iDreamPost
android-app
ios-app

విజయనగరంలో గీత హ్యాపీ !!

విజయనగరంలో గీత హ్యాపీ !!

హవ్వా.. ఎంత ఘోరం.. ఎంతటి గోరోజనం.. ఇంకా రాజరికపుపోకడలా. ఇంకెన్నాళ్లు ఈ అరాచకం అంటూ సీనియర్ నేత అశోక్ గజపతి మీద కత్తి దూసి వేరేగా పార్టీ కార్యాలయం పెట్టి అధినాయకత్వంతో చీవాట్లు తిని కాస్త అవమానంగా ఒంటరిగా ఫీలైన మాజీ ఎమ్మెల్యే గీత నిన్నటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలను లోలోన ఎంజాయ్ చేస్తున్నారు.

వాస్తవానికి మొన్నటి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనకు టిక్కెట్ దక్కకుండా చేసి తన కుమార్తె అదితి గజపతిరాజు కు టిక్కెట్ ఇప్పించుకుని తనకు అన్యాయం చేసారంటూ మీసాల గీత అశోక్ గజపతి మీద అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. విజయనగరం టౌన్లో ఎంతో కొంత కులబలం, క్యాడర్ ఉన్న తనను పూర్తిగా పక్కనబెట్టడాన్ని సహించలేని గీత అశోక్ బంగాళాకు దగ్గర్లోనే వేరే ఆఫీసు తెరిచారు.

Also Read:రాజు గారు ,గీత ఆధిపత్య పోరులో విజయనగరం ఏమవుతుంది?

దీన్ని తీవ్రంగా పరిగణించిన పార్టీ అధిష్టానం అధ్యక్షుడు అచ్చెన్నతో ఫోన్ చేయించి ఆఫీసును ఆపించారు . ఈ చర్య ఆవిడను మరింత అవమానపరిచింది. అయితే మొన్నటి పంచాయతీ ఎన్నికల్లోగాని, నిన్నటి మున్సిపల్ ఎన్నికల్లోగాని ఆవిడకు కనీస ప్రాధాన్యం దక్కలేదు. ఆవిడ రికమెండ్ చేసిన వాళ్లకు టికెట్లు కూడా ఇవ్వలేదు. మొక్కుబడిగా మాత్రం బొబ్బిలి మున్సిపాలిటీకి ఎన్నికల ఇంచార్జ్ గా బాధ్యత అప్పగించి ఊరుకున్నారు.

మొన్నటివరకూ తాను ప్రాతినిధ్యం వహించిన విజయనగరం పట్టణానికి సైతం ఎన్నికలు ముగిశాయి. 50 వార్డులకు గాను ఒకే ఒక వార్డు టిడిపికి దక్కగా ఇంకోటి ఇండిపెండెంట్ గెలిచారు. మిగతా 48 వార్డులూ వైసిపి గెలిచింది. ఈ ఫలితాలు అశోక్ గజపతి అనుచరులు, మద్దతుదారులు హతాసుల్ని చేయగా గీత మాత్రం లోలోన సంబరపడుతున్నారు. తనను కాదని ఎన్నికలకు వెళ్లారు. జరగాల్సిందే జరిగింది అని మురిసిపోతూ కేవలం నాయకత్వలోపం సమన్వయం కొరవడడం వంటి లోపాలే పార్టీని ముంచేశాయని అభిప్రాయపడ్డారు. అంటే అశోక్ నాయకత్వం బాలేదని ఆవిడ అన్యపదేసంగా చెప్పేసారు. ఇక పార్టీ ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందో చూడాలి.