iDreamPost
iDreamPost
తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యపోరు ముదురుతోంది. తన తర్వాత తనయుడు నారా లోకేష్ ని సారధిగా ఎస్టాబ్లిష్ చేయాలని చంద్రబాబు ఆశిస్తున్నారు. కానీ తీరా చూస్తే లోకేష్ బలహీనతలు అందుకు అడ్డంకిగా ఉన్నాయి. రాజకీయనేతగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు కల్పించే ప్రతిపక్ష పాత్రలో నారా లోకేష్ తీరు జనాలను ఆకట్టుకోలేకపోతోంది. సొంత పార్టీ నేతలను సంతృప్తిపరచలేకపోతోంది. పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని కల్పించడంలో విఫలమవుతోంది. అందుకే ఇప్పుడు లోకేష్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ సమర్థుడనే భావన టీడీపీ శ్రేణుల్లో బలపడింది. 2009 తర్వాత రాజకీయాలకు దూరంగా సినిమాల మీద దృష్టి పెట్టిన చిన్న ఎన్టీఆర్ కే ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది.
అదే ఇప్పుడు లోకేష్ లో అసహనానికి, చంద్రబాబులో అసంతృప్తికి కారణమవుతోంది. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్న నారా కుటుంబం నుంచి మళ్లీ నందమూరి వారసుడే పార్టీని సొంతం చేసుకునే స్థితి వచ్చేస్తుందా అనే సందేహం బాబులో బయలుదేరింది.. అలాంటి పరిస్థితి ఊహించలేకపోతున్న చంద్రబాబు కొత్త స్కెచ్ వేశారు. ఎన్టీఆర్ ని బద్నాం చేసేందుకు పూనుకున్నారు. నందమూరి అభిమానులలో జూనియర్ ఇమేజ్ మీద దెబ్బకొట్టాలనే సంకల్పంతో ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకు అనుగుణంగానే తాజా పరిణామాలను అటు మళ్లిస్తున్నట్టు కనిపిస్తోంది.
వాస్తవంగా విపక్ష నేత జనం సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడాలి. ఒకవేళ వాకౌట్ లేదా బాయ్ కాట్ ఏమి చేసినా అది ప్రజా సమస్యలపై అయితే పలువురు హర్షిస్తారు. కానీ ఇప్పుడు చంద్రబాబు వ్యూహాత్మక తప్పిదంతో సొంత సమస్య మీద ఛాలెంజ్ చేసేశారు సీఎం అయితే తప్ప సభలో అడుగుపెట్టలేనని ఆయన శపథం పట్టేశారు. బహుశా ఇక సీఎం కాలేనని నమ్మకమో లేక సభకు కూడా రాలేననే భయమో తెలియదు గానీ బాబు భారీ లక్ష్యమే పెట్టేసుకున్నారు. కుప్పంలోనే ఆయనకు కష్టకాలం దాపురించిన తరుణంలో ఇలాంటి నిర్ణయానికి ఆయన రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయినా అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట మీద మళ్లీ యూటర్న్ తీసుకుంటే ఇక బాబుకి అధోగతేనని చెప్పవచ్చు.
ఈ తరుణంలో చంద్రబాబు తర్వాత ఎవరూ అనే ప్రశ్న టీడీపీలో ఉదయిస్తోంది. లోకేష్ వైఫల్యం ఎన్టీఆర్ కి వరంగా మారుతోంది. దాని నుంచి జనం దృష్టి మళ్లించడానికి చంద్రబాబు శపథాన్ని కూడా ఎన్టీఆర్ మీద ఎక్కుపెట్టేందుకు టీడీపీ నేతలు కొందరు చేస్తున్న ప్రయత్నం ఆపార్టీలో అసహనానికి కారణమవుతోంది. అసలే అంతంతమాత్రంగా పార్టీ ఉండగా, ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్ అన్నట్టుగా టీడీపీ నేతలే తయారుచేస్తున్న దృశ్యం మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతుందని అత్యధికులు భావిస్తున్నారు. లోకేష్ ప్రోత్సాహంతో కొందరు నాయకులు నోరు పారేసుకుంటున్నప్పటికీ హుందాగా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.
సినీ రంగంలో కష్టాల నుంచి ఎదిగినట్టే రాజకీయాల్లో కూడా గడ్డుస్థితి నుంచి టీడీపీని గట్టెక్కించే నేతగా ఎన్టీఆర్ కే ఆదరణ పెరుగుతోంది. ఇది చివరకు చంద్రబాబుకి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఓవైపు జగన్ తోనే సాగలేక సతమతం అవుతుంటే మరోవైపు సొంతింటిలో ఎన్టీఆర్ కారణంగా రేగుతున్న చిచ్చుతో తల పట్టుకునే స్థితికి చేరుతున్నారు. ఇదంతా చంద్రబాబు స్వయంకృతాపరాధంగా పలువురు పార్టీ నేతలు భావిస్తున్నారు. కన్నవాడి మీద ప్రేమతో పార్టీ పరువు తీసే చర్యలకు అంగీకరించడం అసలుకే ఎసరు పెడుతుందనే వాదన తీసుకొస్తున్నారు.