Idream media
Idream media
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పశ్చిమ బెంగాల్ ను తలపిస్తున్నాయి. హింసకు దారి తీస్తున్నాయి. యూపీలో ఎన్నికల ప్రచారం చేస్తున్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరగడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై మజ్లిస్ వర్గాలు మండిపడుతున్నాయి. కాల్పుల్లో అసద్ కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఒవైసీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ కారు మాత్రం పంక్చరైంది. నాలుగు రౌండ్లు కాల్పులు జరిగినట్టు భావిస్తున్నారు.
ఎన్నికల్లో ప్రచారం అనంతరం మీరట్ నుంచి తిరిగి వస్తుండగా.. ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కాల్పుల విషయాన్ని ధ్రువీకరించారు ఒవైసీ అసదుద్దీన్. యూపీ ఎన్నికల్లో తొలుత వంద స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించినప్పటికీ.. ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే ఎంఐఎం పోటీలో ఉంది. బీజేపీపై పోరుకు యూపీ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న అసద్ తమ పార్టీ అభ్యర్థుల తరపున ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఎస్పీ, బీజేపీలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఒవైసీ కాన్వాయ్‌పై దాడి జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిజారసీ టోల్ ప్లాజా వద్ద ఒవైసీ కాన్వాయ్‌పై ఈ దాడి జరిగింది. ఫైరింగ్ చేసినవాళ్లు ఆయుధాలు అక్కడే విడిచివెళ్లినట్టు చెప్పారు ఒవైసీ. తాను అక్కడి నుంచి వేరే వాహనంలో వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు.
ఇంకో వారం రోజుల్లో పోలింగ్ జరగనుండగా యూపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది అనడానికి తాజా ఘటనే నిదర్శనమని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సర్కారు యోచిస్తోంది. ఢిల్లీ లోని అశోక రోడ్డులో ఉన్న హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఇంటిపై గతేడాది సెప్టెంబర్ లో దుండగులు దాడి చేశారు. హిందూసేన కు చెందిన వారు దాడి చేసినట్లుగా అప్పట్లో పోలీసులు నిర్దారించారు. ఓవైసీ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతోనే తమ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని హిందూసేన నేతలు ప్రకటించారు కూడా. తాజా ఘటనకు కారకులెవరు అనేది తెలియాల్సి ఉంది.