iDreamPost
android-app
ios-app

ఫారిన్ లొకేషన్స్ కు ‘అవతార్’ షాక్

  • Published Jun 13, 2020 | 10:46 AM Updated Updated Jun 13, 2020 | 10:46 AM
ఫారిన్ లొకేషన్స్ కు ‘అవతార్’ షాక్

కరోనా ప్రభావం వల్ల దేశవిదేశాల్లో ప్లాన్ చేసుకున్న భారతీయ చిత్రాల పరిస్థితి చాలా గందరగోళంలో పడే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది . ఇప్పటికీ విదేశీ ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. బయట నుంచి ఇండియాకు రావొచ్చు కాని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళే దారి ప్రస్తుతానికి లేదు. త్వరలో వచ్చినా వీసాలకు సంబంధించి చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయి. ఇవన్ని భరించి పాతిక లేదా యాభై మందితో సినిమా యూనిట్లు అంత రిస్క్ చేస్తాయా అంటే అనుమానమే. తాజాగా న్యూజిలాండ్ లో తమ షూటింగులను రీ స్టార్ట్ చేయాలనీ ప్లాన్ చేసుకున్న అవతార్ 2-3 యూనిట్లకు అక్కడ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందట.

కారణం ఇప్పుడక్కడ జీరో కేసులు ఉన్నాయి. వైరస్ రహిత కంట్రీగా ఇటీవలే అక్కడి ప్రధాని ప్రకటించుకున్నారు కూడా. అవతార్ టీం అక్కడికి వెళ్లి మూడు వారాలే అయ్యింది. 14 రోజుల క్వారెంటైన్ ని పూర్తి చేసుకున్నా కూడా స్థానికుల నుంచి నిరసన వ్యక్తం అవుతున్నట్టు తెలిసింది. అసలు వాళ్ళను ఇక్కడికి రప్పించడమే తప్పనేలా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వంలో అవతార్ దర్శకుడు జేమ్స్ క్యామరూన్ తో పాటు నిర్మాతలకు సన్నిహిత మిత్రులు ఉన్నందుకే ఇలా అనుమతులు ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతానికి అవతార్ షూటింగ్ ని ఇంకా తిరిగి ప్రారంభించలేదు. 2021 డిసెంబర్ లో ప్లాన్ చేసిన అవతార్ 2 కోసం కొన్ని కీలక భాగాలు తప్ప మిగిలినదంతా పూర్తయిపోయింది.

గ్రాఫిక్స్ కోసం ఎనిమిది నెలల సమయం కేటాయించబోతున్నారు. ఇప్పుడు న్యూజిలాండ్ షెడ్యూల్ అనుకున్నట్టు పూర్తయితేనే రిలీజ్ డేట్ కు చేరుకోవడం సాధ్యమవుతుంది. అలా కాని పక్షంలో వాయిదా పడే ప్రమాదం ఉంది. విడుదల తేది అంత దూరం ఉన్నా అలా జరుగుతుందా అంటే అవతార్ సీక్వెల్స్ కు ప్లాన్ చేసుకున్న సెటప్ ఆ రేంజ్ లో ఉంది మరి. ఇప్పుడు మన సినిమాల యూనిట్లు కూడా ఇలాంటి ప్రత్యేక పరిస్థితులను విశ్లేషించుకోవాల్సిందే. నిజంగా వెళ్ళే అవసరం ఉంటే తప్ప ఇక్కడే మేనేజ్ చేసుకునే సౌలభ్యం కథలో ఉంటే ఫారిన్ షెడ్యూల్స్ పెట్టుకోకపోవడం ఉత్తమం. ఇప్పటికే కొందరు దర్శకులు ఓవర్సీస్ లొకేషన్స్ ఉన్న తమ కథలను ఇక్కడి ప్రాంతాలకు అనుగుణంగా రిపేర్ చేసే పనిలో పడ్డారట.