కరోనా కారణంగా ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయిలో తిరగడం లేదు.. దీంతో రోజుకు 11 నుండి 12 కోట్ల ఆదాయం ఆర్టీసీకి రావాల్సి ఉండగా కేవలం రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తుందని తెలంగాణ ఆర్టీసీ అధికారులు తెలిపడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నిబంధనలను మినహాయింపు ఇచ్చారు. రాత్రి పూట కూడా ఆర్టీసీ సర్వీసులు నడుపుకోవచ్చని తెలిపారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు ప్రస్తుతం జేబీఎస్‌లోనే ప్రయాణికులను దింపుతున్నాయి. ఇకపై జిల్లాల నుంచి వచ్చే బస్సులు ఎంజీబీఎస్‌లో ఆగేందుకు అవకాశం కల్పించింది. గురువారం నుంచి ఇమ్లీబన్‌కు కూడా బస్సులు నడుపుతారు.
రాత్రి వేళల్లో బస్టాండుల్లో ప్రయాణికుల కోసం ట్యాక్సీలు, ఆటోలకు అనుమతి ఇచ్చింది. బస్సు టికెట్ కలిగిన ప్రయాణికులు కర్ఫ్యూ సమయంలోనూ ప్రైవేటు వాహనాల్లో తమ ఇళ్లకు చేరుకోవడానికి పోలీసులు అభ్యంతరం తెలపరు. హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, మరికొన్ని రోజుల వరకు నగరంలో సిటీ బస్సులు తిరిగేందుకు అనుమతి ఇవ్వలేదు. అంతర్రాష్ట్ర సర్వీసులు బస్సులను కూడా మరికొన్ని రోజుల పాటు అనుమతించరు.
కాగా తెలంగాణలో కరోనా తీవ్రత దృష్ట్యా ఇప్పటివరకు సరి-బేసి విధానంలో దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఇకపై హైదరాబాద్ నగరంలో గురువారం నుంచి మాల్స్ మినహా అన్ని రకాల దుకాణాలు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దుకాణాలు తక్కువగా తెరవడం వల్ల ఎక్కువ మంది గుమిగూడే అవకాశాలు ఉండడంతో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని కాబట్టి ఎక్కువ దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.