iDreamPost
android-app
ios-app

‘తూర్పు’ రాజకీయం – ఒకప్పటి మిత్రులు.. నేడు రాజకీయ ప్రత్యర్థులు

‘తూర్పు’ రాజకీయం – ఒకప్పటి మిత్రులు.. నేడు రాజకీయ ప్రత్యర్థులు

రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఉండరనేది ఓ నానుడు. నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారడం లేదా రెండు రాజకీయ పార్టీల మధ్య ఎన్నికల పొత్తు పొడిచిన సందర్భంలో ఈ మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సందర్భాల్లోనూ కాదు రాజకీయ నేతలకు ఇది వర్తిస్తుందని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ తాజా రాజకీయం నిరూపిస్తోంది. ఇటీవల టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జిగా శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యంను నియమించడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలనే కాదు.. ఒకప్పటి మిత్రులు.. రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు.

సుబ్రమణ్యంది కొత్తపేట నియోజకవర్గం. రామచంద్రాపురం టీడీపీ ఇంఛార్జిగా ఉన్న తోట త్రిమూర్తులు వైసీపీ కండువా కప్పుకోవడంతో రెడ్డి సుబ్రమణ్యం ఇంఛార్జి బాధ్యతలు చేపట్టారు. వైసీపీ తరఫున చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ గత ఎన్నికల్లో గెలిచారు. రాజోలు నియోజకవర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ 2014లో కాకినాడ రూరల్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు ఆయన వైఎస్‌ రాజశేఖరరెడ్డి హాయంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పని చేశారు. 2006 పరిషత్‌ ఎన్నికల్లో వేణు.. రాజోలు నియోజకవర్గం పరిధిలోని సఖినేటిపల్లి మండలం నుంచి జడ్పీటీసీగా గెలుపొందారు. అనూహ్య పరిణామాల్లో ఆయనకు జిల్లా పరిషత్‌ పీఠం దక్కింది.

వాస్తవంగా 2006లో జిల్లా పరిషత్‌ పీఠం రెడ్డి సుబ్రమణ్యంకు దక్కాల్సింది. టీడీపీ నుంచి రాజకీయ జీవితం మొదలుపెట్టిన రెడ్డి సుబ్రమణ్యం కొత్తపేట సర్పంచ్‌గా పలుమార్లు పని చేశారు. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బండారు సత్యానందరావుతో ఉన్న విభేధాల కారణంగా హరికృష్ణ స్థాపించిన అన్న టీడీపీలో చేరారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా పని చేశారు. 1999 ఎన్నికల్లో అన్న టీడీపీ తరఫున కొత్తపేట నుంచి పోటీ చేసి 10,714 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన చిర్ల జగ్గిరెడ్డి కోసం పని చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు 2006 పరిషత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అభ్యర్థిత్వం దక్కింది. కొత్తపేట బీసీ జనరల్‌ అయినా అక్కడ నుంచి పోటీ చేయని శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన రెడ్డి సుబ్రమణ్యం రెడ్డి సామాజికవర్గం అధికంగా ఉండే రావులపాలెం నుంచి పోటీ చేస్తే సులువుగా విజయం సాధించొచ్చని భావించారు. అయితే అనూహ్యంగా ఆయన అక్కడ ఓడిపోయారు.

Also Read : తోట త్రిమూర్తుల స్థానాన్ని భర్తీ చేసిన టీడీపీ .. రామచంద్రాపురంలో ఆసక్తికర పోరు..!

2001లో జడ్పీటీసీగా పోటీ చేసిన చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ 2006లోనూ సఖినేటిపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు. చైర్మన్‌ అభ్యర్థి అయిన రెడ్డి సుబ్రమణ్యం ఓడిపోవడంతో.. జడ్పీ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంలో రెడ్డి సుబ్రమణ్యం అభిప్రాయానికి కాంగ్రెస్‌ పార్టీ పెద్దపీట వేసింది. తన సామాజికవర్గానికే చెందిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వైపు రెడ్డి సుబ్రమణ్యం మొగ్గుచూపారు. దీంతో చెల్లుబోయిన జడ్పీ చైర్మన్‌ అయ్యారు. జడ్పీ చైర్మన్‌గా చెల్లుబోయిన తీసుకునే నిర్ణయాలు రెడ్డి సుబ్రమణ్యంకు తెలిసే జరిగేవి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.

2009లో పీఆర్‌పీ ఏర్పాటుతో కొత్తపేట నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. టీడీపీ తరఫున పలుమార్లు ఎమ్మెల్యేగా పని చేసిన బండారు సత్యానందరావు పీఆర్‌పీ తీర్థం పుచ్చుకుని పోటీ చేశారు. కాపు సామాజికవర్గానికి చెందిన బండారు వెళ్లిపోవడంతో టీడీపీకి అభ్యర్థి కొరత ఏర్పడింది. జడ్పీటీసీగా ఓడిపోవడంతో జడ్పీ పీఠం చేజారడంతో.. శాసనసభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడ్డి సుబ్రమణ్యం కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున చిర్ల జగ్గిరెడ్డి రెండో సారి పోటీ చేశారు. త్రిముఖ పోరులో పీఆర్‌పీ అభ్యర్థి అయిన బండారు సత్యానందరావు గెలిచారు.

2014లో మళ్లీ బండారు టీడీపీలోకి రావడంతో రెడ్డి సుబ్రమణ్యానికి ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చిన చంద్రబాబు బండారుకు టిక్కెట్‌ ఇచ్చారు. ఎమ్మెల్సీ, ఆ తర్వాత మండలి డిప్యూటీ చైర్మన్‌ అయిన రెడ్డి సుబ్రమణ్యం పదవీ కాలం ఇటీవల ముగిసింది. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న రామచంద్రాపురం నియోజకవర్గ ఇంఛార్జి పదవిని రెడ్డి సుబ్రమణ్యంకు కట్టబెట్టారు. అక్కడ వైసీపీ తరఫున తన మిత్రుడు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణతో రెడ్డి సుబ్రమణ్యం రాజకీయం చేయబోతున్నారు. ఇద్దరు మిత్రులు రాజకీయ ప్రత్యర్థులుగా మారడంతో రామచంద్రాపురంలో రాజకీయం ఆసక్తికరంగా సాగబోతోంది. పైగా ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం (శెట్టిబలిజ) కావడంతో ఎవరిది పైచేయి అవుతుందో రాబోయే రోజుల్లో చూడాలి.

Also Read : మరోసారి అలిగిన బుచ్చయ్య.. ఈసారి నిజంగానే రాజీనామా చేస్తారా..?