Idream media
Idream media
సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారత దేశానికి దేశాధినేత రాష్ట్రపతి. రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశాధినేత. శాసన విభాగమైన పార్లమెంటు ఉభయ సభలను రాష్ట్రపతి సమావేశపరుస్తారు, ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రిని నియమిస్తారు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. కనీసం ఇసుమంత అవగాహన ఉన్న వారెవరికైనా రాష్ట్రపతి ప్రాముఖ్యత గురించి, ఆయన అధికారాలు, కార్యక్రమాల గురించి తెలుస్తుంది. కానీ, ఏపీలోని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నాయకులకు ఆ విషయం తెలియనట్లుంది. రెండేళ్లుగా వారి నోట పదే పదే వినిపిస్తున్న మాట రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి. రాష్ట్రపతి పాలన విధించాలి. ప్రతీ చిన్న విషయానికీ వీటిని వాడేస్తున్నారు.
భారత సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం నిర్దేశించిన పరిధిలో తమ అధికార, విధులను నిర్వర్తించాలి. సాధారణంగా ఒకరిపై ఒకరు ఆధిపత్య ధోరణిని ప్రదర్శించకూడదు. కానీ దేశ ఐక్యత, సమగ్రత, రక్షణ దృష్ట్యా అనూహ్యమైన పరిస్థితులు తలెత్తినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన అధికారాలకు ‘అత్యవసర అధికారాలు’గా పేరు పెట్టారు. రాజ్యాంగం 18వ భాగంలో ప్రకరణ 352 నుంచి 360 వరకు మూడు రకాల అత్యవసర అధికారాలను పేర్కొన్నారు. జాతీయ అత్యవసర పరిస్థితి (ప్రకరణ 352), రాష్ట్రంలో రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన (ప్రకరణ 356), ఆర్థిక అత్యవసర పరిస్థితి (ప్రకరణ 360). అలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడే రాష్ట్రపతి జోక్యం అవసరం ఉంటుంది. దేవాలయాలపై దాడులు, దేశ వ్యాప్తంగా కరోనా పరిస్థితులు, చివరకు ఓ వ్యక్తి అరెస్టు విషయంలో కూడా రాష్ట్రపతి జోక్యం కోరుతున్నారు
రాష్ట్రంలో రాజ్యాంగం అస్థిరత నెలకొందట. రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలట. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో తెలుసా.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు శ్రీశ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు. అంత అస్థిరతకు కారణం ఏంటంటే వైసీపీ ఎంపీ రఘురామరాజు అరెస్టు. ఆయన అరెస్టుతో రాష్ట్రంలో ఏం అస్థిరత చోటుచేసుకుందో, ఎవరికి ఎంత నష్టం జరిగిందో కానీ టీడీపీ నేతలు మాత్రం తెగ అపసోపాలు పడుతున్నారు. అయ్యన్న మరో ఆకు ఎక్కువే చదివేశారు. ఏకంగా రాష్ట్రపతిని లైన్ లోకి తెచ్చేశారు. రఘురామ రాజు అరెస్టుపై అయ్యన్నపాత్రుడు శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కక్షసాధింపు చర్యలు, వ్యవస్థలను తనచేతిలో పెట్టుకొని ఆడిస్తున్న తీరుపై రాజ్యాంగానికి ప్రతినిధులుగా ఉన్నవారు స్పందించకపోతే ఎలా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకరి అరెస్టుకే రాష్ట్రపతి జోక్యం చేసుకోవాల్సి వస్తే.. ఇక సీరియస్ విషయాల సంగతేంటి? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఘటనలపై ఎన్నిసార్లు రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి? వంటి ఎన్నో ప్రశ్నలను పలువురు లేవనెత్తుతున్నారు.