iDreamPost
android-app
ios-app

పోటీ పరీక్షల్లో సత్తా చాటిన రైతు బిడ్డ.. ఒకేసారి రెండు ఉద్యోగాలు!

పోటీ పరీక్షల్లో సత్తా చాటిన రైతు బిడ్డ.. ఒకేసారి రెండు ఉద్యోగాలు!

సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతి మనిషికీ ఉంటుంది. విజయాలు సాధించడం వల్లనే సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అయితే ఆ విజయం అనేది అంత ఈజీగా రాదు అనే విషయం అందరికీ తెలిసిందే. తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఎంతో మంది ప్రయత్నం చేస్తుంటారు. కొందరు మధ్యలోనే విరమించగా.. మరికొందరు మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలాగా ప్రయత్నించి విజయం సాధిస్తారు. అలా అద్భుత విజయం అందుకుని చరిత్రలో నిలిచిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి జాబితాల్లో  ఓ రైతు బిడ్డ కూడా చేరాడు. వ్యవసాయం చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యాడు. కష్టపడి, ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ 24వ ప్రయత్నంలో విజయం సాధించాడు. మరి.. ఆ విజేత ఎవరు.. ఆయన సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మహారాష్ట్ర నాందేడ్ జిల్లా మాతల గ్రామానికి చెందిన యువకుడు సాగర్ షిండే…కుటుంబంతో కలిసి నివాసం ఉండేవాడు.  వారి కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తోంది. సాగర్ కూడా తండ్రి చేసే వ్యవసాయంలో సహాయ పడేవాడు. అంతేకాక అతడికి చిన్నతనం నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని బలమైన కోరిక ఉండేది. అందుకోసం నిత్యం సాగర్ షిండే కృషి చేస్తుండేవాడు. అలా సాగర్‌ పలు ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరై విఫలయ్యాడు. అయినా అతడు నిరాశ చెందలేదు. ఒకటి రెండుసార్లు కాదు ఏకంగా 23 సార్లు పరీక్షలు రాసినా సాగర్ కి విజయం దక్కలేదు. చివరకు అతడి ప్రయత్నాలకు ఆ ఓటమే తలవంచింది.  24వ ప్రయత్నంలో ఏకంగా రెండు ప్రభుత్వ కొలువులను సాధించి.. తన లక్ష్యాన్ని నేరవేర్చుకున్నాడు.

వ్యవసాయంలో తండ్రికి సాయపడుతూనే సాగర్ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. పొలం పనులు పూర్తికాగానే దగ్గరలో ఉన్న లైబ్రరీకి వెళ్లి గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టేవాడు. పదుల సార్లు ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో విఫలమైనా నిరుత్సాహపడలేదు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్లి అనుకున్నది సాధించాడు. ఇటీవల విడుదలైన మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగ నియామక ఫలితాల్లో సాగర్ 25వ ర్యాంకు సాధించాడు. దీంతో ఆయనకు ట్యాక్స్‌ అసిస్టెంట్‌గా, మంత్రుల కార్యాలయంలో క్లర్క్ ఉద్యోగం వచ్చింది. మరి.. పోటీ పరీక్షల్లో సత్తాచాటి.. ఒకేసారి రెండు ఉద్యోగాలను సాధించిన రైతుబిడ్డపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి..