iDreamPost
android-app
ios-app

శుభోదయం…శ్రీరామోదయం..!

శుభోదయం…శ్రీరామోదయం..!

నేడే అమోధ్యలో రామాలయానికి శంకుస్థాపన

కోట్ల మంది కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూసిన రోజు… ఎంతోమంది రాజీలేని పోరాటనికి పుణ్యం, పురుషార్థం దక్కబోయే రోజు.. రానే వచ్చింది. శ్రీరామ జన్మభూమిగా హిందువులకు పవిత్రమైన అయోధ్యలో నేడు రామాలయానికి శంకుస్థాపన జరగనుంది. అదీ రాముడు జన్మించిన అభిజిత్‌ ముహూర్తంలో సరిగ్గా మధ్యాహ్నం 12.44 నుంచి 12.45 గంటల(32వ సెకండు వద్ద) మధ్య ప్రధాని నరేంద్రమోదీ  రామాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా నేడు శుబోధయం కాస్తా శ్రీరామోదయంగా మారిందా అన్నట్లు తయారైంది పరిస్థితి….!

ఆనందహేల…

అయోధ్యలో రామాలయానికి శంకుస్థాపన జరుగుతుండటంతో రామభక్తుల ఆనందానికి అవధుల్లేవు. ఇక ఏటా ఆకాశమంత పందిరి, భూదేవంత మండపం వేసి శ్రీరామనవమిని ఘనంగా నిర్వహించే భక్తుల సంతోషమైతే పట్టలేనట్టుగా ఉంది. వాస్తవానికి దేశంలో రామాలయం లేని ఊరే లేదు అనే నానుడి ఉన్నప్పటికీ అయోధ్యలో రామాలయం లేకపోవడం విశేషమే. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్యలో రామాలయ నిర్మాణం చేపట్టబోయే స్థలం చుట్టూ నెలకొన్న వివాదం సమసిపోయిన సంగతి తెలిసిందే.

175 మంది ఆహ్వానితులు

రామాలయ శంకుస్థాపన మహాత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ సహా మొత్తం 175 మందిని ఆహ్వానించారు. ఇందులో దాదాపు 135 మంది పీఠాధితపతులు, సాధుపుంగవులే ఉండటం విశేషం. ఆహ్వానితులు 175 మంది ఉన్నప్పటికీ వేదికపై ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్, ట్రస్టు చీఫ్‌ నృత్య గోపాల్‌దాస్‌ మహరాజ్, ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు మాత్రమే ఉండనున్నారు. ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్‌జోషి వంటి నేతలు వీడయో కాన్ఫెరెన్స్‌ ద్వారా కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే ఆహ్వానాలు అందుకున్నవారిలో బాబ్రీ మసీదు కేసులో కక్షిదారయిన ఇక్బాల్‌ అన్సారీ, అనేక ఏళ్లుగా అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తోన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత మొహమద్‌ షరీఫ్‌లు సైతం ఉండటం విశేషం.
 
ఆలయ నిర్మాణ ప్రత్యేకతలు

రామాలయాన్ని 161 అడుగుల ఎత్తు, 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పుతో నిర్మించనున్నారు. ఇందులో ఒకేసారి 80 వేల నుంచి లక్ష మంది రాముడిని సేవించవచ్చు. ఆలయంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు మరో రెండు అంతస్తులు ఉంటాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో శ్రీరాముడి గర్భగుడితోపాటు ఐదు మండపాలు ఉంటాయి. గర్భగుడిని అష్టభుజి ఆకృతిలో నిర్మించనున్నారు. మొదటి అంతస్తులో రాముడు, సీత, లక్ష్మనుడు, హనుమంతుడి విగ్రహాలతో రామదర్భార్‌ ఉంటుంది. రెండో అంతస్తును కళాత్మక సౌందర్యం(ఖాళీ గది) కోసం నిర్మించారు. దీనిలో ప్రవేశం నిషేధం. ఆలయం నిర్మాణంలో ఒక శిఖరంతోపాటు ఐదు గోపురాలు ఉంటాయి. రాజస్థాన్‌లో లభించే 3.25 క్యూబిక్‌ అడుగుల పింక్‌ స్టోన్‌(కింగ్‌ ఆఫ్‌ స్టోన్‌)ను ఆలయ నిర్మాణంలో వినియోగించనున్నారు. నిర్మాణంలో ఇనుమును అస్సలు వాడట్లేదు. మూడు నుంచి మూడున్నరేళ్లలో రామాలయ నిర్మాణం పూర్తికానుంది.

3 దశాబ్దాల క్రితమే…

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి దాదాపు మూడు దశాబ్దాల కిందటే డిజైన్‌ పూర్తయింది. కాగా, తాజాగా పాత డిజైన్‌ను మెరుగుపరచి నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఆలయాల నిర్మాణంలో అహ్మదాబాద్‌కు చెందిన సోమ్‌పుర వంశస్తులకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. వారే ప్రముఖ సోమనాథ్, అక్షరధామ్‌ సహా 200పైగా ఆలయాలకు డిజైన్‌ చేశారు. ప్రస్తుతం ఆ వంశానికే చెందిన చంద్రకాంత్‌ సోమ్‌పుర తన ఇద్దరు కుమారులతో కలిసి రామమందిర నిర్మాణానికి డిజైన్‌ను రూపొందించారు. కాగా, 30 ఏళ్ల క్రితమే విశ్వహిందూ పరిషత్‌ నాయకుడు అశోక్‌ సింఘాల్‌ మందిర నిర్మాణానికి డిజైన్‌ రూపొందించాలని చెప్పినట్టు చంద్రకాంత్‌ వెల్లడిస్తుండటం విశేషం.

కరోనా టెస్టు తప్పనిసరి..!

కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా నిర్వాహుకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కార్యక్రమానికి హాజరయ్యే వారంతా తప్పనిసరిగా కరోనా వైరస్‌ నెగటివ్‌ సర్టిఫికెట్‌ను తీసుకురావాలంటూ సూచిస్తున్నారు. అలాగే ఆహ్వానితులు సెక్యూరిటీ కోడ్‌ కలిగిన ఇన్విటేషన్‌ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలంటున్నారు.

వెండి నాణేలు

ప్రధాని నరేంద్రమోదీ 40 కేజీల వెండి ఇటుకతో రామాలయానికి శంకుస్థాపన చేయనుండగా ఆహ్వానితులకు ప్రసాదంగా వెండి నాణెలను అందించనున్నారు. దానిపై ఒకవైపు శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడితో కూడిన రామదర్భార్, మరో వైపు ట్రస్టు చిహ్నం ఉండనున్నాయి. అలాగే గెస్టులకు లడ్డూ బాక్స్, రామదర్భార్‌ చిత్రపటాన్ని బహుకరించనున్నారు. దాదాపు 1.25 లక్షల లడ్డూలు(రఘుపతి లడ్డూలు)లను గెస్టులు, అమోధ్య నివాసులకు పంచిపెట్టనున్నారు.