Idream media
Idream media
తీవ్ర విమర్శలు, దూషణల మధ్య బెంగాల్‌లో తొలి దశ ప్రచారం ముగిసింది. అధికార టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. టీఎంసీ నుంచి ప్రధానంగా మమతా బెనర్జీ ఒక్కరే ఒంటరి పోరు చేయగా, అటు బీజేపీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ సహా అమిత్ షా, యూపీ సీఎం ఆదిత్యనాథ్ వంటి ప్రముఖులు రంగంలోకి దిగారు. తొలి దశలో మమతపై దాడి తర్వాత ప్రచార పర్వం రక్తికట్టింది. చివరి రోజు కూడా బెంగాల్లో తీవ్ర విమర్శలు, దూషణలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పోలింగ్ ఇంకో 48 గంటలుందనగా- ఎలక్షన్ కమిషన్ నలుగురు ఐపీఎస్ అధికారులను, ఒక ఐఎఎస్ అధికారిని బదిలీ చేయాలని ఆదేశించడం, వారందరినీ ఎన్నికల విధుల నుంచి పూర్తిగా తప్పించడం తీవ్ర వివాదానికి దారితీసింది. వీరిలో ఓ అదనపు డీజీపీ ర్యాంకు అధికారి కూడా ఉన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో ఉధృతంగా సాగిన తొలిదశ ఎన్నికల ప్రచారానికి గురువారం తెరపడింది. ఐదు గిరిజన ప్రాంత జిల్లాల్లోని 30 నియోజకవర్గాలకు శనివారం పోలింగ్ జరుగుతుంది. ఇదే రోజున అసొంలోని 47 నియోజకవర్గాలకు కూడా పోలింగ్ జరగనుండడంతో అక్కడ కూడా ప్రచారం సమాప్తమయ్యింది. ఒకవైపు ప్రచారం కొనసాగుతుండగానే మరోవైపు బదిలీల పర్వం కొనసాగుతుండడం కూడా బెంగాల్లో తీవ్ర దుమారం రేపింది.
‘‘ఎన్నికల కమిషన్ పనిలో బీజేపీ జోక్యం మితిమీరింది. అది బీజేపీ కమిషన్‌గా మారింది. నేనడుగుతున్నా… లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికార, పోలీస్ యంత్రాంగం కేంద్రం గుప్పిట్లో ఎందుకుంది? ఎలక్షన్ కమిషన్ అదుపాజ్ఞల్లో కదా ఉండాల్సింది..?చూస్తుంటే మొత్తం అధికారులందరినీ బదిలీ చేసేస్తారు. అయినా మా విజయాన్ని ఎవరూ ఆపలేరు. ప్రజలు మా వెంట ఉన్నారు’’ అని ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన సభలో మమతా దీన్నే ప్రధాన అంశంగా అందుకున్నారు. ‘‘బెంగాల్ పట్ల ఈసీ సవతి ప్రేమ చూపుతోంది. దమ్ముంటే నాకు షోకాజ్ నోటీసులు జారీ చేయండి. మీరు పది నోటీసులిచ్చినా నేను భయపడను. బీజేపీ ఓ మెమొరాండం ఇస్తే చాలు.. క్షణాల మీద దానిపై చర్య తీసుకుంటున్నారు. ఇదేనా ఈసీ చేయాల్సిన పని?’’ అని ఆమె తీవ్రంగా దాడి చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా చివరి రోజు పురులియా జిల్లాలో కుర్మీ కులస్థులు ఎక్కువగా ఉన్న బాఘ్మండీలో ఉధృతంగా ప్రచారం చేశారు. ‘‘స్కీములు కావాలంటే నరేంద్ర మోదీ పార్టీకి ఓటెయ్యండి.. స్కాంలు కావాలంటే టీఎంసీకి ఓటెయ్యండి. లంచాల రాజ్యమిది. పరిశ్రమల్లేవు, ఉపాధిలేదు. వామపక్షాలు అధికారంలో ఉన్నప్పటి స్థితే నేటికీ ఉంది. మేం అధికారంలోకొస్తే కమీషన్ల దందాను ఆపుతాం. బెంగాల్‌కు పెట్టుబడులొస్తాయి. అన్నిరంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం’’ అన్నారు. గూండాలు, దోపిడీదారులు విశృంఖలంగా ఉన్న బెంగాల్లో 35రోజుల తరువాత మార్పొస్తుంది.. బీజేపీ అధికారంలోకొస్తుంది’ అని యూపీ సీఎం ఆదిత్యనాథ్ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సాగర్‌లో జరిగిన సభలో అన్నారు. దీదీ యోగి ఆదిత్యనాథ్‌పై కూడా పరోక్షంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘పాన్ నములుతూ-కాషాయం ధరించిన యూపీ గూండాలు బెంగాల్లోకి వచ్చారు. జాగ్రత్త.. వారు మన సంస్కృతిని ధ్వంసం చేయాలన్న కుట్రతో ఉన్నారు’ అన్నారు. దీనిపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఇలా తొలి పర్వం రసవత్తరంగా ముగిసింది.