Idream media
Idream media
‘‘విచారణ నుంచి నన్ను తప్పుకోవాలని దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలకు ఆధారాలు లేవు. ప్రభుత్వం చెబుతున్నట్లు ఆ వ్యాఖ్యలు నేను చేయలేదు. నన్ను తప్పుకోమనడం ధిక్కారపూర్వక చర్యే. దీనిపై మిషన్ బిల్ట్ ఏపీ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి ప్రవీణ్‌కుమార్‌పై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు చర్యలు తీసుకోండి. కోర్టు ధిక్కరణ కింది చర్యలు ఎందుకు తీసుకోకూడదో ప్రవీణ్‌కుమార్ వివరణ ఇవ్వాలి’’.. ఇదీ క్షుప్తంగా మిషన్ బిల్డ్ ఏపీపై దాఖలైన పిటిషన్ విచారణ నుంచి తప్పుకోవాలని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ రాకేష్‌కుమార్ ఇచ్చిన ఉత్తర్వుల సారాంశం.
అసలు వివాదం ఏమిటి..?
మిషన్ బిల్డ్ ఏపీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం నిరుపయోగమైన భూములను విక్రయించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు గుంటూరు, విశాఖ తదితర ప్రాంతాలలోని భూముల విక్రయానికి వేలం రంగం సిద్ధం చేసింది. భూముల విక్రయాన్ని అడ్డుకోవాలంటూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ రాకేష్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రభుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. భూములు అమ్మే అధికారం మీకు ఎక్కడిది..? భూములు అమ్మాల్సిన పరిస్థితి ఏమిటి..? రాష్ట్రం ఏమైనా దివాలా తీసిందా..? రాష్ట్రంలో రాజ్యంగ సంస్థలు కుప్పకులాయని ప్రకటిస్తాం. పరిపాలనను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తాం.. అంటూ జస్టిస్ రాకేష్‌కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తప్పుకోవాలని కోరిన ప్రభుత్వం..
ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రాకేష్‌కుమార్.. ఈ పిటిషన్లను విచారిస్తే.. తమకు న్యాయం జరగదని మిషన్ బిల్డ్ ఏపీ కార్పొరేషన్ రెక్యూజ్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ నుంచి రాకేష్‌కుమార్ తప్పుకోవాలని అభ్యర్థించింది. అయితే తప్పుకోని రాకేష్‌కుమార్.. ఈ పిటిషన్‌ను కూడా ఆయనే విచారించారు. డిసెంబర్ 31వ తేదీన పదవీ విమరణ చేస్తున్న సమయంలో ఒక్క రోజు ముందు ఈ పిటిషన్‌పై ఆకస్మికంగా తీర్పు వెలువరించారు.
నేను అనలేదంటే అనలేదు..
రెక్యూజ్ పిటిషన్‌లోని అంశాలన్నీ అసత్యాలేనని, తాను ఆ మాటలు అనలేదని జస్టిస్ రాకేష్‌కుమార్ వాదించారు. ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. వ్యాఖ్యలు చేసిన సమయంలో నాతోపాటు ఇతర న్యాయమూర్తులు కూడా విన్నారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పినా.. ససేమిరా తాను అనలేదన్న రాకేష్‌కుమార్.. తనను తప్పుకోవాలని పిటిషన్ దాఖలు చేసిన మిషన్ బిల్డ్ ఏపీ ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్‌పై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టాలని హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేశారు.
మరి వారి సంగతేంటి..?
తాను అనని మాటలను అన్నానంటూ.. పిటిషన్ వేసిన ప్రవీణ్‌కుమార్‌పై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు జస్టిస్ రాకేష్‌కుమార్. మరి వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు వాటిని పేర్కొంటూ జస్టిస్ రాకేష్‌కుమార్ పేరు, ఫొటోతో సహా పతాకశీర్షికల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు రాశాయి. మరి జస్టిస్ రాకేష్‌కుమార్ ఆ వ్యాఖ్యలు చేయకుండానే ఈనాడు, జ్యోతి పత్రికలు రాశాయా..? అలా అయితే ఆ పత్రికలది కోర్టు ధిక్కారమే అవుతుంది. మరి ఈనాడు, జ్యోతి పత్రికలపై కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలి కదా..? ఆ మేరకు జస్టిస్ రాకేష్‌కుమార్ హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఆదేశాలు ఇవ్వాలి కదా..? ఈ విషయం ఆయనకు గుర్తు లేదా..? లేక ఆయా పత్రికలను ఆయన చూడలేదా..? అనే సందేహాలు, ప్రశ్నలు జస్టిస్ రాకేష్‌కుమార్ తీర్పుతో అందరిలోనూ కలుగుతున్నాయి. ఇలాంటి తీర్పులు, వివాక్షాపూరితమైన వ్యాఖ్యలతోనే.. జస్టిస్ రాకేష్‌కుమార్‌పై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ న్యాయబద్ధమైనదేనని నిరూపణైంది.
Read Also : ఏపీలో రాజకీయ నాయకుల పిడకల వేట..!