iDreamPost
android-app
ios-app

మమ్మల్నిలా వదిలేయండయ్యా..!

  • Published Dec 11, 2020 | 1:32 PM Updated Updated Dec 11, 2020 | 1:32 PM
మమ్మల్నిలా వదిలేయండయ్యా..!

రైతుల ఆందోళన.. ఢిల్లీని దాటి దేశానికి, అక్కడ్నుంచి ఇప్పుడు విదేశాలకు కూడా చేరింది. గత ఆరేళ్ళ కాలంలో నరేంద్ర మోడీ చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్న రీతిలో పాలన సాగిపోయింది. ఇందులో నోట్ల రద్దూ ఉంది.. బ్యాంకుల మూతలు ఉన్నాయి.. బీఎస్‌ఎన్‌ఎల్‌ వంటి సంస్థల సంక్షోభం.. అక్రమార్కులు దేశాన్ని విడిచిపెట్టి పోవడమూ ఉంది.. కోవిడ్‌ పేరుజెప్పి కోట్లాది మంది నడుచుకుంటూ బయలుదేరి అందులో కొందరు ప్రాణాలు కోల్పోవడమూ ఉంది. అయితే ఇవేవీ ఆ ఆరేళ్ళకాలంలో బహిరంగంగా మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ప్రతిపక్షాలకు ఉన్న నీరసం నేపథ్యంలో పెద్దగా ప్రమోట్‌ కాలేదనే చెబుతారు రాజకీయ పరిశీలకులు.

అయితే ఇన్నేళ్ళకాలంలో ఏం చేసినా చెల్లింది కాబట్టి ఇప్పుడు కూడా చెల్లుతుందనుకున్నారో ఏమో బీజేపీ పెద్దలంతా కలిసి రైతులను ఉద్దరించేందుకు చట్టాలను తీసుకువచ్చేసారు. అది కూడా దేశం మొత్తం కోవిడ్‌ భయాందోళనల్లో ఉంటే నెమ్మదిగా పార్లమెంటులో ఆమోదింప జేసేసారు. అప్పట్లో వీటి గురించి, రైతుల అభిప్రాయం గురించి పెద్దగా దృష్టిలేని పలు పార్టీలలో ఈ చట్టాలను కూడా ఆహ్వానించేసాయి. కానీ ఈ చట్టాల లోతులు బైటపడ్డాక రైతుల్లో అలజడి ప్రారంభమైపోయింది. నెమ్మదిగా అది ఢిల్లీని తాకింది. ఇప్పుడు అంతర్జాతీయ విషయం అయి కూర్చుంది.

యోగా చేద్దాం రండి అంటే ప్రపంచం మొత్తం యోగా మ్యాట్‌లతో మోడీవైపు ఎలా అయితే చూసాయో.. మాకీ చట్టాలు వద్దు అంటున్న రైతులను కూడా అవే దేశాలు అదే రీతిలో చూస్తుపన్నాయి. దీంతో బీజేపీ నాయకత్వానికి జరుగుతున్న నష్టం బోధపడింది. నానా రకాలుగా రైతు పోరాటాలను చిన్నబుచ్చే ప్రయత్నాలేమీ ఫలించకపోవడంతో చర్చలంటూ ప్రయత్నం మొదలు పెట్టారు. అయితే కేంద్ర ప్రభుత్వం చెబుతున్న దానికి, రైతులు వ్యక్తం చేస్తున్న సందేహాలకు మధ్య చాలా గ్యాపే ఉంది. దీంతో చర్చల్లో తీవ్ర ప్రతిష్ఠంభన నెలకొంది. రాన్రాను దేశ వ్యాప్తంగా రైతుల పోరాటాన్ని విస్తరించే ప్రణాళికల్లో ఆయా సంఘాల నాయకులు సిద్ధమవుతున్నారు.

అయితే కాలాతీతం అయ్యేకొద్దీ రైతుల పోరాటం పలచబడుతుందన్న ఉద్దేశంతోనే బీజేపీ వ్యవహరిస్తోందన్న ఆరోపణలు చేసేవారు కూడా లేకపోలేదు. కానీ అందుకు భిన్నంగా రైతులు చేస్తున్న పోరాటం చాపకింద నీరులా దేశ వ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని ఏకం చేస్తుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితులను వినియోగించుకునేందుకు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడే రాజకీయ పార్టీలు తప్పకుండా సిద్ధమవుతాయి. కానీ ఈ పోరాటం మొత్తం ప్రతిపక్షాలే చేయిస్తున్నారంటూ ఆరోపణలతో కాలక్షేపం చేస్తే మాత్రం చేతులు కాలడం ఖాయం. ఇప్పటి వరకు మోడీ ఏం చెప్పినా ఏదో ఒక అద్భుతం జరక్కపోతుందా అన్న ఆశతో దేశం యావత్తు శ్రద్దగానే వింటూ ఉంది. అయితే సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏమీ జరగడం లేదన్నది నెమ్మదినెమ్మదిగా వారికి బోధపడుతోంది. దీంతో ఇప్పుడు నిరసన గళాలు నెమ్మదిగా గొంతు విప్పుతున్నాయి. దీనికి నాందీగానే రైతుల పోరాటాన్ని చెబుతున్నారు.

చట్టాల మీదకంటే.. ఆ చట్టం చేసిన బీజేపీపైనే రైతులు ఎక్కువగా అపనమ్మకాన్ని పెంచుకున్నారని రైతుపోరాట అనుకూలురు నుంచి విన్పిస్తోంది. ఈ నేపథ్యంలో చేస్తే మేం కోరినవి అమలు చేయండి లేదా మమ్మల్నిలాగే వదిలెయ్యండయ్యా.. అంటూ రైతులు మొత్తుకుంటున్నారంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యవహరించబోయే తీరుపైనే ఆ పార్టీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.