iDreamPost
android-app
ios-app

కార్యనిర్వాహక రాజధానికి మూడు వేల ఎకరాలు

కార్యనిర్వాహక రాజధానికి మూడు వేల ఎకరాలు

విశాఖపట్నంలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ కార్యనిర్వాహక రాజధానికి రెండు నుంచి మూడు వేల ఎకరాల భూమికి అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా జగన్‌ సర్కార్‌ రాష్ట్రంలో మూడు రాజధానులను మూడు ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని సూచన ప్రాయంగా నిర్ణయించింది. ఇందు కోసం నియమించిన జీఎన్‌ రావు నేతృత్వంలోని నిఫుణుల కమిటీ తన నివేదికను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.

ఈ నివేదికపై ఈ నెల 27న మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ఏర్పాటు చేయాలని జీఎన్‌ రావు కమిటీ తన నివేదికలో సూచించింది. అంతేకాకుండా శీతాకాల అసెంబ్లీ సమావేశాలు కర్నూలులో, వేసవి కాల అసెంబ్లీ సమావేశాలు విశాఖలో, సీఎం క్యాంపు ఆఫీసులు మూడు చోట్ల ఏర్పాటు చేయాలని కూడా సూచన చేసింది.

ఇందుకు అవసరమైన భూములు, వసతులు అమరావతిలో ఉండగా, ఇక కర్నూలు, విశాఖలో ఏర్పాటు చేయాల్సి ఉంది.
విశాఖ రూరల్‌ భీమునిపట్నం(భీమిలి)లో కార్యనిర్వాహక రాజధానిగా ఎంపిక చేయనున్నారని ఇప్పటికే అధికారపార్టీ నేతలు ప్రకటించారు. ఈ మేరకు సచివాలయం, వివిధ విభాగాల అధిపతుల కార్యాలయాలు, సీఎం క్యాంపు కార్యాలయం వంటివాటికి, మౌలిక వసతులకు దాదాపు రెండు నుంచి మూడు వేల ఎకరాల భూములు అవసరం అవుతాయని విశాఖ జిల్లా రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే భూముల ఎంపిక చేసే పనిలో అధికారులు నిమగ్నం కానున్నారు.