iDreamPost
android-app
ios-app

సీమెన్స్ కేసులో గంటా శ్రీనివాసరావుతో పాటు కుమారుడు అరెస్టు

సీమెన్స్ కేసులో గంటా శ్రీనివాసరావుతో పాటు కుమారుడు అరెస్టు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన నంద్యాల పర్యటనలో ఉన్నారు. ఆర్ కే ఫంక్షన్ హాల్ వద్ద బస చేయగా.. ఆయన బస్సు వద్దకు శనివారం తెల్లవారు జామున పోలీసులు చేరుకున్నారు. తనను ఆధారాలు లేకుండా ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. స్కిల్ స్కామ్ లో తన పేరు ఎక్కడుందో చూపించాలని, ఆధారాలు ఉంటే ఉరి తీయాలని  అన్నారు. కేసు పేపర్లు, ఎఫ్ఐఆర్ కాపీని చూపించాలని ఆయన తరఫు లాయర్లు కోరగా.. రిమాండ్ రిపోర్ట్ ద్వారా అన్ని అనుమానాలను నివృత్తి చేస్తామని సీఐడీ అధికారులు వెల్లడించారు. అనంతరం చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆయన అరెస్టు చేస్తున్నారన్న నేపథ్యంలో నంద్యాలలో కాస్తంత హైడ్రామా నడించింది. ఆయన అరెస్టును ఖండిస్తూ టీడీపీ నేతలు, శ్రేణులు పెద్ద యెత్తున అక్కడకు చేరకున్నారు. వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్ మెంట్ లో అవకతవకలు జరిగాయని.. కాంట్రాక్టుల ద్వారా ముడుపుల రూపంలో చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే కేసులో గంటా శ్రీనివాసరావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు హయాంలో గంటా మానవ వనరుల శాఖ మంత్రిగా వ్యవహరించారు. విశాఖ పట్నంలోని తన నివాసంలో శ్రీనివాసరావుతో పాటు ఆయన కుమారుడు రవితేజను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలనకు విరుద్ధంగా చంద్రబాబుతో కలిసి ఏపీఎస్ఎస్‌డీసీని ఏర్పాటు చేశారన్న ఆరోపణలపై గంటా శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కొంటానని గంటా శ్రీనివాస్ వెల్లడించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడికి వైద్య పరీక్షలు నిర్వహించి, విజయవాడ తరలిస్తున్నారు. కాగా, కోనసీమ జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తండ్రి అరెస్టు విషయం తెలిసి.. వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.

రాజోలు మండలం పొదలాడలో ఉన్న ఆయనను పోలీసులు అడ్డుకోగా.. తన వెంట నాయకులు ఎవ్వరూ రావడం లేదని, తాను కుటుంబ సభ్యుడిగా వెళుతున్నానని చెప్పినప్పటికీ అంగీకరించలేదు. దీంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 2016-19 మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ – డిజైన్‌టెక్ సంస్థ‌లు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జ‌రిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 10శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చెల్లించింది. ప్ర‌భుత్వం చెల్లించిన రూ.370 కోట్లలో రూ.240 కోట్ల రూపాయ‌ల‌ను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థ‌కు బ‌ద‌లాయించారంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. 240 కోట్లు షెల్ కంపెనీల‌కు మ‌ళ్లించిన‌ట్టు ఏపీ సీఐడీ గుర్తించింది.