిగూడ కార్పొరేటర్ ఆకస్మిక మృతితో ఆ పార్టీ సంఖ్య 47కి చేరింది. బీజేపీ బలం అనూహ్యంగా పెరిగింది. గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం చేస్తామని భావించినా ఇప్పటి వరకూ అది జరగలేదు. దీనిపై బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. పలు సమావేశాలు, చర్చలు పెట్టి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల కమిషన్ కు వినతిపత్రాలు సమర్పించారు. ఎట్టకేలకు రిజల్ట్ వచ్చిన సుమారు రెండు నెలల తర్వాత కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారానికి ఫిబ్రవరి 11న ఉదయం11 గంటలకు ఎన్నికల కమిషన్ ముహూర్తం ఫిక్స్ చేసింది. అప్పటి వరకూ ప్రమాణ స్వీకారం ఎప్పుడు పెడతారంటూ ప్రశ్నించిన బీజేపీ కార్పొరేటర్లు ఇప్పుడు ఆ తేదీపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజున ప్రమాణస్వీకారం చేసేందుకు చాలామంది కార్పొరేటర్లు ఇష్టపడడంలేదు. అదే రోజు అమావాస్య కావడంతో వద్దంటూ పలువురు కార్పొరేటర్లు కోరుతున్నారు. కొత్త కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం అనంతరం అదే రోజు మధ్యాహ్నం 12: 30నిమిషాలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఆ ఎన్నిక కూడా అదే రోజు ఉంటుందా ? లేక తేదీని ఏమైనా మారుస్తారా? అనేది హాట్ టాఫిక్ అయింది. ఒకవేళ మారిస్తే గనుక అమావాస్యే కారణం కానుంది. హిందూ సంప్రదాయం ప్రకారం అమావాస్య రోజు ఎలాంటి శుభకార్యాలు చేయరు. దీంతో ఈ తేదీపై కొందరు కార్పొరేటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
ప్రభుత్వం ఇష్టానుసారంగా తేదీని ప్రకటిస్తూ తమ సెంటిమెంట్‌పై దెబ్బకొడుతుందని అంటున్నారు. ఏ చిన్న శుభకార్యమైనా అమావాస్య రోజు నిర్వహించరని, అలాంటప్పుడు కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేయిస్తరా ? అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అలాంటి రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల రిజల్ట్వచ్చిన రెండు నెలలకు చేయిస్తున్న ప్రమాణ స్వీకారం కూడా మంచి ముహూర్తానికి కాదు. ఏ చిన్న శుభకార్యమైనా చేయాలంటేనే ఎన్నో ముహూర్తాలు చూస్తాం. అలాంటిది కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం అమావాస్య నాడు ఎలా చేస్తాం. ఎలక్షన్ కమిషన్ స్పందించి ప్రమాణ స్వీకారం తేదీని ఒక రోజు ముందైనా, లేదా ఫిబ్రవరి12న నైనా నిర్వహించాలి.. అని గుడిమల్కాపూర్కొత్త కార్పొరేటర్ దేవర కరుణాకర్ కోరుతున్నారు. ప్రభుత్వం కావాలనే ఈ విధంగా చేస్తోందని బాగ్ అంబర్ పేట్ కొత్త కార్పొరేటర్ బి.పద్మావెంకట్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రమాణ స్వీకార తేదీని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తేదీ మారుస్తారా..? అదే రోజు ప్రమాణ స్వీకారం చేయిస్తారా..? అనేది గ్రేటర్ లో హాట్ టాపిక్ గా మారింది.