iDreamPost
android-app
ios-app

ఐదు రాష్ట్రాల ఎన్నికలు, మళ్లీ మతం చుట్టూనే రాజకీయాలు

  • Published Feb 13, 2022 | 2:56 AM Updated Updated Mar 11, 2022 | 10:18 PM
ఐదు రాష్ట్రాల ఎన్నికలు, మళ్లీ మతం చుట్టూనే రాజకీయాలు

దేశం కరోనా అనంతరం ఆర్థికంగా, సామాజికంగా తీవ్రంగా సతమతం అవుతోంది. అధికారిక లెక్కలే అప్పులు పెరుగుదల, జీడీపీ స్తంభించడం వంటి పరిణామాలను చాటుతోంది. 2014-15లో జీడీపీ రూ. 102 లక్షల కోట్లుగా ఉంటే దానిని ఏడేళ్లలో రూ. 143 కోట్లకు మాత్రమే చేర్చగలిగారు. అదే సమయంలో అప్పులు మాత్రం రూ. 53లక్షల కోట్ల నుంచి రూ. 135 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే అప్పులు దూసుకుపోతుంటే అభివృద్ధి అందుకు విరుద్ధంగా ఉన్నట్టు తాజా బడ్జెట్ లెక్కలే చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వమే ఇలా ఉంటే ఇక రాష్ట్ర ప్రభుత్వానికి అందుకు భిన్నంగా ఉండాలని ఆశించడం అత్యాశే అవుతుంది. మరోవైపు ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి.ఇలాంటి తరుణంలో ఎన్నికలు జరిగితే ప్రజా సమస్యల చుట్టూ చర్చసాగాలని ఎక్కువ మంది ఆశిస్తారు. అది రాజకీయంగానూ, ప్రజాసంక్షేమం రీత్యానూ శ్రేయస్కరం.

ప్రస్తుతం ఎన్నికల ప్రచారం అందుకు వ్యతిరేకమార్గంలో సాగుతోంది. మతం రంగు పులుముకుంది. మతం చుట్టూ రాజకీయాలు చేసేందుకు దేశ ప్రధాని నుంచి అనేక మంది నేతలు ప్రయత్నిస్తున్నారు. అందులో బీజేపీ జై శ్రీరామ్ అంటే సమాజ్ వాదీ పార్టీ జై శ్రీకృష్ణా అంటోంది. ఇలా నినాదాలు మాత్రమే కాకుండా మొత్తం ఎన్నికల జెండానే మతం చుట్టూ మార్చేసే యత్నానికి కర్ణాటక హిజాబ్ వివాదం కేంద్రమయ్యింది. జనం జాబ్ గురించి మాట్లాడుతున్న వేళ పాలక పెద్దలే హిజాబ్ వివాదం రాజేసి కాలేజీ విద్యార్థులు రాళ్లు రువ్వుకోవడానికి దోహదపడ్డారు.

ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరాఖండ్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు గానీ దానికి ముందు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ గానీ మతపరమైన విభజనకు బీజేపీ వేసిన ఎత్తులను చాటుతున్నాయి. ఇలా పోలరైజేషన్ సాధిస్తే పొలిటికల్ గా ప్రయోజనం పొందవచ్చని బీజేపీ ఆశించడం కొత్త కాదు. అవి సత్ఫలితాన్ని ఆపార్టీకి అందించడం అనేక మార్లు చూశాం. ఇప్పుడు కూడా అదే పంథాలో విజయపథానికి చేరేందుకు బీజేపీ ఎత్తులు వేయడం వింతేమీ కాదు గానీ దేశ పరిస్థితుల్లో అసలు సమస్యను కప్పిపుచ్చాలని చూడడం మాత్రం ప్రమాదకర సంకేతం. ఉత్తరాఖండ్ లో ముస్లిం యూనివర్సిటీ పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందంటూ మోదీ తాజాగా విమర్శలు చేశారు. దేవభూమిలో ముస్లిం యూనివర్సిటీ పెడతారా అనేందుకు ఆయన సిద్ధమయిపోయారు. అంటే ఉత్తరాఖండ్ భారతదేశంలో భాగం కాదా, అక్కడ ముస్లింలు లేరా, ఉంటే వారికి ఓ యూనివర్సిటీ ఏర్పాటు నేరమా అనే ప్రశ్న విపక్షం నుంచి వస్తుందని బీజేపీ అంచనా. అదే జరిగితే ముస్లిం వర్సెస్ హిందూగా మారి మెజార్టీ హిందువులు తమను బలపర్చాలని వారి భావన.

ఇలా మతాల చుట్టూ రాజకీయాలు మరింత ప్రోత్సహించడంలో ప్రధానమంత్రి వంటి వారే ముఖ్యభూమిక పోషిస్తున్న వైనం దేశం పరిస్థితులను ఎక్కడికి తీసుకెళుతుందోననే ప్రశ్నకు కారణమవుతోంది. సమస్యలు చుట్టుముడుతున్న వేళ వాటిని పరిష్కరించేందుకు బదులుగా ఇలా ప్రజలను విభజించి, నెట్టుకు రావాలనే ఆలోచన అలజడి రేపే ప్రమాదం ఉంది. ఓవైపు మెజార్టీ హిందువులను తమ వైపు మళ్లించుకునే లక్ష్యంతో బీజేపీ ఉంటే, దానికి ప్రతిగా మైనార్టీలలో అభద్రతాభావాన్ని సొమ్ము చేసుకునేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇరు పక్షాలను తమ తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా రెచ్చగొట్టి లబ్ధిపొందాలనే శక్తుల మూలంగా దేశం మత విబేధాలను తీవ్రం చేస్తోంది. భవిష్యత్తు భారతం ఎలాంటి స్థితికి చేరుతుందోననే ఆందోళనకు ఈ ఎన్నికల ప్రచారాలు కూడా కారణమవుతున్నాయి.

Also Read : యూపీలో తగ్గిన పోలింగ్ దేనికి సంకేతం?