Idream media
Idream media
ఏంతో కాలంగా ఎదురుచూస్తున్నరహదారులు,బ్రిడ్జిల పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ మోహన్ రెడ్డి పలుసార్లు కేంద్ర మంత్రులను,ప్రధాని మంత్రిని కలిసి అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. ఇందులో భాగంగా గత సంవత్సరం ఆగస్టులో ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరిని జగన్ కలిసి జాతీయ రహదారులకు సంబంధించిన పలు ప్రతిపాదనలు అందచేశారు.
కోవిడ్ వలన పనులు అనుకున్నట్లు సాగలేదు.కోవిద్ ప్రభావం తగ్గుతుండటంతో కేంద్రం అభివృద్ధిపనుల మీద దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను కూడా కార్యరూపం ఇస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ను ఆనుకుని ఉన్న జాతీయ రహదారులకు మహర్ధశ పట్టనుంది. జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధితో పాటు కనెక్టివిటీ, రోడ్డు ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణ పనులకు సంబంధించి 26 ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆయా పనులకు సంబంధించి ఈ నెల 18న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తూ లేఖ రాశారు. దేశాభివృద్ధికి ఉపయోగపడేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు చేపట్టడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రూ. 15, 591.9 కోట్ల అంచనా వ్యయంతో ఆయా ప్రాజెక్టులకు చేపట్టనున్నారు. ఇప్పటికే పోలవరం నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారు. తాజాగా జాతీయ రహదారుల అభివృద్ధికి శంకుస్థాపన చేస్తుండడంతో ఏపీ ముఖ్యమంత్రి, ఎంపీల వినతులకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.
విజయవాడపై తగ్గనున్న ట్రాఫిక్ భారం
ఈ ఎన్‌హెచ్ ప్రాజెక్టులు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా ప్రయాణం మరింత ఈజీ కానుంది. ప్రధానంగా విజయవాడపై ట్రాఫిక్ భారం తగ్గనుంది. ఈ ప్రాజెక్టుల్లో వీటిలో విజయవాడ సమీపంలోని గొల్లపూడి నుంచి కృష్ణా నది మీద నిర్మించే వంతెన మీదుగా చినకాకాని వరకు 17.88 కిమీ దారం నిర్మించే ఆరు వరసల బైపాస్ రహదారి ఒకటి. అలాగే గొల్లపూడి నుంచి చిన అవుటపల్లి వరకు 30 కి.మీ మేర నిర్మించే మరో ఆరు వరసల బైపాస్ రోడ్డు. ఈ రెండు ప్రాజెక్ట్‌ల వలన కోల్‌కత్తా-చెన్నై, కోల్‌కత్తా-హైదరాబాద్ నగరాల మధ్య ట్రాఫిక్ అంతరాయం లేకుండా సాగుతుంది. విజయవాడ నగరంపై ట్రాఫిక్ భారం చాలా వరకు తగ్గుతుంది. అలాగే ఎన్ హెచ్ -16 లోని మెయిన్ క్యారేజ్‌వే, సర్వీస్ రోడ్ మధ్య బెంజ్ సర్కిల్ దాటి, జ్యోతి మహల్ జంక్షన్ నుంచి రమేష్ హాస్పిటల్ జంక్షన్ వరకూ మూడు వరుసల ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు.
సుమారు 1,411 కిలో మీటర్ల మేర..
ఎన్ హెచ్ 340ను ఆనుకుని ధర్మవరం – పాకాలను మీదుగా కుర్బలకోట, మదనపల్లి మధ్య రెండు లేన్ల ఆర్ఓబీ, సబ్ వే నిర్మాణం, రాయపూర్ – విశాఖపట్టణం సెక్షన్ కు చెందిన ఎన్ హెచ్ 26లో సాలార్ టౌన్ వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర బైపాస్ నిర్మాణం, అలాగే ఎన్ హెచ్ – 544డి అనంతపూర్ – గుంటూర్ మార్గంలో 2 నుంచి 4 లేన్లలో జాతీయ రహదారి విస్తరణ, నెల్లూరు జిల్లాను ఆనుకుని ఉన్న ఎన్ హెచ్ 67లో నాలుగు లేన్ల ఫ్లై ఓవర్ల నిర్మాణం.. వీటితో పాటు గుడివాడ – ధర్మవరం సెక్షన్, సాలూరు నుంచి గజపతినగరం సెక్షన్, విజయవాడ సిటీ పరిధిలోని భవానీపురం – కనకదుర్గమ్మ వారధి జంక్షన్, విజయనగరం జంక్షన్, అలాగే సీఆర్ఐఎఫ్ స్కీమ్ కింద 613 కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణ.. ఇలా ఆంధ్రప్రదేశ్ నలువైపులా బోర్డర్లను కూడా ఆనుకుని సుమారు 1,411 కిలో మీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి, నిర్మాణంతో పాటు ఫ్లై ఓవర్లు, ఆర్ఓ బీ ల నిర్మాణానికి కేంద్ర మంత్రి గడ్కరీ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు.