Idream media
Idream media
ఏ దేశానికీ చెందని కరెన్సీ గా పేరున్న బిట్‌కాయిన్ ఇప్పుడు ఓ దేశానికి అధికారిక కరెన్సీగా మారింది. బిట్‌కాయిన్‌ను అధికారిక కరెన్సీగా చేసిన తొలి దేశంగా ఎల్‌సాల్వడార్ రికార్డులకెక్కింది. ఈ నిర్ణయం కారణంగా దేశంలోని ఎంతోమంది పౌరులు తొలిసారి బ్యాంక్ సేవలు పొందగలుగుతారని తెలిపింది. క్రిప్టోకరెన్సీ ద్వారా ట్రేడింగ్ జరగడం ద్వారా ప్రవాసులు ఇంటికి పంపిన డబ్బుపై బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు విధించే ఫీజులో దేశానికి దాదాపు 400 మిలియన్ డాలర్లు ఆదా చేయడంలో సహాయపడుతుందని పేర్కొంది. బిట్‌కాయిన్‌ను అధికారిక కరెన్సీగా చేస్తూ జూన్‌లో ఎల్‌సాల్వడార్ పార్లమెంటు చట్టం చేయగా, ఇప్పుడీ చట్టానికి ఇది లోబడి ఉంటుంది. అప్పట్లో దీనిని వస్తు, సేవల వ్యాపారానికి మాత్రమే అనుమతి ఇవ్వగా, ఈ చట్టానికి 24 గంటల్లోనే అధ్యక్షుడు నయీబ్ బుకేలే ఆమోదించారు.
ఈ నిర్ణయం తర్వాత తన మొదటి 400 బిట్‌కాయిన్‌లను కొనుగోలు చేసినట్టు బుకేలే నిన్న (సోమవారం) సాయంత్రం ప్రకటించారు. 200 బిట్ కాయిన్లను రెండు విడతల్లో కొనుగోలు చేశారు. దేశానికి మరింత క్రిప్టో కరెన్సీ వస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ‘‘రేపు చరిత్రలోనే తొలిసారిగా ప్రపంచం కళ్లన్నీ ఎల్‌సాల్వడార్‌పైనే ఉంటాయి. బిట్ కాయిన్ ఈ పని చేసింది’’ అని బుకేలే నిన్న తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
బిట్ కాయిన్ అంటే…?
బిట్‌కాయిన్ అనేది ఒక వర్చువల్ కరెన్సీ. 2009లో లాంచ్ అయిన తర్వాత ఈ వర్చువల్ కరెన్సీ విలువలో అనేక సార్లు భారీ ఎగుడుదిగుళ్లు నమోదయ్యాయి. ఇది పూర్తిగా రహస్య కరెన్సీ. ఈ కరెన్సీని ప్రభుత్వానికి తెలియకుండా రహస్యంగా దాచిపెట్టుకోవచ్చు. దీనిని ప్రపంచంలో ఎక్కడైనా నేరుగా అమ్మెయ్యవచ్చు, కొనుక్కోవచ్చు. దీన్ని కొన్ని దేశాలు నిషేధించాయి. మరి కొన్ని దేశాలు దీనిపై ఆంక్షలు విధిస్తున్నాయి.
అక్కడక్కడా బయట బిట్‌కాయిన్ నాణేలు కనిపిస్తుంటాయి. ఇవి డమ్మీలు మాత్రమే. వాటిలో ముద్రించిన కోడ్ మాత్రమే ఉపయోగపడుతుంది. బిట్‌కాయిన్ ను స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్లలో “డిజిటల్ వాలెట్” రూపంలో దాచుకోవచ్చు. వ్యాపారులు బిట్‌కాయిన్‌ను అనుమతిస్తే డిజిటల్ వాలెట్ ద్వారా బిల్లు చెల్లించవచ్చు. డిజిటల్ వాలెట్ ద్వారా జరిగే ప్రతి లావాదేవీ రికార్డు అవుతుంది. ఈ విధానాన్ని బ్లాక్ చెయిన్ అంటారు. ఈ కరెన్సీ కేవలం కోడ్ రూపంలో ఉంటుంది కాబట్టి దీనిని ఎవరూ జప్తు చేసుకోలేరు, ఎవరూ దీనిని నష్టపర్చలేరు.
డిమాండ్ ఎక్కువే..
బంగారం, వజ్రాల మాదిరిగానే బిట్‌కాయిన్లు కూడా చాలా పరిమితంగా లభిస్తాయి. అందువల్ల దీనికి ఇటీవలి కాలంలో డిమాండ్ పెరిగింది. మరోవైపు ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అందువల్ల సరఫరా-డిమాండు సూత్రం ప్రకారం దీనికి గిరాకీ పెరుగుతోంది. ప్రభుత్వాల నియంత్రణ ఉండదు కనుక కొంత మంది బిట్‌కాయిన్లను ఇష్టపడుతున్నారు. అన్ని లావాదేవీలు నమోదు అవుతాయి కానీ వాటిని ఎవరు చేశారో బయటకు తెలియదు. తమ లావాదేవీల వివరాలు బయటకు తెలియకూడదు అనుకునే వారు బిట్‌కాయిన్ల వైపు మొగ్గు చూపుతున్నారు.