iDreamPost
iDreamPost
బలమైన ప్రత్యర్ధులు ఉంటే బలమైన నాయకుడిగా ఎదుగుతారు..
కడప జిల్లాలో వైయస్‌ఆర్ తిరుగులేని నేతగా ఎదగటానికి ముందు రెడెప్పగారి రాజగోపాలరెడ్డి , కందుల ఓబుళరెడ్డి, బిజివేముల వీరారెడ్డి, ఎద్దుల ఈశ్వర్ రెడ్డి పెద్దనాయకులు.
వీరిలో ఎద్దుల ఈశ్వర్ రెడ్డి సిపిఐ పార్టీ తరుపున నాలుగుసార్లు కడప ఎంపీగా గెలిచారు. బిజివేముల వీరారెడ్డి టీడీపీ ఆవిర్భవానికి ముందే రెండుసార్లు కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యే గా గెలిచిన నేత,1983 ఎన్నికల్లో ICJ (జగజ్జీవన్ రామ్ కాంగ్రెస్) తరుపున బద్వేల్ నుంచి పోటీచేసి టీడీపీ మద్దతుతో గెలిచి టీడీపీలో చేరారు, అప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మరణంతో 2001లో జరిగిన ఉపఎన్నికల్లో ఆయన కూతురు బద్వేల్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున గెలిచారు. 2009 నియోజకవర్గాల పునఃవిభజనలో బద్వేల్ SC రిజర్వేడ్ కావటంతో వీరారెడ్డి కుటుంబానికి మరోసారి పోటీచేసే అవకాశం రాలేదు. ఆ మధ్య జగన్ ను కలిశారు కానీ రాజకీయంగా క్రియాశీలకంగా లేరు.
వైయస్‌ఆర్ కు ఓటమి రుచి చూపించాలని తపించిన వీరా రెడ్డి 1996 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఓటమి అంచుల వరకు తీసుకువెల్లగలిగారు కానీ ఓడించలేకపొయారు. ఆ ఎన్నికల్లో వైయస్‌ఆర్ 5,435 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు… ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ వివేకానందరెడ్డి మీద టీడీపీ తరుపున బీటెక్ రవి గెలిచినప్పుడు “ఈ గెలుపు వీరారెడ్డికి అంకితం” అని ప్రకటించారంటే వైయస్‌ఆర్ ఓటమి కోసం వీరారెడ్డి ఏస్థాయిలో తపించారో అర్ధం చేసుకోవచ్చు.
ఇక మిగిలిన నాయకుల్లో రెడెప్పగారి రాజగోపాల్ రెడ్డి (పులివెందుల సతీష్ రెడ్డి మేనత్త భర్త), కందుల ఓబుళరెడ్డి.. వీరిద్దరి మరియు వీరి వారసుల రాజకీయ జీవితం వైయస్‌ఆర్ ఎదుగుదలలో ముడిపడినవి.వైయెస్ఆర్ రాజకీయ ఎదుగుదల,వీరి తరుగుదల.. ఒకదానితో ఒకటి ముడిపడిన రాజకీయం.
Also Read: అప్పులు చేస్తున్న ప్రజలు.. రుణాలు తగ్గిస్తున్న బ్యాంకులు
వైయెస్ఆర్ ,కందుల విభేదాలు …
కందుల ఓబుళరెడ్డి సీనియర్ రాజకీయ నాయకుడు.1977,1980 లోక్ సభ ఎన్నికల్లో కడప నుంచి ఇందిరా కాంగ్రెస్/కాంగ్రెస్ తరుపున గెలిచారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ కడప జిల్లా బాధ్యత ఓబుళరెడ్డిదే. ఇందిరా స్వయంగా కడపకు ప్రచారానికి కూడా వచ్చారు.
1978 ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ తరుపున వైయస్‌ఆర్ గెలిచారు. ఆ ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ తరుపున గెలిచిన 30 మంది కొన్ని నెలలోనే ఇందిరా కాంగ్రెసులో చేరిపోయారు. చివరికి జాతీయ అధ్యక్షుడు కాసు బ్రహ్మానందరెడ్డి కూడా ఇందిరా వర్గంలో చేరిపోయారు.
కందుల ఓబుళరెడ్డి సొంత గ్రామం పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె మండలం తాళపల్లె వెలమవారి పల్లె. 1978 ఎన్నికల్లో వైయస్‌ఆర్ మీద బలమైన నేతను పోటీకి దించిన కందుల ఓబుళరెడ్డి తో ఆ ఎన్నికల నుంచే వైయెస్ఆర్ కు పడేదికాదు.
టీడీపీ – అల్లుడి రాజకీయం
1983 ఎన్నికల్లో కందుల ఓబుల రెడ్డి అల్లుడు రామమునిరెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చింది. ఓబుల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండి అల్లుడ్ని టీడీపీలోకి పంపించాడని ప్రత్యర్ధులు విమర్శించారు . ఆ ఎన్నికల్లో గెలిచిన రామమునిరెడ్డి కి మంత్రిపదవి కూడా దక్కింది. ప్రొద్దుటూరు నుంచి గెలిచిన ఎంవి రమణరెడ్డికి దక్కుతుందనుకున్న మంత్రిపదవి ఓబుళరెడ్డి మంత్రాంగంతో అల్లుడికి దక్కిందని ప్రచారం జరిగింది.
ఓబుళరెడ్డి బహిరంగంగా ఎక్కడ టీడీపీకి అనుకూలంగా మాట్లాడకపోయినా రామమునిరెడ్డికి ఆయనదే దిశానిర్ధేశం అనేది బహిరంగ రహస్యం. ఓబుళరెడ్డికి రాజకీయ వారసుడవుతాడనుకొన్న రామమునిరెడ్డి నాదెండ్ల వర్గంలోకి వెళ్లటంతో రాజకీయంగా కనుమరుగయ్యాడు.
Also Read: వైఎస్ జగన్ సంకల్పం.. ఏపీ దశను మార్చబోతోందా..?
1984 లోక్ సభ ఎన్నికలు – ఓబుల రెడ్డి ఓటమి
1952 ఎన్నికల నుంచి మొన్నటి 2019 లోక్ సభ ఎన్నికల వరకు కడప లోక్ సభ స్థానం నుంచి ఎనిమిది మంది గెలిచారు. వీరిలో 1957లో గెలిచిన ఊటుకూరు రామిరెడ్డి (మైసూరా రెడ్డి మేనమామ) ది కమలాపురం కాగా సిపిఐ తరుపున నాలుగుసార్లు గెలిచిన ఎద్దుల ఈశ్వర్ రెడ్డిది జమ్మలమడుగు,మిగిలిన వారందరు పులివెందులకు చెందిన వారే. వైయస్‌ఆర్ కుటుంబం నుంచే వైయెస్ఆర్, వివేకా నందరెడ్డి, జగన్, అవినాష్ నలుగురు ఉండగా, కందుల ఓబుల రెడ్డి రెండుసార్లు, టీడీపీ తరుపున 1984లో డి.యన్.రెడ్డి ఒక్కసారి గెలిచారు. పులివెందులలో వచ్చే మెజారిటీనే కడప లోక్ సభ విజేతను నిర్ణయిస్తుంది.
1984 లోక్ సభ ఎన్నికలో టీడీపీ తరుపున పులివెందులకు చెందిన డి.యన్.రెడ్డి పోటీచేయగా, కాంగ్రెస్ తరుపున పోటీచేసిన ఓబుళరెడ్డి యాబై వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు.పులివెందుల పరిధిలో టీడీపీకే మెజారిటీ వచ్చింది. దీనితో వైయస్‌ఆర్ వర్గం తనకు ఓట్లు వేయించలేదని ఓబుళరెడ్డి ఆరోపించాడు. 1984 ఎన్నికలప్పుడు వైయస్‌ఆర్ పీసీసీ అధ్యక్షుడు,ఆయన మీద చర్య తీసుకోవాలని ఓబుళరెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశాడు. ఒక దశలో కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నాని ప్రకటించాడు కూడ కానీ కాంగ్రెస్ పెద్దల బుజ్జగింపు రాజీనామాను విరమించుకున్నాడు.
కందుల శివానందరెడ్డి రాజకీయ రంగప్రవేశం
ఓబుల రెడ్డి కొడుకులు శివానందరెడ్డి, రాజమోహన్ రెడ్డి మొదటి నుంచి వ్యాపారం మీద దృష్టిపెట్టారు. ప్రధానంగా మైనింగ్, షిప్పింగ్, విద్యాసంస్థలు ఉండేవి. ఢిల్లీలో చదువుకుంటూ యాక్సిడెంట్‌లో చనిపోయిన చిన్నకొడుకు శ్రీనివాసరెడ్డి పేరుతో KSRM ఇంజినీరింగ్ కాలేజీని 1980లో కడపలో స్థాపించారు.
కందుల శివానందరెడ్డి 1981లో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.కానీ తమ బావ రామమునిరెడ్డి 1983 ఎన్నిక్కలో టీడీపీ తరుపున ఎమ్మెల్యే కావటంతో రాజకీయంగా క్రియాశీలకంగా ఉండేవారు కాదు.
1989 ఎన్నికల్లో చెన్నారెడ్డి మద్దతుతో శివానందరెడ్డికి కడప ఎమ్మెల్యే సీట్ దక్కింది. అదే 1989లో జమిలీగా జరిగిన ఎన్నికల్లోవైయస్‌ఆర్ తొలిసారి లోక్ సభకు పోటీచేసి గెలిచారు. ఇదే ఎన్నికల్లో రెడ్డివారి రాజగోపాల్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరి లక్కిరెడ్డిపల్లె నుంచి ఎమ్మెల్యే గా గెలిచారు.
1989-1994 మధ్య ముగ్గురు ముఖ్యమంత్రులు మారినప్పుడు వైయస్‌ఆర్ ముఖ్యమంత్రి కావటానికి చేసిన ప్రయత్నాలకు కందుల,రెడెప్ప గారి రాజగోపాల్ రెడ్డి, మైసూరా రెడ్డి నుంచి మద్దతు దక్కకపోవటంతో మరోసారి వర్గ రాజకీయాలు మొదలయ్యాయి. తన సొంత జిల్లా ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వకపోవటంతో 1994 ఎన్నికల్లో వైయస్‌ఆర్ వర్గం కందుల, రెడెప్ప గారి రాజగోపాల్ రెడ్డి, మైసూరా రెడ్డి తదితరులకు వ్యతిరేకంగా పనిచేసింది, అందరూ ఓడిపోయారు.
Also Read: అమరావతి వ్యవహారంలో సీపీఎం వైఖరి ఎందుకు మారింది?
1996 లోక్ సభ ఎన్నికలు ..
1996 ఎన్నికల సమయంలో బద్వేల్ వీరారెడ్డి మంత్రిగా ఉన్నాడు వైయస్‌ఆర్ ను ఓడించాలంటే ఆర్ధికంగా బలమైన నేత కావాలని భావించి శివానందరెడ్డి తమ్ముడు కందుల రాజమోహన్ రెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చి సీట్ ఇచ్చారు. ఎస్పీ గా ఉమేష్ చంద్ర ఉండేవాడు.
వీరారెడ్డి, రాజగోపాలరెడ్డి, మైసూరా రెడ్డి రాజకీయ వ్యూహాలు, తులసిరెడ్డి ప్రచారం, రాజమోహన్ రెడ్డి ఆర్థికబలం, పోలీస్ బలం అన్ని కలిసి వైయస్‌ఆర్ ను ఓటమి అంచులకు తీసుకెళ్లగలిగాయి. కానీ ఓడించలేకపోయారు. ఆ ఎన్నిక తరువాత వైయెస్ఆర్ రాజకీయ వ్యూహాలను మార్చి ప్రతి ఎన్నికకు తన బలాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు.
వారసత్వ రాజకీయాల తుది దశ …
రెడెప్పగారి రాజగోపాల్ రెడ్డి కొడుకు రమేష్ రెడ్డి 1999లో టీడీపీ తరుపున ,ఓబుల రెడ్డి కొడుకు శివానందరెడ్డి 1989లో కాంగ్రెస్ తరుపున,వీరారెడ్డి కూతురు 2001 ఉప ఎన్నికల్లో .. అందరు ఒక్కోసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. మైసూరారెడ్డి కొడుకులు రాజకీయాలలో లేరు. రాజగోపాలరెడ్డి కొడుకు శ్రీనివాసుల రెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నాడు కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవటం కష్టం.. ఒకరకంగా వీరందరి రాజకీయ జీవితం, ముగిసినట్లే.
శివానందరెడ్డి టీడీపీ తరుపున 2004, 2009 ఎన్నికల్లో కడప నుంచి ,రాజమోహన్ రెడ్డి 1996,1998,1999 ఎన్నికల్లో టీడీపీ తరుపున కడప లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు. 2011 కడప ఉప ఎన్నికలప్పుడు జగన్ మీద టీడీపీ తరుపున కందుల రాజమోహన్ రెడ్డిని బరిలోకి దింపాలని చంద్రబాబు ప్రయత్నం చేసినా వారు పోటీకి నిరాకరించారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి చొరవతో కాంగ్రెసులో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీలో ఉన్న కందుల సోదరులు 2015లో బీజేపీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో క్రియాశీలకంగా లేరు.. వారి పిల్లలకు కూడా రాజకీయాల పట్ల ఆసక్తి లేనట్లుంది.
ఇంతమంది గట్టి నాయకులను ఎదుర్కొన్న అనుభవం వైయస్‌ఆర్ ను బలమైన నాయకుడిగా ఎదగటానికి ఉపయోగపడుండొచ్చు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెతను నిజం చేస్తూ సొంతగా జిల్లాలో అన్ని వర్గాలను దాటుకొని ముఖ్యమంత్రి అయ్యారు.
KSRM కాలజీతో ఎంతోమంది విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇచ్చిన కందుల శివానందరెడ్డి నిన్న గుండెపోటుతో మరణించారు,వారికి నివాళి.