iDreamPost
android-app
ios-app

CJI, NV Ramana, Ponnavaram Village – గర్వపడేలా పని చేస్తా.. జస్టిస్‌ ఎన్‌వీ రమణ

CJI, NV Ramana, Ponnavaram Village – గర్వపడేలా పని చేస్తా.. జస్టిస్‌ ఎన్‌వీ రమణ

తెలుగువాడిగా భారత దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్నానంటే అది తెలుగువారందరి అభిమానం, ఆశీస్సులు, మద్దతుతోనేనని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. సీజేఐ అయిన తర్వాత తొలిసారి స్వగ్రామం కృష్ణా జిల్లా పొన్నవరం వచ్చిన ఆయన్ను గ్రామస్థులు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నానిలు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తెలుగువారి మద్ధతుతోనే తాను ఈ స్థాయికి వచ్చిన విషయం మరచిపోనని ఎన్‌వీ రమణ అన్నారు. అందుకే తెలుగు ప్రజల గౌరవానికి, ప్రతిష్ఠకు భంగం కలగకుండా తెలుగువారందరూ గర్వపడేలా పని చేస్తానని చెప్పారు. తెలుగువారి కీర్తి, గొప్పదనం, ఔన్నత్యాన్ని పెంచేలా వ్యవహరిస్తానని తెలిపారు. ఏ విధంగానైనా భిన్నంగా ప్రవర్తించబోనని సభాముఖంగా హామీ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అధికారులు, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం,ముఖ్యమంత్రికి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ధన్యవాదాలు తెలిపారు.

తన పునాదులు స్వగ్రామంలో ఉన్నాయని, అందరి ఆశీర్వచనాలు తీసుకునేందుకే వచ్చానని ఎన్‌వీ రమణ అన్నారు. తల్లిదండ్రులను, బంధువులను, బాల్య జ్ఞాపకాలను, విద్యాభాసాన్ని, బాల్య మిత్రులను జస్టిస్‌ ఎన్‌వీ రమణ గుర్తు చేసుకున్నారు. తన ఊరు చాలా చైతన్యవంతమైనదని, ఆ చైనత్యమే తనకు అబ్బిందన్నారు. రాజకీయ పార్టీలు, వివిధ కులాలు ఉన్నా.. రాజకీయపరమైన గొడవలు లేవన్నారు. ఎన్నికలు జరిగిన నాలుగు రోజులు ఎన్నికల వాతావరణం ఉండేదని, ఆ తర్వాత అందరూ కలిసిమెలిసి ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ఇలాగే భవిష్యత్‌లో ఉండాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. మా ఊరే కాదు రాష్ట్రం, దేశం కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానన్నారు.

Also Read : ఏపీలో మరో రెండు జిల్లాల్లో ఒమిక్రాన్‌ కేసులు

తన తండ్రి కమ్యూనిస్టు మద్ధతుదారుడని, తాను స్వతంత్ర పార్టీకి మద్ధతు ఇచ్చానని చెప్పిన ఎన్‌వీ రమణ.. అంత రాజకీయ చైతన్యం, స్వాతంత్ర్యం తమ గ్రామంలో ఉండేదన్నారు. ఒక సారి కమ్యూనిస్టులను తన తండ్రి ఇంటికి పిలిచి మాట్లాడుతున్నప్పుడు.. తాను పది మంది పిల్లలను పోగేసుకు వచ్చిన స్వతంత్ర పార్టీ జెండాలు పట్టుకుని కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశానని గుర్తు చేసుకున్నారు.

దేశం, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, వీటిని పరిష్కరించేందుకు ప్రజలు అందరూ ఐక్యమత్యంగా ఉండాలన్నారు. తెలుగు జాతి గర్వపడేలా తెలుగువాళ్లు పని చేయాలని ఆకాంక్షించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో పలు ప్రాజెక్టులు తెలుగు వారు కట్టడం మన గొప్పతనమన్నారు. గిట్టుబాటు ధర లేకపోవడం, భూ సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నారని, అవన్నీ పరిష్కారం అవ్వాలని ఆకాంక్షించారు.

అంతకు ముందు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికైన తర్వాత తొలిసారి స్వగ్రామం పొన్నవరం వచ్చిన జస్టిస్‌ ఎన్‌వీ రమణకు గ్రామ పొలిమేరలో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామ పొలిమేర నుంచి ఎడ్లబండిపై ఎన్‌వీ రమణను ఊరేగిస్తూ తీసుకెళ్లారు. దారిపొడవునా ఆయనపై పూలవర్షం కురిపించారు. అనంతరం శివాలయంలో జస్టిస్‌ ఎన్‌వీ రమణ పూజలు నిర్వహించారు.

హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గాన వచ్చిన జస్టిస్‌ ఎన్‌వీ రమణకు ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. కృష్ణా జిల్లా సరిహద్దులో గరికపాడు చెక్‌పోస్టు వద్ద జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌ నివాస్, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రవీంద్రబాబు, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఇతర అధికారులు స్వాగతం పలికారు.

మూడు రోజుల పాటు జస్టిస్‌ ఎన్వీ రమణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు శనివారం ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందు ఇవ్వనుంది. ఈ విందులో గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఉన్నతాధికారులు, మంత్రులు పాల్గొననున్నారు.

Also Read : నేడు చూడండి 83