iDreamPost
iDreamPost
పూర్తి స్థాయి దేశీయ ఉత్పత్తిగా పేరు పొందిన కోవిడ్ టీకా కోవాగ్జిన్ పేటెంట్ హక్కులు పూర్తిగా భారత్ బయోటెక్ సంస్థవేనా?.. ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యం లేదా??.. ఆ సంస్థ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ) సుచిత్ర ఎల్లా వ్యాఖ్యలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే చెబుతున్నాయి. అంతేకాదు కోవాగ్జిన్ టీకా రూపకల్పనకు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని (ఫార్ములా) ఇతర సంస్ధలతో పంచుకోవడానికి తాము సిద్ధంగా లేమని ఆమె కుండబడ్డలుగొట్టారు. ఇన్నాళ్లూ కోవాగ్జిన్ తయారీలో ఐసీఎంఆర్, వైరాలజీ ఇన్స్టిట్యూట్ భారత్ బయోటెక్ కలిసి పనిచేశాయని అందరూ భావించారు. ఆ అధికారంతోనే కోవాగ్జిన్ సాంకేతికతను ఇతర ఫార్మా సంస్థలకు బదిలీ చేసి.. టీకాల ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం అంగీకరించింది. బయోటెక్ సంస్థ కూడా ఒప్పుకున్నట్లు ప్రకటించింది. కానీ హఠాత్తుగా ఆ సంస్థ జేఎండీ సుచిత్ర ఎందుకు అడ్డం తిరగారన్న చర్చ జరుగుతోంది.
సంయుక్త పరిశోధనల ఫలం
కోవిడ్ మహమ్మారిని అడ్డుకోగలిగే టీకా తయారీకి ప్రపంచ దేశాలు శ్రీకారం చుట్టినప్పుడు మనదేశానికి చెందిన పలు సంస్థలు కూడా పరిశోధనలు మొదలుపెట్టాయి. వాటిలో భారత్ బయోటెక్ ఒకటి. ఈ సంస్థ పరిశోధనల్లో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ ఐవీ) భాగస్వాములయ్యాయి. పరిశోధనల నుంచి క్లినికల్ ట్రయల్స్ వరకు విస్తృతంగా పాలుపంచుకున్నాయి. దాని ఫలితంగానే కోవాగ్జిన్ టీకా తయారైంది. భారత ప్రభుత్వం కూడా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. భారత్ లో ఇప్పటివరకు ఆస్ట్రాజెనిక-ఆక్స్ఫర్డ్ తయారీ కోవిషీల్డ్, కోవాగ్జిన్, రష్యన్ తయారీ స్పుత్నిక్-వి టీకాలకే అనుమతులు లభించాయి. దేశ ప్రజలందరికీ సాధ్యమైనంత తొందరగా టీకాలు అందాలంటే ఉత్పత్తి పెంచడం ఒక్కటే మార్గమని.. అందువల్ల కేంద్ర సంస్థల భాగస్వామ్యంతో రూపొందిన కోవాగ్జిన్ టీకా సాంకేతికతను ఇతర సంస్థలకు కూడా బదిలీ చేస్తే ఉత్పత్తి పెరిగి.. టీకాలు అందరికీ అందుబాటులోకి వస్తాయని ఏపీ సీఎం జగన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన సూచనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. సాంకేతికత బదిలీకి సిద్ధంగా ఉన్నామని నీతి ఆయోగ్ డైరెక్టర్ (ఆరోగ్యం) డాక్టర్ వి.కె.పాల్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. భారత్ బయోటెక్ కూడా దీనికి అంగీకరించిందని వెల్లడిస్తూ.. సాంకేతికత బదిలీ, టీకాల ఉత్పత్తి విషయమై మూడు నాలుగు సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని కూడా చెప్పారు. భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా కూడా దీన్ని ధృవీకరించారు.
సహకరించారు.. కానీ..
వాస్తవాలు ఇలా ఉంటే.. బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా మాత్రం కోవాగ్జిన్ రూపకల్పన శ్రమ అంతా తమదేనన్నట్లు మాట్లాడారు. కొన్ని పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆమె ఈ విషయాలు ప్రస్తావించారు. కోవాగ్జిన్ రూపకల్పనలో ఐసీఎంఆర్, ఎన్ఐవీ సహకరించిన మాట నిజమేనని అంగీకరిస్తూనే.. అది నామమాత్రమేనని తీసిపారేశారు. ఆ రెండు సంస్థలు తమకు కరోనా వైరస్ స్ట్రెయిన్ ను సమకూర్చాయని.. అలాగే జంతువులు, కోతులు, ఎలుకలపై ప్రయోగ పరీక్షలకు సహకరించాయని పేర్కొన్నారు. ఇటువంటి ప్రయోగాలకు ప్రైవేట్ సంస్థలకు అనుమతి ఉండదు కనుక వారి సహకారం తీసుకున్నామని.. టీకా తయారీలో వారి భాగస్వామ్యం అంతకుమించి ఇంకేమీ లేదని తేల్చేశారు. టీకా సాంకేతికత పూర్తిగా తమ సొంతమని.. దాన్ని ఇతరులకు బదిలీ చేసేందుకు సిద్ధంగాలేమని చెప్పారు. సంస్థ ఎండీ, కేంద్ర ప్రభుత్వం ఒకలా, సంస్థ జేఎండీ మరోలా చెప్పడం గందరగోళానికి తావిచ్చింది. ఇప్పటికే టీకాల కొరతతో దేశంలో వ్యాక్సినేషన్ చాలా మందకొడిగా సాగుతుంది. కోవాగ్జిన్ ఫార్ములాను బదిలీ చేసి ఉత్పత్తి పెంచితే కొరత చాలావరకు తీరుతుందనుకుంటే.. జేఎండీ ఈ విధంగా ట్విస్ట్ ఇచ్చారు. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్ ఎలా స్పందిస్తాయో.. కోవాగ్జిన్ సాంకేతిక హక్కులు ఎవరివంటాయో చూడాలి. ఏమైనా ఈ గందరగోళం ప్రభావంతో
టీకా కార్యక్రమం మరింత మందగిస్తుందేమోనన్న ఆందోళన కలుగుతోంది.