iDreamPost
android-app
ios-app

విక్ట‌ర్ హ్యూగో కావ్యం, మ‌రుపూరి అనువాదం “బీద‌ల పాట్లు”

విక్ట‌ర్ హ్యూగో కావ్యం, మ‌రుపూరి అనువాదం “బీద‌ల పాట్లు”

విక్ట‌ర్ హ్యూగో (1802-85) ప్ర‌పంచ మ‌హార‌చ‌యిత. 1862లో “లెమిస‌ర‌బుల్స్ ” రాశారు. ఈ న‌వ‌ల ప్ర‌పంచంలోని అన్ని భాష‌ల్లోకి అనువాద‌మైంది. తెలుగులో బీద‌ల పాట్లు పేరుతో దాదాపు 70 ఏళ్ల క్రితం వ‌చ్చింది. ప్రముఖ విప్లవకారుడు భగత్ సింగ్ ను ప్రభావితం చేసిన రచనల్లో ఇది కూడా ఒకటి . అయితే ఈ కాపీ చాలా కాలంగా దొర‌క‌డం లేదు. ఇప్ప‌టికీ వ‌త్స‌ల గారు శ్ర‌మ తీసుకుని రీప్రింట్ చేశారు. ఆమెకి కృత‌జ్ఞ‌త‌లు. అనువాదం చేసింది మ‌రుపూరి కోదండ‌రామిరెడ్డి గారు, నెల్లూరు సొంతూరు. అంత పెద్ద న‌వ‌ల‌ని చ‌ద‌వ‌డ‌మే క‌ష్టం. దాన్ని అనువాదం చేయ‌డం మ‌రీ క‌ష్టం. హ్యూగో ఆత్మ‌ని అర్థం చేసుకున్నారు. తేనెప‌ట్టు నుంచి బొట్లుబొట్లుగా తేనె రాలిన‌ట్టు, న‌వ‌ల‌ని అలా పిండి , తెలుగు భాష సౌంద‌ర్యాన్ని మ‌న ముందు ప‌రిచారు. న‌వ‌ల చ‌దువుతూ ఉంటే ఏడు గుర్రాల సూర్యుడి ర‌థంలో మ‌నమూ ప్ర‌యాణిస్తున్నంత కాంతివంతంగా ఉంటుంది.

32 ఏళ్ల క్రితం మొద‌టిసారి ఈ న‌వ‌ల‌ని చ‌దివాను. క‌థా నాయ‌కుడు జీన్‌వాల్‌జిన్ ఆవ‌హించాడు. బిర‌డా తీస్తే ఎగ‌సిన భూతంలా జావ‌ర్త్ (పోలీస్ అధికారి) ప‌ట్టుకున్నాడు. పూన‌కం ప‌ట్టినోడిలా క‌న‌ప‌డిన వాళ్లంద‌రికీ చెప్పాను. చాలా మందికి అర్థం కాలేదు. మ‌న తెలుగు వాళ్లు పుస్త‌క ప్రియులు. తీసుకెళితే తిరిగి ఇవ్వ‌రు. ఆ ర‌కంగా బీద‌ల‌పాట్లు పోయింది. రైలు ప్ర‌యాణంలో త‌ప్పి పోయిన స్నేహితుడి కోసం వెతికిన‌ట్టు వెతికాను. దొర‌క‌లేదు. మిత్రుడు అనిల్ బ‌త్తుల కొంత కాలం క్రితం పీడీఎఫ్ పంపాడు. ఏమైనా చేతిలో పుస్త‌కం ఉంటే ఆ ఆనంద‌మే వేరు.

విక్ట‌ర్ హ్యూగో తండ్రి సైన్యంలో అధికారి. ఎపుడూ యుద్ధంలో ఉండేవాడు. త‌ల్లే పిల్ల‌ల్ని సాకింది. 15 ఏళ్ల వ‌య‌సులో హ్యూగో క‌విత్వం రాసి పోటీకి పంపితే జ‌డ్జిలు ఆశ్చ‌ర్య‌పోయారు. రాసింది చిన్న కుర్రాడంటే న‌మ్మ‌లేదు. త‌ర్వాత ఆయ‌న జీవిత‌మంతా రాస్తూనే ఉన్నాడు. ఇది కాకుండా 4 వేల బొమ్మ‌లు గీసాడు. రాజ‌కీయాల్లో పాల్గొని సెనేట్‌కి ఎంపిక‌య్యాడు. నెపోలియ‌న్ 3ని ఎదిరించి 17 ఏళ్లు ప్ర‌వాస జీవితం గ‌డిపాడు. క్ష‌మాభిక్ష ప్ర‌సాదిస్తే తిర‌స్క‌రించాడు. అమెరికాలో ఉంటూ బానిస‌త్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడాడు.

ఈ ప్ర‌పంచంలో ఒక్క‌రు బానిస‌త్వంలో ఉన్నా అది ప్ర‌పంచంలోని అంద‌రి స్వాతంత్ర్యానికీ మ‌చ్చ‌లాంటిది ఇండియాలో రాజ్యమేలుతున్న ఇంగ్లీష్ వాళ్ల‌ని నాగ‌రికత ముసుగులో ఉన్న అనాగ‌రికుల‌ని అన్నాడు.

లేమిస‌ర‌బుల్స్ న‌వ‌ల‌ని 17 ఏళ్లు రాశాడు. ఇందులో వ‌చ్చే ప్ర‌తిపాత్ర ఆయ‌న క‌ళ్ల‌తో చూసిందే. ఒక బ్రెడ్ ముక్క దొంగిలించిన వ్య‌క్తిని పోలీసులు తీసుకెళుతుంటే నిస్స‌హాయంగా చూస్తున్న ఆయ‌న భార్య‌, కూతురి క‌న్నీళ్ల‌ని చూశాడు. న్యాయం పేరుతో జ‌రుగుతున్న అన్యాయాన్ని నిర‌సించాడు. మ‌ర‌ణశిక్ష‌ని వ్య‌తిరేకించాడు ( ఆరోజుల్లో గిలెటిన్ యంత్రాల కింద‌ మ‌నుషుల త‌ల‌ల్ని న‌రికేవాళ్లు).

పేద‌రికంతో దిగ‌జారిన వాళ్లు , ఆక‌లికి ఆత్మ‌ని అమ్ముకున్న వాళ్లు, చీక‌ట్లో బాల్యం గ‌డుపుతున్న వాళ్లు ఉన్నంత వ‌ర‌కూ ఈ న‌వ‌ల ఉంటుంది.

“ఎక్క‌డైతే బిడ్డ‌ల ఆక‌లి తీర్చ‌లేని త‌ల్లుల క‌న్నీళ్లుంటాయో, ఎక్క‌డైతే పిల్ల‌లు నేర్చుకోడానికి చిన్న పుస్త‌కం కూడా ఉండ‌దో ఆ ఇంటి త‌లుపుల్ని నా నవ‌ల త‌డుతుంది. తెర‌వండి, నేను వ‌చ్చాను” అంటుంది. త‌న పుస్త‌కం గురించి హ్యూగో చెప్పిన మాట‌లివి.

ఈ న‌వ‌ల‌కి జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టార‌ని చాలా కాలం వ‌ర‌కూ హ్యూగోకి తెలియ‌దు. ఆయ‌న ప్ర‌వాస జీవితంలో ఉన్నాడు.

క‌రుణతో నిండిన ర‌చ‌న‌ల వెనుక ద‌ట్ట‌మైన విషాదం ఉంది. తొలి బిడ్డ ఏడాది తిర‌క్కుండా చ‌నిపోయాడు. 18 ఏళ్ల పెళ్లైన కూతురు భ‌ర్త‌తో స‌హా ప‌డ‌వ ప్ర‌మాదంలో చ‌నిపోయింది. ఇది జ‌రిగిన‌ప్పుడు హ్యూగో చాలా దూరంలో ఉన్నాడు. స‌మాచార సాధ‌నాలు లేని కాలం. ఒక కేఫ్‌లో కాఫీ తాగ‌డానికి వెళితే న్యూస్ పేప‌ర్లో ఈ వార్త క‌నిపించింది. పొర్లిపొర్లి ఏడ్చాడు. ఆ అమ్మాయి స‌మాధి ముందు కూచుని క‌విత్వం రాస్తే అద్భుత‌మ‌న్నారు జ‌నం.

దేశ బ‌హిష్క‌ర‌ణ‌లో ఉన్న‌ప్పుడు భార్య చ‌నిపోయింది. ఎదిగిన ఇద్ద‌రు కొడుకులు క‌ళ్ల ముందు చ‌నిపోతే మ‌నుమ‌ళ్లు, మ‌నుమ‌రాళ్ల‌ని తానే సాకాడు. ఒక కూతురు మ‌తిస్థిమితం కోల్పోతే ద‌గ్గ‌రుండి సంర‌క్షించాడు.

ఆయ‌న 80వ పుట్టిన రోజు ప్యారిస్‌లో ఎంత గొప్ప‌గా జ‌రిగిందంటే 7 గంట‌ల పాటు వేల మందితో హ్యూగో ఇంటి ముందు పెరేడ్ జ‌రిగింది. ఆయ‌న పాట‌లు పాడారు, క‌విత్వం చ‌దివారు, నాట‌కాలు వేసారు. బాల్క‌నీలో ఒక కుర్చీ వేసుకుని హ్యూగో ఇదంతా చూశాడు. ఆయ‌న ఇల్లు ఉన్న వీధికి ఆయ‌న పేరే పెట్టారు. ఒక ర‌చ‌యిత బ‌తికుండ‌గా ద‌క్కిన అరుదైన గౌర‌వం.

ఉత్త‌రం రాయాలంటే విక్ట‌ర్ హ్యూగో, విక్ట‌ర్ హ్యూగో వీధి, పారిస్ అని రాయాలి. నిజానికి విక్ట‌ర్ హ్యూగో అని రాస్తే చాలు పారిస్‌కు ఉత్త‌రం వెళ్లేది.

ఆయ‌న‌ని ఒక భిక్ష‌గాడిలా పాతి పెట్ట‌మ‌ని ఆఖ‌రి కోరిక కోరాడు. అది నెర‌వేర‌లేదు. అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. 20 ల‌క్ష‌ల మందితో పారిస్ నిండిపోయింది.

వీలునామాలో ఇలా రాసాడు

నా ద‌గ్గ‌రున్న 50 వేల ఫ్రాంకుల్ని పేద‌ల‌కివ్వండి. చ‌ర్చిల్లో నా మ‌ర‌ణానంత‌రం ప్రార్థ‌న‌లు చేయ‌కండి. నా కోసం కాదు అంద‌రి కోసం ప్రార్థించండి. నాకు దేవుడిపై న‌మ్మ‌కం ఉంది.

ఆఖ‌రి ఉప‌న్యాసంలో “20వ శ‌తాబ్దంలో యుద్ధం చ‌నిపోతుంది. స‌రిహ‌ద్దులు చ‌నిపోతాయి, పేద‌రికం అజ్ఞానం చ‌చ్చిపోతాయి. ద్వేషం చ‌చ్చిపోతుంది. కేవ‌లం స్వ‌చ్ఛ‌మైన మ‌నిషి మాత్ర‌మే బ‌తికుంటాడు” అని ఆశించాడు. నెర‌వేర‌లేదు.

ప్రాన్స్ విప్ల‌వ నేప‌థ్యంలో రాసిన న‌వ‌ల‌ని , గ్రాంథికం వ్య‌వ‌హారిక తెలుగు పెన‌వేసుకున్న కాలంలో అనువాదం చేసిన ఈ న‌వ‌ల‌ని ఎందుకు చ‌ద‌వాలంటే అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఏమీ మార‌లేదు. యుద్ధం లేక‌పోవ‌చ్చు, బీభ‌త్సం ఉంది. ర‌క్తం క‌న‌ప‌డ‌క పోవ‌చ్చు గాయాలున్నాయి. సంఘ‌ర్ష‌ణ తీవ్ర‌మైంది.

చెడ్డ‌వాళ్లు ఎలాగూ చెడ్డ‌ప‌నులే చేస్తారు. మంచివాళ్లు కూడా చెడ్డ‌ప‌నులు చేసే అనివార్య‌త వ‌చ్చింది. ఒక ప‌రీక్షా స‌మ‌యం , క‌ష్ట‌కాలం వ‌చ్చిన‌ప్పుడు జీన్‌వాల్‌జిన్‌లా స‌త్యం కోసం నిల‌బ‌డ్డామా? క‌నీసం జావ‌ర్త్‌గానైనా ప్ర‌వ‌ర్తించామా? మ‌న‌సులో ఒక లిట్మ‌స్ టెస్ట్ కోసం.

హ్యూగో ఇప్పుడు లేరు, మ‌రుపూరి కోదండ రామిరెడ్డి కూడా లేరు. వాళ్లు ఇచ్చిన కానుక ఉంది. పుస్త‌కం కావాల్సిన వాళ్లు 9490472427 నెంబ‌ర్‌ని సంప్ర‌దించండి.