Idream media
Idream media
పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు చంద్రబాబు శథవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ ఇంఛార్జిలు లేని చోట… ఇంఛార్జిలను నియమించేందుకు స్థానిక నేతలతో భేటీ అయి వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అదే సమయంలో అంటీముట్టనట్లుగా ఉంటున్న ఇంఛార్జిలు, ఎమ్మెల్యేలతోనూ భేటీ అయి వారిని తిరిగి కార్యక్షేత్రంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల నుంచి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు. ఈ రోజు ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలో యాక్టివ్‌గా లేని ఇంఛార్జిలు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఎవరెవరు భేటీకి రావాలో ముందుగానే సమాచారం అందించారు. ఈ జాబితాలో విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు. అయితే ఈ రోజు భేటీకి గంటా డుమ్మా కొట్టి చంద్రబాబుకు షాక్ ఇచ్చారు.
చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు గంటా శ్రీనివాసరావు కూడా సిద్దంగా ఉన్నారని టీడీపీ శ్రేణులు, ఆ పార్టీ అనుకూలమీడియా ప్రచారం చేసింది. ఇటీవల నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని అనుకూల మీడియా హడావుడి చేసింది. ఈ ప్రచారం చూసినవారు.. నిజంగా గంటా చంద్రబాబుతో భేటీ అవుతారని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. భేటీకి డుమ్మా కొట్టారు. తనపై ఆశలు వదిలేసుకోవాలని స్పష్టమైన సంకేతాలు చంద్రబాబుకు, టీడీపీ శ్రేణులకు ఇచ్చారు గంటా శ్రీనివాసరావు.
ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మారే గంటా శ్రీనివాసరావు 2014లో భీమిలి నుంచి పోటీచేసి గెలిచారు. చంద్రబాబు మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో టీడీపీలో గంటా సైలెంట్ అయ్యారు. ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచే గంటా మౌనం వహించడం ప్రారంభించారు. వైసీపీలో చేరేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. వైసీపీలో చేరుతున్నట్లు పలుమార్లు గట్టి ప్రచారం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు గంటాకు బ్రేకులు పడుతున్నాయి. బీజేపీలో చేరేందుకు కూడా ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ ప్రయత్నాలు ఏవీ సఫలం కాలేదు. ఈ సమయంలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం తెరపైకి రావడం, దానికి వ్యతిరేకంగా కార్మికులు ఉద్యమం చేయడంతో.. గంటా ఉద్యమానికి మద్ధతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే ఒక షరతు పెట్టారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాతనే తన రాజీనామాను ఆమోదించాలని కండీషన్ పెట్టారు.
రాజకీయంగా స్తబ్ధుగా ఉంటూ.. ఎటూ తేల్చుకోని గంటా వల్ల పార్టీకి నష్టమేననే భావనలో చంద్రబాబు ఉన్నట్లున్నారు. అందుకే గంటా వ్యవహారాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ అవకాశం చంద్రబాబుకు ఇవ్వని గంటా శ్రీనివాసరావు.. భేటీకి గైర్హాజరై చంద్రబాబుకు క్లారిటీ ఇచ్చారు. ఈ పరిణామంతో ఇకపై టీడీపీ గంటాపై ఆశలు వదిలేసుకున్నట్లుగానే భావించొచ్చు. ఇప్పుడు మిగిలింది గంటా రాజకీయ పయనం ఎలా సాగబోతోందనేదే ఆసక్తికరమైన అంశం.
Also Read : గంటా వ్యవహారం తేల్చేస్తారా?