Idream media
Idream media
తెలంగాణలో తెలుగుదేశం ఉందా.. అని ఎవరినైనా ప్రశ్నిస్తే ఉందనుకుంటే ఉన్నట్లు.. లేదంటే లేదన్నట్లుగా ఉంది పరిస్థితి. అసెంబ్లీ, లోక్‌సభ, మున్సిపాల్టీ.. ఇలా ప్రతి ఎన్నిల్లోనూ ఆ పార్టీ ప్రాతినిధ్యం జీరోనే. అటువంటి దశలో ఉన్న టీడీపీలో మళ్లీ కుమ్ములాటలు ఒకటా..! పార్టీలో కాస్త చెప్పుకోదగ్గ నేతలు ఉన్నదే ఇద్దరు.. వారి మధ్య కూడా సమన్వయం లేకపోతే ఇక అంతే..! అంటూ కార్యకర్తల నిట్టూర్పు. ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ. అసలేం జరిగిందంటే…
తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ ఎం.అరవింద్‌కుమార్‌గౌడ్‌ల మధ్య కొంత కాలంగా విబేధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ విబేధాలు టీడీపీ నగర కమిటీ సమావేశంలో బయటపడ్డాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులకు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో మాట్లాడి ఆర్థిక సహకారం ఇప్పించలేదని రమణపై అరవింద్‌కుమార్‌గౌడ్ విమర్శలు చేశారు. అభ్యర్థులకు మద్దతుగా ఎక్కడాఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదన్నారు. రమణ స్పందిస్తూ.. ఆర్థిక సహకారం ఉండదని పార్టీ ముందే చెప్పిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందా? లేదా? అనే అంశంపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో తెలుగుదేశం పార్టీ నగర కమిటీ సమావేశం రసాభాసాగా మారింది.
జీహెచ్‌ఎంసీ ఫలితాలపై సమీక్ష కూడా నిర్వహించకపోతే ఎలా అని రమణను ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నిలదీశారు. ఉన్న ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం సరికాదని కొందరు అసహనం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీపరంగా ఎందుకు ఆర్థిక సహాయం చేయలేదని మరికొందరు ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా ఉన్న టీడీపీ అధిష్టానం.. ఇప్పుడు నగర ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థులను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
30-40 డివిజన్ల వరకు పోటీ చేయాలని తాను సూచిస్తే అరవింద్ 100 డివిజన్లకు పైగా అభ్యర్థులను బరిలోకి ఎందుకు దింపాల్సి వచ్చిందని రమణ ప్రశ్నించారు. పార్టీని బతికించేందుకు టికెట్‌లు ఇవ్వడం తప్పు ఎలా అవుతుందని అరవింద్ బదులిచ్చారు. దాదాపు గంటకు పైగా సాగిన వాగ్వివాదం సాయిబాబా జోక్యంతో సద్దుమణిగింది. ఇదిలా ఉండగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అంశంలోనూ రమణ వైఖరిని తప్పుపడుతూ సమావేశం నుంచి కొంత మంది పార్టీ నాయకులు బయటకు వెళ్లిపోయారు.