కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణా కరకట్టకు లోపలవైపు ఉన్న 36 భవనాలకు అధికారులు వరద హెచ్చరిక పత్రాలను అతికించారు. వీటిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం కూడా ఉంది.
వివరాల్లోకి వెళితే ఎగువన కురిసిన వర్షాలకు వరద నీరు భారీగా పెరగడంతో ప్రకాశం బ్యారేజి నిండు కుండను తలపిస్తుంది.ఇప్పటికే బ్యారేజి వద్ద16.2 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో అధికారులు ఈస్ట్రన్, వెస్ట్రన్ కెనాల్స్‌కు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అంతేగాక కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వరద ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. ఇప్పటికే కృష్ణా నది వరద ప్రవాహంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.
ముంపునకు గురైన ప్రాంతాల్లో బాధితులను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. ఇప్పటికే విజయవాడలో నాలుగు పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వరద ముంపుకు గురయ్యే 36 భవనాలకు అధికారులు వరద ప్రమాద హెచ్చరిక పత్రాలు అంటించి బాధితులను అక్కడనుండి ఖాళీ చేయిస్తున్నారు. ముంపునకు గురయ్యే 36 భవనాల్లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నివాసం కూడా ఉంది.కృష్ణా నదిలో వరద నీటి ధాటికి కృష్ణలంక, తారకరామనగర్, భూపేష్ గుప్తానగర్‌లో ఇళ్లు నీట మునిగాయి. కాగా వరద ప్రమాదం ఉన్నందున కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.