iDreamPost
android-app
ios-app

వైఎస్సార్‌ సెట్‌ చేసిన ట్రెండ్‌ కొనసాగుతూనే ఉంది..!

వైఎస్సార్‌ సెట్‌ చేసిన ట్రెండ్‌ కొనసాగుతూనే ఉంది..!

రాజకీయ పార్టీల ప్రధాన లక్ష్యం అధికారంలోకి రావడం. ఇందుకోసం ఆ పార్టీల నేతలు అనేక హామీలు ఇస్తుంటారు. అయితే 2004 ఎన్నికల్లో ఈ హామీల పరంపరలో అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీనేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కొత్త ట్రెండ్‌ను సెట్‌ చేశారు. ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పై పెడతామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఆ హామీని అమలు చేసేలా ప్రభుత్వంలో తొలి సంతకం తాను చేయిస్తానని సందేహాలకు తెరదించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినట్లుగానే.. ప్రమాణ స్వీకారం చేసిన సభలోనే ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై తొలి సంతకం చేసి.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన హామీలతోపాటు చెప్పని 108 ఏర్పాటు, ఫీజు రియంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి బృహత్తర పథకాలను వైఎస్‌ అమలు చేసి ప్రజల మన్ననలను పొందారు. మళ్లీ అధికారంలోకి వచ్చారు.

Also Read : మాజీ ఎంపీ వివేక్ తెరాస కు దగ్గరవుతున్నాడా ?

వైఎస్సార్‌ మాదిరిగానే రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేసిన చంద్రబాబు నాయుడు.. ఎన్నోహామీలు ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. తొలి సంతకం రైతు రుణాల మాఫీపై పెడతానని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే చంద్రబాబు ఒకటి కాదు ఐదు సంతకాలు చేశారు. మొదటి సంతకం రైతు రుణాల మాఫీపై కాకుండా.. రుణాల మాఫీపై కోటయ్య కమిటీని ఏర్పాటు చేస్తూ సంతకం చేశారు. ఇచ్చిన హామీకి భిన్నంగా తొలి సంతకం చేసిన చంద్రబాబు.. రైతు రుణామాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, బెల్ట్‌ షాపుల రద్దూ.. ఇలా అన్ని హామీలను అటెక్కించారు. ఫలితంగా 2019లో ఘోర పరాజయం పాలయ్యారు.

2004లో నాడు వైఎస్‌ తెచ్చిన మొదటి సంతకం ట్రెండ్‌ ఇప్పటికీ కొనసాగుతోంది. ఆ హామీ ఇచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చిన చరిత్ర ఉండడమే ఇందుకు కారణం. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోనూ మొదటి సంతకం హామీ ట్రెండ్‌ కొనసాగుతోంది. 2023లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్, బీజేపీలు మొదటి హామీని ఇచ్చాయి. ఇటీవల దళిత, గిరిజన సభలో టీపీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్‌పార్టీ తరఫున మొదటి సంతకం హామీని ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. దళిత, గిరిజన బిడ్డల చదువులకు అత్యధిక బడ్జెట్‌ కేటాయించే ఫైల్‌పై తొలి సంతకం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి ఎవరైనా.. ఆ బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు.

Also Read : వైఎస్సార్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2001 బద్వేల్‌ ఉప ఎన్నిక గురించి తెలుసా..?

తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా మొదటి సంతకం హామీ ఇచ్చారు. ప్రజా సంగ్రామ పాదయాత్ర చేస్తున్న చేస్తున్న బండి సంజయ్‌.. తొలి విడత పాదయాత్రను ఈ రోజు ముగించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్‌ బహిరంగ సభలో మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం, విద్య, వైద్యంపై పెడతామని చెప్పారు. ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తామని, సర్కారు పాఠశాలలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, తగినంత మంది ఉపాధ్యాయులను నియమిస్తామని బండి సంజయ్‌ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎవరైనా విద్య, ఉచిత వైద్యంపై తొలి సంతకం పెట్టించే పూచి తనదన్నారు బండి సంజయ్‌.

తొలి సంతకం హామీకి అధికారంలోకి తెచ్చేంతటి శక్తి ఉంది. అయితే ఆ హామీని ఎంత మేరకు అమలు చేస్తారనే అంశంపైనే ఆయా నేతల భవిష్యత్‌ రాజకీయ జీవితం ఆధారపడి ఉందని గతం చెబుతోంది. ఉచిత విద్యుత్‌ హామీని నిలబెట్టుకున్న వైఎస్సార్‌కు ప్రజలు మళ్లీ పట్టం కట్టారు. అదే రైతుల రుణాల మాఫీపై తొలి సంతకం చేస్తానని చెప్పి చేయని.. చంద్రబాబుకు ప్రజలు ఎంతటి గతి పట్టించారో 2019 ఎన్నికల్లో చూశాం. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు రెండు తొలి సంతకం హామీలు ఇచ్చాయి. అధికారంలోకి వస్తాయా..? రావా..? వస్తే ఏ పార్టీ వస్తుంది..? ఇవి రెండు కాకుండా కేసీఆరే మూడోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారా..? అనేది 2023 డిసెంబర్‌లో తేలుతుంది.

Also Read : అధికారం పోయినా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి,ప్ర‌భాక‌ర్ చౌద‌రి మధ్య తగ్గని పోరు