Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన విషయం తెలిసిందే. జగన్ రాకతో విద్యా విధానంలో చారిత్రక మార్పులు ప్రారంభమయ్యాయి. సీఎం జగన్ ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చి దిద్దారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్ల ఆధునికీకరణ కార్యక్రమం ‘నాడు–నేడు’ తో స్కూళ్లు కళకళలాడుతున్నాయి. నవ ఉత్సాహాన్ని నింపుకుంటున్నాయి.
దీనికి తోడు పథకాల అమలు అద్భుతంగా సాగుతోంది. నగదు బదిలీ రూపంలో ‘అమ్మ ఒడి’ పథకం అమలు చేస్తున్నారు. ‘జగనన్న విద్యా కానుక’ అంటూ పిల్లలకు అవసరమైన సామాగ్రిని అందించారు. ‘నాడు- నేడు’ పేరుతో పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దారు. మొత్తం స్కూళ్లలో మూడోవంతు బడులు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించారు. కొత్త పథకాలు, మౌలిక వసతుల కల్పన కారణంగా అత్యధిక మంది ప్రభుత్వ బడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే 2.5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడుల్లో చేరినట్లు తెలుస్తోంది. ఇదే విధానంలో విశాఖ నగరంలో మోడల్ స్కూళ్లను తీర్చిదిద్దారు. వీటిపై ఇతర రాష్ట్రాలే కాదు.. దేశాల దృష్టి కూడా పడుతోంది.
ఆశ్చర్యంతో సహకారానికి ముందుకు
జీవీఎంసీ తీర్చిదిద్దిన మోడల్ కార్పొరేషన్ స్కూళ్లను చూసి అచ్చెరువొందిన ఫ్రాన్స్ ప్రభుత్వం మరిన్ని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు సహకారం అందిస్తోంది. గ్రేటర్ పరిధిలోని 44 కార్పొరేషన్ స్కూళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సిటీ ఇన్వెస్ట్‌మెంట్ టు ఇన్నోవేట్ అండ్ సస్టైన్ (సిటీస్) పేరుతో ఫ్రెంచ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ఏఎఫ్‌డీ) రూ.52 కోట్ల నిధులు సమకూర్చింది.
ఈ నిధులతో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టాలనే అంశాలపై సిటీస్ బృందం ఇప్పటికే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, జీవీఎంసీ అధికారులతో సమావేశమైంది. వారి నుంచి సలహాలు సూచనలు స్వీకరించింది. నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు విభిన్న ప్రాజెక్టులతో ముందుకెళ్తున్న మహా విశాఖ నగర పాలక సంస్థ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. సిటీస్ చాలెంజ్ పేరుతో ఏడాది కిందట జరిగిన పోటీలో 15 నగరాలకు సంబంధించి మొత్తం 26 ప్రాజెక్ట్‌లు ఎంపికవ్వగా.. ఇందులో కార్పొరేషన్ పాఠశాలలను ఆధునికీకరించిన జీవీఎంసీ ప్రాజెక్ట్ అవార్డు సొంతం చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని ఆకర్షించింది. దీనికి ఫిదా అయిన ఫ్రాన్స్ ప్రభుత్వ అనుబంధ సంస్థ ఫ్రెంచ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ఏఎఫ్‌డీ) మరిన్ని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది.