iDreamPost
android-app
ios-app

పోస్టాఫీస్ బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం డబ్బులు వేస్తుందంటూ ప్రచారం – బారులు తీరిన ప్రజలు

పోస్టాఫీస్ బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం డబ్బులు వేస్తుందంటూ ప్రచారం – బారులు తీరిన ప్రజలు

పోస్టాఫీసులో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉంటే ప్రభుత్వం డబ్బు వేస్తుందన్న ప్రచారం సోషల్ మీడియా ద్వారా ఊపందుకోవడంతో పోస్టాఫీసుల వద్ద జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు.

హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పోస్ట్ ఆఫీసుల ముందు ప్రజల రద్దీ ఎక్కువైంది. దీనికి కారణం ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ లో జీరో అకౌంట్ ఉంటే డబ్బులు వేస్తుందన్న అసత్య ప్రచారం సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందడమే. ఈ అసత్య ప్రచారాన్ని నమ్మిన అనేక మంది ప్రజలు పోస్ట్ ఆఫీసుల ముందు గుమిగుడుతున్నారు.ఈ వార్త ఎంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయిందంటే సికింద్రాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఉదయం 6 గంటలకే సుమారు 500 మందికి పైగా జనం క్యూలైన్లలో నిలబడి అకౌంట్ ఓపెన్ చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉండటం విశేషం.

ప్రభుత్వం డబ్బులు వేయడం లేదని ఇదంతా అసత్య ప్రచారం అని ఎవరు చెప్పినా పట్టించుకోకుండా క్యూ లైన్లలో నిలబడి అకౌంట్ ఓపెన్ చేయడం కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉండటం గమనార్హం. అసలే కరోనా కాలం.. అందులోనూ గుంపులు గుంపులుగా ప్రజలు కరోనా నిబంధనలు పాటించకుండా గుమిగూడి ఉండటంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని పోస్ట్ ఆఫీస్ సిబ్బందితో పాటు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇవేమీ పట్టని జనం అసత్య ప్రచారాన్ని నమ్మి పోస్ట్ ఆఫీసులకు పరుగులు తీస్తుండడంతో వారిని అదుపు చేయలేక అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి.

ప్రభుత్వం ఏ విధమైన డబ్బులు పోస్ట్ ఆఫీస్ జీరో అకౌంట్లో ఉచితంగా వేయడం లేదని అదంతా అసత్య ప్రచారమని, ఇలా అసత్య ప్రచారాలు నమ్మకుండా నిజంగా పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ లో జీరో అకౌంట్ ఓపెన్ చేయాలని ఉంటే ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చని లేదంటే రద్దీ తగ్గిన అనంతరం పోస్ట్ ఆఫీసులకు రావాలని నిపుణులు చెబుతున్నారు.