iDreamPost
android-app
ios-app

భర్తను వదిలేసొచ్చిన కూతురు.. పండగలా సెలబ్రేట్ చేసిన తండ్రి!

  • Published Oct 18, 2023 | 3:11 PM Updated Updated Oct 18, 2023 | 3:22 PM
భర్తను వదిలేసొచ్చిన కూతురు.. పండగలా సెలబ్రేట్ చేసిన తండ్రి!

కూతురు పుట్టిందంటే ఏదో అరిష్టం అన్నట్టు ఫీలవుతారు కొంతమంది. కూతురు పుడితే పెద్దగా చదువులు చదివించకుండా నామ మాత్రంగా చదివించేసి పెళ్లి చేసి పంపించేస్తే అత్తారింట్లో పడుంటది అని చెప్పి చిన్న చూపు చూసే వారు చాలా మందే ఉంటారు. అయితే చాలా తక్కువ మంది మాత్రం కొడుకులతో సమానంగా కూతుర్లకు గౌరవంఇస్తారు. కూతుర్లేమీ కొడుకులకేమీ తీసిపోరు అని తండ్రులు రుజువు చేస్తుంటారు. తండ్రి నమ్మకానికి తగ్గట్టు ఆడపిల్లలు కూడా నిజం చేస్తుంటారు. అయితే పరువు కోసం బతికే తల్లిదండ్రులు తమ పిల్లలు అందరిలా కాకుండా డిఫరెంట్ గా ఉంటే మాత్రం తిట్టేస్తారు. నీ వల్ల పరువు పోయిందని నిందలు వేస్తారు. కానీ ఓ తండ్రి మాత్రం పరువు గురించి ఆలోచించకుండా కూతురి గౌరవాన్ని నిలబెట్టారు. సాధారణంగా ఏ ఆడపిల్ల అయినా ఎన్ని కష్టాలు ఉన్నా మెట్టింట్లో సర్దుకుపోవాలి చెబుతారు. కష్టంగా ఉందని చెబితే నోరు మూసుకుని ఉండు అని అంటారు. శాశ్వతంగా పుట్టింటికి వచ్చేస్తే రోజూ ఏదో రకంగా నిందలు వేసి అవమానిస్తుంటారు.

కానీ తన కూతురు అత్తారింటి వారి పోరు పడలేక పుట్టింటికి తిరిగి వచ్చేస్తే మాత్రం ఈ తండ్రి పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాంచీకి చెందిన ప్రేమ్ గుప్తా తన కూతురు సాక్షి గుప్తాకి ఏడాది క్రితం సచిన్ కుమార్ అనే వ్యక్తికిచ్చి వివాహం జరిపించారు. అయితే ఆరు నెలలు గడిచిన తర్వాత తన కూతురిని అల్లుడు టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. నిజానికి సచిన్ కి గతంలోనే పెళ్లి అయ్యింది. అయినప్పటికీ సాక్షి గుప్తా సర్దుకుపోయి జీవిస్తుంది. పెళ్ళై ఏడాది గడిచినా భర్త వేధింపులు ఆపకపోవడంతో సాక్షి గుప్తా భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని తండ్రికి చెప్తే ఆయన పరువు పోతుందని ఆలోచించలేదు. కూతురి జీవితం కంటే ఏదీ ముఖ్యం కాదని చెప్పి అల్లుడు దగ్గర నుంచి తన కూతురిని తెచ్చేసుకున్నారు.

అది కూడా చాలా గ్రాండ్ గా ఒక పండుగలా బ్యాండ్ మేళాలతో టపాసులు పేలుస్తూ కూతురిని ఇంటికి తీసుకొచ్చారు. పెళ్లి చేసినప్పుడు ఎలా అయితే పండుగలా మేళతాళాలతో కూతురిని అత్తారింటికి సాగనంపారో.. అంతే గొప్పగా ఇంటికి వస్తున్నప్పుడు కూడా సెలబ్రేట్ చేశారు. కూతురిని పెళ్లి చేసి అత్తారింటికి పంపించేయడంతో తండ్రి బాధ్యత తీరిపోదని.. అక్కడ ఏమైనా సమస్యలు వస్తే అండగా నిలబడాలని ఆయన అన్నారు. దీంతో ప్రేమ్ గుప్తాని నెటిజన్స్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తండ్రి అంటే ఇలా ఉండాలని.. అందరు తండ్రులు మీలా ఉంటే ఏ ఆడబిడ్డా కన్నీళ్లు పెట్టుకోదని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సెలబ్రేషన్ కి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా తన కూతురికి ప్రస్తుతం విడాకులు ఇప్పించడానికి కోర్టులో కేసు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. మరి పరువు కంటే కూడా కూతురి జీవితమే ముఖ్యం అని ఆలోచించిన ఈ తండ్రిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.