iDreamPost
android-app
ios-app

‘బాధ్యులు’ వాళ్ళే..! ఆరోపించేదీ వారే..!!

  • Published Jan 04, 2021 | 5:17 AM Updated Updated Jan 04, 2021 | 5:17 AM
‘బాధ్యులు’ వాళ్ళే..! ఆరోపించేదీ వారే..!!

రాష్ట్రంలో ఇప్పుడు మతం గురించి చర్చ జోరందుకుంది. గతంలో ఈ పాత్రను కులం పోషించింది. అయితే ఇప్పుడు సున్నితమైన మతం పట్ల ప్రతిపక్షాలు చాలా ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాయి. ఎంతగానంటే ఏదైనా ఘటన జరిగినప్పుడు ఆ ఘటన తాలూకు విషయం గుడిలో పూజారికి కూడా తెలియకుండానే ప్రతిపక్షాలకు తెలిసిపోయేంతగా ఆసక్తి కనబరుస్తున్నాయి. గతంలో కూడా వీళ్ళుఇంతే ఆసక్తిగా ఉండేవారు, ఎక్కడేం జరిగినా స్పందించేవారు అనుకుంటే గనుక ఇప్పుడు చూపిస్తున్న ఆసక్తిని గురించి ఎవ్వరికీ పెద్దగా ఆక్షేపణ ఉండేది కాదు. కానీ గతానికి, ఇప్పటికీ వారి మధ్య వచ్చిన తేడాను గమనించిన జనం నుంచి మాత్రమే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల ఏపీలోని విజయనగరంలోని రామతీర్ధం, రాజమహేంద్రవరం, విజయవాడల్లో దేవతా విగ్రహాల పట్ల కొందరు దుశ్చర్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించి, చట్టప్రకారం చర్యలకు ఉపక్రమించింది. అదే సమయంలో రాష్ట్రంలోని ఇతర పక్షాలైన తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు ప్రభుత్వంపై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించడం ప్రారంభించారు. ఆయా ఆలయాలు దేవాదాయశాఖపరిధిలో లేకపోయినప్పటికీ.. అధికారంలో ఉన్నారు కాబట్టి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నది వారి సింగిల్‌లైన్‌ అజెండా. అయితే ఇంత వరకు బాగానే ఉందనుకున్నప్పటికీ అసలు విషయం పరిశీలిస్తేనే కాస్తంత తేడా కొడుతోందంటున్నారు జనం.

విజయనగరం జిల్లా రామతీర్ధంలోని రాములవారి ఆలయం టీడీపీలో కీలక నాయకులుగా ఉన్న అశోకగజపతిరాజు ట్రస్టీగా పర్యవేక్షణలో ఉంది. రాజమహేంద్రవరంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాలయం ఆ పార్టీలో మరో కీలక నేత, గుడా మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ పర్యవేక్షణలోనే నడుస్తోంది. ఈ రెండు ఆలయాల్లోనూ స్వామివార్ల విగ్రహాలను కొందరు దుండగులు ధ్వంసం చేసారు. అయితే సదరు నాయకులు నేరుగా ప్రభుత్వంపైనే విమర్శలకు దిగడం జనం ముక్కునవేలేసుకునేలా చేస్తుందిప్పుడు. గర్భగుడిలో ఉండే విగ్రాహామూర్తుల వద్దకు వెళ్లే అవకాశం దుండగులకు ఎలా వచ్చిందనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. కానీ ఈ విషయాన్ని బయటకు రానీయకుండా చేస్తున్న రాద్ధాంతాన్ని ప్రజలు గమనిస్తున్నారు.

సొంత పర్యవేక్షణలో ఉన్న ఆలయాల్లో ఏదైనా అపచారం జరిగితే ఎవరిది బాధ్యత? వాటిపై ఎవరు పెత్తనం వహిస్తున్నారో వాళ్ళే కదా మొదటి బాధ్యత వహించాలి. మరి ఆరోపణలు ప్రభుత్వంపై చేయడమేంటన్న చర్చ జనంలో జోరుగానే సాగుతోంది. ఎవడో మూర్ఖుడు దుశ్చర్యకు పాల్పడ్డాడు, అలా జరక్కుండా ప్రాథమికంగా కాపాడాల్సిందిగా ఆయా ఆలయాలను పర్యవేక్షిస్తున్న వారే కదా, కానీ ఈ విషయాలేమీ బైట పడనీయకుండా నేరుగా ప్రభుత్వంపైనే విమర్శలకు దిగుతూ, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆయా రాజకీయ పార్టీలు, నేతలు సిద్ధమైపోవడం జనాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది ఒక రకంగా ఇప్పటి వరకు ఆయా ఆలయాలపై వారి నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునే చర్యగానే భావించాల్సి వస్తుందని పలువురు చెబుతున్నారు.

ఇక విజయాడలో సీతమ్మవారి ఆలయం వద్ద జరిగిన హైడ్రామా అయితే ప్రతిపక్ష పార్టీల హడావిడికి పరాకాష్టగా నిలుస్తుందంటున్నారు. విజయవాడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలోగల సీతారామాలయం వద్దనైతే కనీసం పూజారి వచ్చి విగ్రహ ధ్వంసం గురించి ఖరారు చేయకుండానే టీడీపీ నేతలు ఎంటరైపోయి, మీడియాకు, తమకు తోడొచ్చే ఇతర పార్టీల వారికి ఫోన్లు చేసి రప్పించేయడం వంటి హడావిడి ప్రారంభించడం చూస్తుంటే వారి ఆదుర్ధా అంతరార్ధం అర్ధం కాకమానదు. తలుపునకు తాళం వేసి ఉన్నప్పటికీ విగ్రహం పడిపోవడం పట్ల పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏతా వాతా తేలేదేంటంటే.. ఎదుటి వారిపై ఆరోపణలు చేసే ముందు తాము ఎలా వ్యవహరిస్తున్నామన్నదాన్ని కూడా ఆయా పార్టీలు పట్టించుకుని ఉంటే బాగుండేందంటున్నారు.