iDreamPost
android-app
ios-app

ముగిసిన ఎన్నిక‌లు.. మొద‌లైన పెట్రో బాదుడు

ముగిసిన ఎన్నిక‌లు.. మొద‌లైన పెట్రో బాదుడు

సుమారు నెల రోజులుగా పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు నిక‌రంగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే మార్చిలో రెండు సార్లు కాస్త ధ‌ర‌లు త‌గ్గాయి కూడా. కానీ, ఇటీవ‌ల వ‌రుస‌గా పెట్రోలు ధ‌ర‌లు పెరుగుతూ వ‌స్తున్నాయి. దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే బాదుడు మొద‌లైంద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. మూడు రోజుల్లోనే రెండు సార్లు పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌డ‌మే ఇందుకు కార‌ణం. అసలే దేశంలో ఒక పక్క కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.

మరోపక్క నిత్యావ‌స‌రాలు, అత్యవస వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. క‌రోనా కార‌ణంగా మాస్కులు, శానిటైజ‌ర్ల కోసం అద‌న‌పు బ‌డ్చెట్ వెచ్చించాల్సి వ‌స్తోంది. ఉద్యోగాలు, జీతాల కోత‌ల వంటి ఇలాంటి సమయంలో ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం దృష్టి సారించ‌క‌పోగా, ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు మళ్లీ మొద‌లుపెట్ట‌డంపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయ‌నే పేరుతో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. పెరుగుద‌ల పైస‌ల్లోనే క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ వ‌రుస‌గా పెరుగుతున్న ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే అవి మనకు రూపాయిల్లో కనిపిస్తాయి. అప్పుడు అర్ధం అవుతుంది ఎంత ఎక్కువ పెంచేశారో అని. చమురు ధరలు పెరగడం వల్ల ప్రతి నిత్యవసర వస్తువు మీద పెట్రో ధరల ప్రభావం పడుతుంది. ఫిబ్రవరి 23 తర్వాత వచ్చిన ఐదు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అప్పటి నుంచి పెట్రో ధరలను పెంచలేదు. అవి అయిపోయిన వెంటనే ధరలను మళ్లీ పెంచేశాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు పెరగగా, డీజిల్ ధర లీటరుకు 18 పైసలు పెంచింది. పెట్రోల్ లీటరుకు రూ.90.55, డీజిల్ లీటరుకు రూ.80.91 చొప్పున రిటైల్ కు అమ్ముతున్నాయి.

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కి రూ.0.17 పైసలు పెరిగి రూ.94.16కి చేరుకుంటే, డీజిల్ ధర లీటర్ రూ.0.20 పెరిగి రూ.88.25 అయ్యింది. విజయవాడలో పెట్రోల్ ధర లీటర్ 92.12 ఉండగా డీజిల్ ధర రూ.89.72 ఉంది. ధరలు పెరుగుదలకు ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ, వాస్తవానికి 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ధరలు పెంచితే ప్రజలు ఆగ్రహంతో ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేయరన్న ఉద్దేశంతో బలవంతంగా ధరలను స్థిరంగా ఉంచారనే విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ చమురు ధరల హెచ్చుతగ్గులను బట్టి ఇంధన ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి.

మ‌రోసారి తాజాగా..

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రెండు రోజుల పాటు స్థిరంగా ఉన్న ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు పెరిగింది. లీటర్ డీజిల్‌పై 34 పైసలు పెరిగింది. ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ ధరలు లీటరుకు ముంబైలో పెట్రోల్, రూ .97.86, డీజిల్‌ రూ .89.17, చెన్నై పెట్రోల్‌ రూ .93.38, డీజిల్‌ రూ .86.96, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ .91.66, డీజిల్‌ రూ.84.90 ఉండ‌గా, హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 95.13.డీజిల్ ధర రూ.89.47, విజయవాడలో పెట్రోల్ ధర రూ. 97.65 డీజిల్ ధర రూ.91.43 గా ప్ర‌స్తుతం ఉన్నాయి. ఇలా రోజురోజుకూ ధ‌ర‌లు పెరుగుతూ పోతున్నాయి.