Idream media
Idream media
కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న దేశం మొత్తం మీద బ్లాక్ డే గా పాటించాలని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన వెలువడింది. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆరు నెలలుగా దేశంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ, కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకోలేదు. ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో కరోనా మహమ్మారి తీవ్రతరం కావడంతో కొంత మంది రైతులు ఢిల్లీని వదిలి వెనక్కి వెళ్లారు.
అయితే, ఈ నెల 26 వ తేదీన బ్లాక్ డే నిర్వహించాలని భారత్ కిసాన్ యూనియన్, కిసాన్ సంయుక్త మోర్చా నిర్ణయం తీసుకున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీచాయి. దీంతో రైతులకు మద్దతు పెరగనుంది. ఈ క్రమంలో బ్లాక్ డే పై అంతటా ఉత్కంఠ ఏర్పడింది.
తాజాగా రైతులు అందరూ మళ్లీ ఢిల్లీకి చేరుకునేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో కాస్త చల్లారిన ఉద్యమ తీవ్రతను కేంద్రానికి మళ్లీ రుచి చూపించాలని ముందుకు కదులుతున్నారు. హర్యానా, పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకునేందుకు భారీగా బయలుదేరారు. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు మొదలయ్యాయి. ఢిల్లీ సరిహద్దుల్లో వారం రోజులపాటు సామూహిక భోజన కార్యక్రమాలు చేపట్టాలని రైతులు నిర్ణయం తీసుకున్నారు. రైతుల ఆందోళనతో కేసులు పెరిగాయని అప్పట్లో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల పేరుతో సభలు, సమావేశాలు నిర్వహించారని, వారి వలనే కరోనా కేసులు పెరిగాయని రైతు నాయకులు చెప్తున్నారు.
బ్లాక్ డే ప్రకటనతో కేంద్రం కూడా అప్రమత్తమైంది. పోలీసు ఉన్నతాధికారులకు ఈ మేరకు కీలక ఉత్తర్వులు అందాయి. పటిష్ట ప్రణాళికలను రచించాలని ఆదేశించింది. ఆగస్టు 15న జరిగిన ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని తగిన బందోబస్తు చర్యలు చేపట్టాలని పేర్కొంది. మరోవైపు కరోనా ఉధృతి నేపథ్యంలో ఆందోళనలకు అనుమతి లేదని ఉన్నత వర్గాలు చెబుతున్నప్పటికీ, 26న మాత్రం బ్లాక్ డేకు ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. రైతులు కూడా భారీ సంఖ్యలో ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అంతటా ఉత్కంఠ ఏర్పడింది. ఇంకా మూడు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఆందోళనలు చేపట్టకుండా రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కానీ, విపక్షాలు మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెబుతున్నాయి. రెండో దశ కరోనా కట్టడిలో కేంద్రంపై ప్రతికూల భావనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో, ఇదే అదునుగా రైతు ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి.