iDreamPost
iDreamPost
పేద, మద్యతరగతి కుటుంబాల్లో తీరని నష్టానికి కారణం అవుతున్న మద్యం అలవాటును మాన్పించాలని ఏపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందులో భాగంగా మద్యం షాపులు కుదించడం, రేట్లు పెంచడం, డీ ఆడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయడం వంటి కార్యాచరణను అమలుపరుస్తోంది. అయితే ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తూ అక్రమ మద్యం రవాణాకు కొందరు వ్యక్తులు పాల్పడుతున్నారు. ఇందుకు భిన్నంగా సొంతంగానే మద్యాన్ని తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్న ప్రబుద్దుల బండారాన్ని తూర్పుగోదావరి జిల్లాలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు బట్టబయలుచేసారు. రాజోలు సర్కిల్ పరిధిలోని సకినేటిపల్లిలో బైటపడ్డ ఈ అక్రమ మద్యం తయారీ పోలిసులనే విస్తుపోయేలా చేసింది.
సోడా బడ్డీ తీగలాగితే..
అక్రమ మద్యం తయారీ వ్యవహారంలో బడ్డీకొట్టు వద్ద తీగను లాగితే హోమియోపతీ మందుల షాపులో డొంక కదిలింది. కొన్ని రకాల హోమియోపతీ మందుల మిశ్రమం, ఫుడ్ కలర్స్‌తో మద్యంను పోలిన ద్రవాన్ని తయారు చేసి, కాస్ట్‌లీ బాటిల్స్‌లో నింపి మద్యం అమ్మకాలు సాగిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీస్‌లు కనుగొన్నారు. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న అంతర్వేది పాలెంకు చెందిన నల్లి రాజేష్, మునిలంకకు చెందిన ఏ. శ్రీను, మల్కిపురంకు చెందిన కె. శ్రీనివాస్ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, సంబంధిత బాటిల్స్, మందులు, ఫుడ్ కలర్ తదితర వస్తువులను సీజ్ చేసారు. వీటిలో సుమారు 8 లీటర్ల అక్రమ మద్యం, 10 వరకు క్వార్టర్ బాటిల్స్ కూడా ఉన్నాయి.