iDreamPost
android-app
ios-app

‘ప్రకాశం’ చరిత్ర తిరగబడుతోంది

‘ప్రకాశం’ చరిత్ర తిరగబడుతోంది

కాలానుగుణంగా సమాజంలో అనేక మార్పులు చోటుచేసుకుంటుంటాయి. కొన్ని పరిణామాలు గమనిస్తే.. వాటి ప్రయాణం కాలచక్రం మాదిరిగా ఉంటుంది. ఇలాంటిదే ప్రకాశం జిల్లా ఏర్పాటు, తాజా కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా జిల్లా మూడు భాగాలు కావడం. ఒంగోలు (ప్రకాశం) జిల్లా ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు సాగిన పరిణామక్రమం గమనిస్తే.. ప్రకాశం జిల్లా మూడు భాగాలతో ఏర్పడి.. మళ్లీ ఇప్పుడు మూడు భాగాలుగా విడిపోతున్న పరిస్థితిని గమనించవచ్చు.

మూడు జిల్లాల ప్రాంతాల భాగస్వామ్యంతో ఏర్పాటు..

ఆర్డినెన్స్‌ ద్వారా 1970 ఫిబ్రవరి 2వ తేదీన ఒంగోలు జిల్లా ఏర్పాటైంది. నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోని కొన్ని తాలుకాలతో ఒంగోలు జిల్లాను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లాలోని అద్దంకి, చీరాల, ఒంగోలు తాలుకాలు, నెల్లూరు జిల్లాలోని కందుకూరు, కనిగిరి, దర్శి, పొదిలి తాలుకాలు, కర్నూలు జిల్లాలోని మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు తాలుకాలతో ఒంగోలు కేంద్రంగా జిల్లా ఏర్పాటైంది.

Also Read : కొత్త జిల్లాల ఆలోచన బీజేపీదట..!

ఒంగోలు జిల్లాలో రాయలసీమలోని కర్నూలు జిల్లా నుంచి గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం తాలుకాలను కలపడాన్ని అప్పట్లో రాయలసీమలోని వివిధ ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి. రాయలసీమ ప్రజా సమితి నాయకుడు ఆర్‌.సుల్తాన్‌ కోర్టును కూడా ఆశ్రయించారు. గవర్నర్‌ ఆర్డినెన్స్‌ ద్వారా జిల్లాను ఏర్పాటు చేయడం సరికాదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు, రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టాలకు వ్యతిరేకంగా గవర్నర్‌ జారీ చేసిన ఆర్డినెన్స్‌ ఉందని వాదించారు. ఒంగోలు జిల్లా పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేయడంలేదని, రాజకీయ కారణాలతో ఏర్పాటు చేస్తున్నారని, ఆ జిల్లాలో రాయలసీమలోని కర్నూలు జిల్లా నుంచి కలుపుతున్న ప్రాంతాలను మినహాయించాలని వాదించారు. అయితే సుల్తాన్‌ వాదన కోర్టులో నిలవలేదు.

ఒంగోలులోని సబ్‌కలెక్టర్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ కార్యాలయంగా మార్చారు. ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 10.23 గంటలకు ఒంగోలు జిల్లా కలెక్టర్‌గా దొరైస్వామి బాధ్యతలు చేపట్టారు. అప్పటి మున్సిపల్‌ చైర్మన్‌ టి.ఎల్‌.ఎన్‌.స్వామి కలెక్టర్, ఇతర అధికారులకు స్వాగతం పలికారు. ప్రస్తుత మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు) తండ్రి అప్పటి పట్టణ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు బాలినేని వెంకటేశ్వరరెడ్డి కలెక్టర్‌ దొరైస్వామిని ప్రజలకు పరిచయం చేశారు. ప్రారంభం రోజున కలెక్టర్‌ కార్యాలయం మాత్రమే పనిని మొదలుపెట్టింది. తర్వాత వివిధ ప్రైవేటు భవనాల్లో ఇతర శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేశారు. రెండేళ్ల తర్వాత ఒంగోలు జిల్లాకు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు పెట్టారు. 1972 తర్వాత ఒంగోలు జిల్లా పేరు ప్రకాశం జిల్లాగా మారింది.

Also Read : జిల్లాలపైనా కోర్టుకు వెళ్లబోతున్నారా..?

అర్థశతాబ్ధం తర్వాత మూడు భాగాలు..

అర్థశాతాబ్ధం ముందు మూడు జిల్లాలలోని కొన్ని ప్రాంతాలతో ఏర్పాటైన ప్రకాశం జిల్లా.. మళ్లీ ఇప్పుడు మూడు భాగాలుగా మారబోతోంది. నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన కందుకూరు, కనిగిరి, దర్శి, పొదిలి తాలుకాల్లో.. కందుకూరు తిరిగి నెల్లూరు జిల్లాలోకి వెళ్లిపోతోంది. మిగిలిన ప్రాంతాలు ప్రస్తుత ప్రకాశం జిల్లాలోనే కొనసాగనున్నాయి. కర్నూలు జిల్లా నుంచి వచ్చిన మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు తాలుకాలు ప్రకాశం జిల్లాలోనే కొనసాగనున్నాయి. గుంటూరు జిల్లా నుంచి వచ్చిన ఒంగోలు, అద్దంకి, చీరాల తాలుకాలలో ఒంగోలు మినహా.. ప్రస్తుతం ఉన్న అద్దంకి, చీరాల, పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పాటు చేయబోతున్న బాపట్ల జిల్లాలోకి వెళుతున్నాయి.

ఇప్పుడు కూడా అభ్యంతరాలు.. డిమాండ్లు..

ఒంగోలు జిల్లా ఏర్పాటు చేసే సమయంలో వచ్చినట్లే ఇప్పుడు కూడా ప్రజల నుంచి అభ్యంతరాలు, డిమాండ్లు వస్తున్నాయి. కందుకూరును నెల్లూరు జిల్లాలో కలపడంపై స్థానిక ప్రజలు, రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అద్దంకిని ఒంగోలు జిల్లాలోనే ఉంచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మార్కాపురం కేంద్రంగా కనిగిరి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాలను కలిపి నూతన జిల్లాను ఏర్పాటు చేయాలని ఆయా నియోజకవర్గాల ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా మూడు భాగాలతో ఏర్పడిన ప్రకాశం జిల్లా మళ్లీ మూడు భాగాలు అవబోతుండడం కాలచక్రంలో భాగమే.

Also Read : పెద్ద జిల్లా ప్రకాశం.. పశ్చిమవాసుల ఆకాంక్ష పరిగణలోకి తీసుకుంటారా..?