iDreamPost
android-app
ios-app

అభివృద్ధి ప‌థాన ఫ్యాక్ష‌న్ ప‌ల్లెలు

అభివృద్ధి ప‌థాన ఫ్యాక్ష‌న్ ప‌ల్లెలు

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విద్యారంగం, సంక్షేమ రంగాల్లో తీసుకొచ్చిన సంస్క‌ర‌ణ‌లు రాష్ట్రంలో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొస్తున్నాయి. ఆర్థిక‌ప‌రంగానే కాకుండా సామాజిక ప‌రంగా కూడా ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. క‌క్ష‌లు, కార్ప‌ణ్యాలు మాయ‌మై ప‌ల్లెల్లో స‌హృద‌య వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతోంది. ప్ర‌భుత్వం అందించిన ఆర్థిక‌ స‌హ‌కారం, ప్రోత్సాహంతో ఎంతో మంది వివిధ రంగాల్లో ముంద‌డుగు వేస్తున్నారు. ముఠా క‌క్ష‌ల‌కు నిల‌యంగా ముద్ర‌ప‌డిన గ్రామాలు సైతం కొత్త రాత‌ను రాసుకుంటున్నాయి. ఫ్యాక్షన్‌ పల్లెల్లో అక్షరాస్యత వెల్లివిరుస్తోంది. సంఘాలుగా ఏర్పడి చేపడుతున్న కార్యక్రమాలు.. ప్రభుత్వం అందిస్తున్న సహకారం.. అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో ఆ పల్లెలిప్పుడు ఆర్థికంగా ముందడుగు వేస్తున్నాయి.

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్‌ ముద్ర పడిన పి.కోటకొండ, కప్పట్రాళ్ల, వెలమకూరు, చిందుకూరు, రామాపురం, రామతీర్థం, సంగపట్నం, చెన్నంపల్లి, చెర్లోపల్లి, కాశీపురం, రెడ్డిపల్లె, నందిపాడు, బెలూం శింగవరం, హనుమంత గుండం, గొర్విమానుపల్లె, పాత కందుకూరు, ఎస్‌.లింగందిన్నె ఇలా… అనేక గ్రామాలు నేడు ముఠా కక్షలకు స్వస్తి పలికి వివిధ రంగాల్లో అభివృద్ధి పథాన పయనిస్తున్నాయి. జిల్లాకు పశ్చిమాన ఉన్న పి.కోటకొండ 53 ఏళ్లపాటు ఫ్యాక్షన్‌ గుప్పెట్లో నలిగిపోయింది. గ్రామంలో దాదాపు 103 మంది ముఠా కక్షలకు బలయ్యారు. ప్రస్తుతం గ్రామంలో 10 వేలకు పైగా జనాభా ఉంది. నేటి తరంలో మార్పు రావడంతో చదువుకున్న యువత చైతన్య యువజన సంఘంగా ఏర్పడి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా ప్రణాళికలు రచించారు. ఫ్యాక్షన్‌ వల్ల ఒరిగేదేమీ లేదనే సత్యాన్ని గ్రహించిన పి.కోటకొండ గ్రామస్తులు వ్యవసాయంలో ఆధునిక పోకడలను అందిపుచ్చుకున్నారు. దాదాపు 800 ఎకరాల్లో పండిస్తున్న గర్కిన్‌ (కీర) దోసకాయలను బెంగళూరు నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.40 వేల పెట్టుబడి పెడితే.. రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు చేతికొస్తున్నదని రైతులు చెబుతున్నారు.

పి.కోటకొండకు కూతవేటు దూరంలోనే ఉండే కప్పట్రాళ్ల కూడా గ్రామాధిపత్యం కోసం జరిగిన పోరులో రక్తసిక్తమైంది. ఇప్పుడా గ్రామం ఫ్యాక్షన్‌ భూతాన్ని వదిలించుకుని అభివృద్ధి దిశగా సాగుతోంది. 2014 నుంచి 2017 వరకు జిల్లా ఎస్పీగా పనిచేసిన ఆకే రవికృష్ణ కప్పట్రాళ్ల గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో దీని రూపురేఖలు మారిపోయాయి. సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ కింద జిల్లాలోని సిమెంట్‌ ఫ్యాక్టరీల సహకారంతో గ్రామంలో సిమెంట్‌ రోడ్లు, జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు సొంత భవనం, ప్రహరీ గోడ వంటివి ఎస్పీ నిర్మింపజేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఓర్వకల్లు మహిళా సంఘం సహకారంతో మహిళా పొదుపు గ్రూపులను ఏర్పాటు చేయించారు.

ఇప్పుడు గ్రామంలో 92 మహిళా సంఘాల్లో 941 మంది సభ్యులున్నారు. ఈ గ్రూపుల ద్వారా దాదాపు రూ.10 కోట్ల టర్నోవర్‌ జరుగుతోంది. గ్రామానికి చెందిన 10 మంది పొదుపు మహిళలు సర్‌్ఫ, ఫినాయల్‌ను కప్పట్రాళ్ల బ్రాండ్‌ నేమ్‌తో తయారు చేస్తున్నారు. మరో 15 మంది మహిళలు జీన్స్‌ ప్యాంట్స్‌ తయారీలో రాటు తేలారు. బళ్లారి నుంచి ముడి సరుకు తెచ్చి ఇక్కడ జీన్స్‌ ప్యాంట్స్‌ కుట్టించి పంపుతున్నారు. ఒక్కో మహిళ రోజుకు కనీసం రూ.250 ఆదాయం వస్తోంది. ప్రస్తుతం గ్రామానికి చెందిన 15 మంది మహిళలు సీఆర్‌పీలుగా పని చేస్తుండగా, 10 మంది ప్రకృతి వ్యవసాయ శాఖలో చేరి వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మహిళలు పొదుపు సంఘాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నందున ఆర్థిక వనరులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం గ్రామంలో బ్యాంక్‌ ఏర్పాటు కావడం, రుణాలు ఇవ్వడంతో స్వయం ఉపాధి కార్యక్రమాలు పెరిగి వలసలు భారీగా తగ్గాయి. ఒక‌ప్పుడు గొడ‌వ‌లు, ఘ‌ర్ష‌ణ‌ల‌తో నిత్యం అల్ల‌క‌ల్లోలంగా ఉండే చాలా గ్రామాలు సీఎం జ‌గ‌న్ తెచ్చిన సంస్క‌ర‌ణ‌ల కార‌ణంగా నేడు అభివృద్ధి బాట ప‌డుతున్నాయి.