Idream media
Idream media
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా మందడంలో ఉద్యమం చేస్తున్న వారిని ఉద్దేశించి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ‘‘రైతుల త్యాగం, పోరాటం వృథా కాదు. త్వరలో ఆనందకరమైన ప్రకటన వింటారు. న్యాయమే విజయం సాధిస్తుంది’’ అంటూ నిన్న చంద్రబాబు మందడం శిబిరంలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
చంద్రబాబు ప్రకటనపై రకరకాల వ్యాఖ్యలు, ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ, అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి జేఏసీ సహా పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణను వేగంగా పూర్తి చేయాలన్న సుప్రిం కోర్టు ఆదేశాలతో ఏపీ హైకోర్టు అన్ని పిటిషన్లను అంశాల వారీగా కలిపి విచారిస్తోంది. కొద్ది రోజులుగా ఈ పిటిషన్లపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. కొత్త ఏడాది ప్రారంభంలో మూడు రాజధానుల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందనే ప్రచారం సాగుతోంది. ఇలాంటి తరుణంలో ఆనందకరమైన ప్రకటన వింటారు. ‘న్యాయమే‘ గెలుస్తుందనే నర్మగర్భ వ్యాఖ్యలు చంద్రబాబు చేయడం విశేషం.
రాష్ట్ర రాజధాని అంశం ఆ రాష్ట్ర పరిధిలోనిది.. తాము జోక్యం చేసుకోలేమని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లోనే పలుమార్లు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చెప్పిన ఆనందకరమైన ప్రకటన ఎక్కడ నుంచి వస్తుందనేది ప్రధాన ప్రశ్నగా మిగులుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చి చెప్పాయి.. ప్రస్తుతం మూడు రాజధానుల అంశం ఏపీ హైకోర్టులో విచారణలో ఉంది. ఇక్కడ నుంచే చంద్రబాబు చెప్పిన ఆనందకరమైన ప్రకటన వచ్చే ఒకే ఒక అవకాశం ఉంది. కోర్టులో విచారణలో ఉన్న అంశాలలో విచారణ పూర్తికాకుండానే.. కోర్టు తీర్పు ఇవ్వకముందే చంద్రబాబు తీర్పు ఎలా రాబోతోందో చెప్పడమే ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఇప్పటికే ఏపీ హైకోర్టులోని న్యాయమూర్తులను సుప్రిం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రభావితం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వం సుప్రిం ప్రధాన న్యాయమూర్తికి రాత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే అక్కడ ఎన్‌వీ రమణ కుమార్తెలు ఇద్దరు భూములు కొనుగోలు చేశారంటూ కూడా ఆధార సహితంగా ఫిర్యాదు చేసింది. ఈ వివరాలను మీడియాకు వెల్లడించింది. ఎన్‌వీ రమణపై రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేయడంపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఏపీ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు చుక్కెదురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అమరావతి ఇన్‌సైడర్ భూ కుంభకోణంపై సీట్, ఏసీబీ చేస్తున్న దర్యాప్తులపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. చంద్రబాబు న్యాయస్థానాల్లోని కొంత మందిని ప్రభావితం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారనే ప్రచారం సాగుతోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏపీ హైకోర్టులోని పలువురు న్యాయమూర్తులకు అమరావతిలో 600 గజాల భూమి అతి తక్కువ ధరకు కేటాయించడం వెలుగులోకి వచ్చింది.
ఇలాంటి పరిణామాలు ఇప్పటి వరకు జరగడంతోనే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అనేక సందేహాలు వస్తున్నాయి. మూడు రాజధానుల వ్యవహారంపై హైకోర్టు చేసే విచారణను ప్రభావితం చేసేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని చెబుతున్నారు. ఫలితం ఎలా ఉంటుందో కూడా చంద్రబాబు పరోక్షంగా ఉద్యమం చేస్తున్న వారికి చెప్పడం ఇక్కడ గమనించాల్సిన అంశం. త్వరలో అమరావతిపై ఆనందకరమైన ప్రకటన వింటారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వెనుక పరమార్థం ఏమిటో కాలమే తేల్చాలి.