iDreamPost
android-app
ios-app

ఐదు రాష్ట్రాల ఎన్నికలు, దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలకు మూలం కాబోతున్నాయా?

  • Published Feb 27, 2021 | 5:46 PM Updated Updated Feb 27, 2021 | 5:46 PM
ఐదు రాష్ట్రాల ఎన్నికలు, దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలకు మూలం కాబోతున్నాయా?

యూపీఏ 1 ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ కి ఆదరణ పెరుగుతూనే వచ్చింది. అప్పటి వరకూ ప్రధాన ప్రతిపక్షానికి నాయకత్వ సమస్యగా కూడా ఉండేది. నాటి ప్రతిపక్ష నేత ఎల్ కే అద్వానీ వ్యవహారం నిత్యం సందిగ్దంగానే ఉండేది. చివరకు పాకిస్తాన్ లో జిన్నా మీద చేసిన వ్యాఖ్యలతో ఆయన నాయకత్వ స్థానానికే ఎసరు వచ్చింది.

చివరకు 2011 తర్వాత పరిస్థితి మారిపోయింది. వరుసగా కుంభకోణాలు వెలుగులోకి రావడం, నిర్భయ ఘటన వంటివి ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చడం, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికి ఆందోళనల బాట పట్టడం, లోక్ పాల్ బిల్లు కోసం అన్నాహజారే దీక్షలతో యూపీఏ ప్రభుత్వానికి ఎదురుగాలి తప్పలేదు. సరిగ్గా అదే సమయంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో యూపీఏ మద్ధతుదారుల ఓటమి మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆ తర్వాత కొద్దికాలానికే నాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీకి దేశ వ్యాప్తంగా ఆదరణ మొదలయ్యి 2012 చివరి నాటికి ప్రధాని పదవికి పోటీదారుడిగా ఆయన తెరమీదకు వచ్చారు.

పదేళ్ల తర్వాత ఇప్పుడు పరిస్థితి పునరావృతం అవుతుందా అనే చర్చ మొదలయ్యింది. ఎన్డీయే 1 ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. 2020 వరకూ ఆయనకు ఢోకా లేదు. కానీ గడిచిన ఏడాది కాలంగా బీజేపీ కి, మోడీ నాయకత్వానికి అసలైన పరీక్షా కాలం మొదలయ్యింది. ఎన్నార్సీ వ్యతిరేక ఉద్యమం, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, తాజాగా రైతాంగ చట్టాలపై చారిత్రక ఉద్యమం అన్నీ కలిసి బీజేపీని ఇరకాటంలోకి నెడుతున్నాయనే అభిప్రాయానికి ఆస్కారమిస్తున్నాయి.

పంజాబ్ లో బీజేపీ పునాదులపై ప్రభావం పడింది. హర్యానాలో కూడా ఆ తాకిడి కనిపిస్తోంది. ఇక జాట్లలో వచ్చిన వ్యతిరేకతతో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో కూడా బీజేపీకి గట్టి దెబ్బ అనే వాదన వినిపిస్తోంది. అయితే జాట్ వ్యతిరేక శక్తులను తనవైపు కూడగట్టేందుకు కమలనాథులు చేస్తున్న ప్రయత్నాలతో ఆ నష్టం పూడ్చుకునే అవకాశం ఉందనే వారు కూడా ఉన్నారు.

దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వ వ్యతిరేకతకు తాజాగా ఆర్థిక , సామాజిక పరిస్థితి దిగజారుతుండడం ప్రధాన కారణం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఆపార్టీకి ఎదురీత తప్పదనే వాదన ఉంది. కానీ బెంగాల్ మీద భారీ ఆశలతో బరిలో దిగుతున్న బీజేపీ తూర్పున బలోపేతం అవుతున్నట్టు సంకేతాలు ఇస్తోంది. ఉత్తరాదిన కొంత నష్టం జరిగినా దానిని బెంగాల్, ఒడిశా, తెలంగాణలలో బలోపేతం కావడం ద్వారా పూడ్చుకోవాలనే లక్ష్యంతో ఉంది.

బెంగాల్ లో బోణీ కొడితే ఆ తర్వాత తెలంగాణాలో తడాఖా చూపుతామని ఇప్పటికే అమిత్ షా ప్రకటించారు. దాంతో ఈసారి తూర్పు, దక్షిణ భారతాల మీద బీజేపీ గంపెడాశలతో ఉంది. అయితే అసోం లో ఎన్నార్సీ ఉద్యమం తాలూకా ప్రభావం బీజేపీని కలవరపరుస్తోంది. కానీ కాంగ్రెస్ బలహీనతలు తమకు మేలు చేస్తాయనే భరోసాతో సాగుతోంది. బెంగాల్ లో మమతాని అడ్డుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న మో-షా ద్వయం వ్యూహాత్మకంగా సాగుతోంది. మమతాని పదవీచ్యుతిరాలిని చేస్తే దేశంలో ఇతర నేతలు తమను ఎదుర్కోవడానికి ముందుకు రాలేరనే ధీమాతో బీజేపీ అధిష్టానం ఉంది. అయితే బెంగాల్ లో బీజేపీ ఏమేరకు అధికార అవకాశాలున్నాయన్నది సందిగ్ధంగానే చెప్పవచ్చు.

తమిళనాడులో బీజేపీ ప్రభావం స్వల్పమే. అందులోనూ ఆపార్టీ మిత్రపక్షం అన్నా డీఎంకే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ తరుణంలో బీజేపీ ఆశించినట్టు 50 సీట్లు లేదా ఏఐడీఎంకే ఆఫర్ చేసినట్టు 25 స్థానాలలో ఎన్ని పోటీ చేసినా ప్రభావితం చేయగల సత్తా సందేహమే. ఇక కేరళలో వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేరనే అపప్రధను తొలగించే లక్ష్యంతో పినరయి విజయన్ పట్టుదలతో ఉన్నారు.

దేశంలోనే ఏకైక కమ్యూనిస్టు పాలిత రాష్ట్రం కాపాడుకోవాలనే లక్ష్యంతో సాగుతున్నారు. యూడీఎఫ్‌, బీజేపీ మధ్య ఓట్ల చీలిక జరిగితే గట్టెక్కగలమన్న ధీమాతో పాటుగా ఇటీవల కరోనా, వరదల సమయంలో లభించిన పాజిటివిటీతో సీపీఎం నేతలు సాగుతున్నారు. దాంతో కేరళ కొత్త చరిత్ర సృష్టిస్తుందా లేదా అన్నది చూడాలి. కానీ అక్కడ కూడా బీజేపీకి పెద్దగా ఆశలు లేవు. ఇక పాండిచ్చేరిలో ఎటువంటి ఫలితాలయినా రావచ్చనే చెబుతున్నారు. అన్నాడీఎంకే బలం మీద ఆధారపడి బీజేపీ రాజకీయాలు చేస్తున్న తరుణంలో డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఏమేరకు అడ్డుకోలగదన్నది చూడాలి.

మొత్తంగా అసోంలో అధికారం కాపాడుకుని బెంగాల్ లో విజయం సాధిస్తే మోడీకి మరికొన్నాళ్ల పాటు తిరుగులేదనే వాతావరణం వస్తుంది. దానికి భిన్నమైన ఫలితాలు వస్తే మాత్రం దేశవ్యాప్తంగా ఆ తాకిడి ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం బలహీనపడుతుందనే వాదన బలపడుతుంది. దేశమంతా ఆందోళనల ప్రభావం పెరిగేందుకు దారితీస్తుంది. ఇప్పటికే అంతర్జాతీయంగా ట్రంప్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత మోడీకి అమెరికా నుంచి కొంత అననుకూలత ఎదురవుతోంది. ఇక జాతీయంగానూ అలాంటి స్థితి వస్తే ఎన్డీయే 2 ప్రభుత్వం ఎదురీదక తప్పదు. దాంతో ఈసారి ఎన్నికలు అత్యంత కీలకమైనవే గాక, దేశ రాజకీయాలను మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది.