iDreamPost
iDreamPost
తెలంగాణలో భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు ఇటీవల అమరరాజా గ్రూప్ ప్రకటించడంతో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. జగన్ హయాంలో ఏపీ నుంచి కంపెనీలన్నీ తరలిపోతున్నాయని తెగ ఫైర్ అయ్యాయి. అమరరాజా కంపెనీ ప్రతిపక్ష టీడీపీకి చెందిన నాయకుడి కంపెనీ కావడంతో.. అధికార పార్టీ రాజకీయ కక్ష సాధింపుతోనే ఏపీ నుంచి తరిమేసిందని నానా మాటలు అన్నాయి. కట్ చేస్తే తాము ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్లు తాజాగా అమరరాజా గ్రూప్ ప్రకటించింది.
అమరరాజా కంపెనీ టీడీపీ నేత గల్లా జయదేవ్ కి చెందినది కావడంతో.. ఆ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు వార్తలు రాగానే విపక్షాలు దానిని అస్త్రంగా మలుచుకున్నాయి. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడి కంపెనీ కావడంతోనే.. రాజకీయ కక్ష సాధింపుతో ఏపీ నుంచి అమరరాజాను తరిమేశారని విరుచుకుపడ్డాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే “కారు నుంచి కట్‌డ్రాయర్ కంపెనీల దాకా పక్క రాష్ట్రంకి తరలిపోయాయ్” అంటూ సినిమాల్లో లాగా తనదైన శైలిలో పంచ్ డైలాగ్ కూడా కొట్టాడు. కానీ పది రోజుల కూడా తిరగకుండానే ఏపీలోని చిత్తూరు జిల్లాలో పెట్టుబడులు పెడుతున్నట్లు అమరరాజా గ్రూప్ ప్రకటించింది. ఏపీలో ఎదిగి తెలంగాణలో పెట్టుబడులన్న విమర్శలకు కాస్త బదులివ్వడానికి ప్రయత్నించింది.
చిత్తూరు జిల్లా తేనిపల్లి వద్ద 2.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో ఆటో బ్యాటరీ విడిభాగాల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తాజాగా అమరరాజా గ్రూపు ప్రకటించింది. ఈ ప్రాంతంలో తమ వ్యాపార విస్తరణకు కట్టుబడి ఉన్నట్లు జయదేవ్ చెప్పారు. కొత్త యూనిట్ ఏర్పాటు ద్వారా మరో 1,000 మంది స్థానికులకు ఉపాధి కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమరరాజా తాజా ప్రకటనతో అధికార పార్టీ శ్రేణులు విపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కక్ష సాధింపులకు దిగితే కొత్త పెట్టుబడులు ఎలా పెడుతున్నారని ప్రశ్నిస్తున్నాయి.