Idream media
Idream media
కొమ్ముకోణం చేప దాడితో విశాఖ జిల్లా పరవాడ మండలం జాలారిపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. నొల్లి జోగన్న అనే మత్స్యకారుడు మరో ఆరుగురితో కలిసి ముత్యాలమ్మపాలెం తీరం నుంచి ఆదివారం ఫైబర్ బోటుపై చేపలవేట వెళ్లారు. ఒడ్డు నుంచి సుమారు 90 కిలోమీటర్లు దూరం వెళ్లాక సుమారు 300 గేలాలను వేసి వేట సాగించారు. ఈ క్రమంలో ఒక గేలానికి సుమారు 80 నుంచి 100 కేజీల బరువున్న కొమ్ముకోనాం చేప చిక్కింది. దాన్ని అధీనంలోకి తీసుకోవడానికి గేలంతో కూడిన తాడుని ఎంతలాగినా పైకి రాలేదు. బోటుకు సుమారు 3 మీటర్ల దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఈ పరిస్థితుల్లో నొల్లి జోగన్న కర్ర ఉన్న గేలాన్ని కొమ్ముకోణం చేపకు వేస్తుండగా.. అదుపుతప్పి నీళ్లలో పడిపోయాడు. వెంటనే ఆ చేప ముక్కుపైనున్న కొమ్ముతో… జోగన్న పొట్టపై దాడి చేసింది. ఈ ఘటనలో అక్కడికక్కడే జోగన్న చనిపోయాడు. ఆ తర్వాత చేప తప్పించుకుని వెళ్లిపోయింది. జోగన్న మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చిన తర్వాత పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
పదునైన కొమ్ము..?
ఈ చేపకు పదునైన కొమ్ము ఉండడంతో దీన్ని కొమ్ముకోనం చేపగా అంటుంటారు. దీని సైజు, బరువు భారీగా ఉంటాయి. దాదాపు నలభై, యాభై కేజీలపైనే ఉంటుందీ చేప. వలకి చిక్కితే ఇక మత్స్యకారులకు కాసుల పంటే. టూనా తర్వాత.. అంతే డిమాండ్ ఉన్న చేపగా దీన్ని చెబుతుంటారు. ఇది దేశీయంగా దొరికినా.. ఇక్కడ దీన్ని ఎక్కువగా తినేవాళ్లు లేరు. కారణం ఖరీదు. కొమ్ముకోణం చేప ఖరీదు చాలా ఎక్కువ. కేజీ మూడు వందల నుంచీ ఎనిమిదివందలకు వరకూ ఉంటుంది. నలభై కేజీలు మామూలు సైజ్ చేప. ఇక ఎనభై నుంచీ వంద కేజీలు చేపలు ఒక్కోసారి పడతాయి. సాధారణ మార్కెట్ లో మూడు వందలు కేజీ అమ్ముతారు. కోసిన తర్వాత కేజీకి ఇంతా అని ధర కూడా పెరుగుతుంది. ఈ చేపను శ్రీలంక దేశీయులు ఎక్కువగా ఇష్టపడతారట. వందకేజీల చేప వలలో పడితే ఇక మత్స్యకారులు చాలా సంతోషిస్తారు. కానీ.. ఇప్పుడు ఆదే చేప ఓ మత్స్యకారుడి కుటుంబంలో విషాదం నింపింది.
Also Read : ‘ప్రకాశం’ చరిత్ర తిరగబడుతోంది