iDreamPost
android-app
ios-app

Ganta Srinivasa Rao – గంటా ‘కాపు’ వ్యాఖ్యలు ఎందుకు చేశారు..?

Ganta Srinivasa Rao – గంటా ‘కాపు’ వ్యాఖ్యలు ఎందుకు చేశారు..?

గంటా శ్రీనివాసరావు.. ఏపీ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం కామేపల్లికి చెందిన గంటా శ్రీనివాసరావు.. వ్యాపార రీత్యా వైజాగ్‌లో స్థిరపడి.. రాజకీయంగా ఎదిగారు. అధికారం ఉన్న చోట గంటా శ్రీనివాసరావు ఉంటారంటారు. అయితే 2019లో ఆయన లెక్క తప్పింది. టీడీపీ ఓడిపోయింది. వైసీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చేరికపై అనేక ఊహాగానాలు, ప్రచారాలు జోరుగా సాగినా.. గంటా గత చరిత్ర అడ్డుతగులుతోంది.

బీజేపీలో చేరేందుకు కూడా యత్నించారనే వార్తలు వచ్చాయి. ఇలా రెండున్నరేళ్ల సమయం గడిచిపోయింది. ఇప్పటికీ ఆయన రాజకీయంగా సతమతమవుతూనే ఉన్నారు. అటు టీడీపీలో యాక్టీవ్‌గా ఉండలేక.. ఇటు అధికారం ఉన్న పార్టీలలో చేరే అవకాశం లేక.. మౌనంగా ఉంటున్నారు.

ఇలాంటి పరిస్థితిలో రాజకీయంగా ప్రత్యేకతను చాటుకునేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా గంటా వాడేస్తున్నారు. కానీ అవి కూడా అంత ఫలితాన్ని ఇవ్వడం లేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న కార్మికుల ఉద్యమానికి మద్ధతు తెలిపిన గంటా.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఈ మేరకు స్పీకర్‌కు లేఖ కూడా పంపారు. తన స్థానంలో కార్మిక నేతను పోటీ చేయిస్తానని చెప్పారు. ఫలితంగా కొన్ని రోజులు గంటా పేరు పతాక శీర్షికల్లో నిలిచింది. ఆ తర్వాత రాజీనామా అంశం మరుగునపడిపోయింది. గంటా కూడా ఆ విషయం ప్రస్తావించడం లేదు.

తాజాగా దివంగత నేత వంగవీటి మోహన్‌ రంగా విగ్రహావిష్కరణ విశాఖ జిల్లా పాయకరావుపేటలో జరిగింది. ఈ సభలో గంటా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాలను శాసించేది కాపులేనంటూ ఆయన మాట్లాడారు. గంటా ఏ ఉద్దేశంతో అన్నారో గానీ ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయి. పార్టీ మారే విషయంలో ఊగిసలాటలో ఉన్న గంటా.. వైసీపీ, బీజేపీ కాకుండా మరో పార్టీలోకి వెళ్లేందుకు చూస్తున్నారా..? కాపు నేతలంతా ఒకే తాటిపైకి రావాలనే ఈ వ్యాఖ్యలను చేశారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచిన గంటా.. టీడీపీ బండిలో అయితే కొనసాగడం లేదు. మరి ఆయన ప్రయాణించాలనుకుంటున్న బండిలో బెర్త్‌ ఎప్పటికి లభించేనో..?

Also Read : బాబు, రామోజీ, ఆర్‌కేలకు ప్రజల ద్వారా జగన్‌ ప్రశ్నావళి