iDreamPost
android-app
ios-app

బీజేపీలో చేరి త‌ప్పు చేశాం క్ష‌మించండి… బెంగాల్ నాయకుల బ‌హిరంగ ప్ర‌చారం

బీజేపీలో చేరి త‌ప్పు చేశాం క్ష‌మించండి… బెంగాల్ నాయకుల బ‌హిరంగ ప్ర‌చారం

ప‌శ్చిమ‌బెంగాల్ లో బీజేపీ ప‌రిస్థితి అయ్యో పాపం.. అన్న‌ట్లుగా మారింది. రాష్ట్రంలో ఎంత ఓడిపోయిన‌ప్ప‌టికీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఇటువంటి ప‌రిస్థితి బ‌హుశా ఊహించి ఉండ‌క‌పోవ‌చ్చు. మ‌మ‌తా బెన‌ర్జీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ నెల రోజుల్లోనే బీజేపీ ప‌రిస్థితి త‌ల‌కిందులైంది. ఎన్నిక‌ల‌కు ముందు టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన నేత‌లంద‌రూ సొంత పార్టీలో చేరేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఇటీవ‌లే ముకుల్ రాయ్ చేరిపోయారు కూడా.

విశేషం ఏంటంటే, నేత‌లే కాదు.. కార్య‌క‌ర్త‌లు కూడా అదే బాట ప‌డుతున్నారు. అంతేకాదు.. బీజేపీలో చేరి త‌ప్పు చేశాం క్ష‌మించండి.. అంటూ ఈ రిక్షాల‌పై తిరుగుతూ ప్రజ‌ల‌కు బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెబుతుండ‌డం హాట్ టాపిక్ గా మారింది. భాజపాలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు దీపేందు విశ్వాస్‌, సోనాలి గుహ, నేతలు సరళ ముర్ము, అమోల్‌ ఆచార్య టీఎంసీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పుడు పార్టీ మారిన కార్యకర్తలు కూడా తిరిగి టీఎంసీలో చేరాలనుకుంటున్నట్లు ప్రకటించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

వీధుల్లోకి వ‌చ్చి క్ష‌మాప‌ణ‌లు

బెంగాల్ ఎన్నిక‌లు పూర్త‌య్యాక‌.. టీఎంసీ చేసిన‌ దాడుల్లో తమ కార్యకర్తలు, మద్దతుదారులు తీవ్ర గాయాల‌పాల‌య్యార‌ని, ప‌లువురు గాయ‌ప‌డ్డార‌ని బీజేపీ ఆరోపించింది. కానీ, బీజేపీ కార్య‌క‌ర్త‌లే టీఎంసీలో చేర్చుకోండంటూ రోడ్డెక్క‌డం ఆస‌క్తిగా మారింది. ఇటీవల పలువురు నేతలు తిరిగి టీఎంసీలో చేర్చుకోవాలంటూ ఆ పార్టీ అధినేత్రి, రాష్ట్ర సీఎం మమతా బెనర్జీకి లేఖలు కూడా రాశారు.

ఇప్పుడు నేతల బాటలోనే కార్యకర్తలూ నడుస్తున్నారు. భాజపాలో చేరి తప్పుచేశామంటూ బిర్భూమ్ జిల్లాలోని లాబ్పూర్, బోల్పూర్, సైంథియా నుంచి హుగ్లీ జిల్లాలోని ధానియఖాలి వరకు ఈ రిక్షాల ద్వారా వీధుల్లో ప్ర‌చారం చేస్తున్నారు. ఓ ప‌క్క బీజేపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల అనంతర హింసకు పాల్పడినట్లు గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ రాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేస్తుంటే, బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు బహిరంగంగా టీఎంసీకి క్షమాపణలు చెబుతుండ‌డం ఆ పార్టీకి మింగుడు ప‌డ‌డం లేదు.

బీజేపీ బ‌ల‌వంతం వ‌ల్లే అప్పుడు చేరాం..

బోల్పూర్ లోని వార్డ్ నెంబర్ 18 లో బ‌హిరంగంగా బీజేపీ కార్య‌క‌ర్త‌లు “ఎన్నిక‌ల‌కు ముందు మేం పార్టీలో చేరేలా బీజేపీ ఒప్పించింది. ఇది మోసపూరిత పార్టీ. గౌరవనీయులైన ముఖ్య‌మంత్రి మమతా బెనర్జీ త‌ప్పా మాకు ప్రత్యామ్నాయం లేదు, మేం రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలనుకుంటున్నాం. మ‌మ్మ‌ల్ని టీఎంసీలో చేర్చుకోండి” కోరారు. బీజేపీ కార్యకర్త ముకుల్ మండల్ మాట్లాడుతూ “నేను బీజేపీలో చేరి తప్పు చేశాను. మేం టీఎంసీలో చేరాలని అనుకుంటున్నాం” అన్నారు. సైంథియాలో 300 మంది బీజేపీ కార్య‌క‌ర్త‌లు టీఎంసీలో చేరుతున్న‌ట్లు ప్రమాణ స్వీకారం చేశారు. “ మేం పొరపాటున బీజేపీలో చేరాం. మమతా బెనర్జీ అభివృద్ధి పనులకు మద్దతు ఇవ్వడానికి మేం ఈ రోజు నుంచి టీఎంసీలో చేరుతున్నాం ” అన్నారు. వారిలో ఒకరు బీజేపీ మాజీ యూత్ మోర్చా మండల్ అధ్యక్షుడు తపస్ సాహా ఉన్నారు.

టీఎంసీ బెదిరింపుల‌తోనే ఇలా..

ఇదిలా ఉండ‌గా, ఈ ఘటనపై భాజపా జిల్లాస్థాయి నేతలు స్పందించారు. అధికారంలో ఉన్నటీఎంసీ బెదిరింపుల వ‌ల్లే కార్య‌క‌ర్త‌లు ఇలా బహిరంగ క్షమాపణలు చెబుతున్నార‌ని ఆరోపించారు. బ‌ల‌వంతంగా తమ కార్య‌క‌ర్త‌ల‌ను టీఎంసీలో చేరేలా ఒప్పిస్తున్నార‌ని హుగ్లీ బీజేపీ నాయ‌కులు పేర్కొన్నారు.

టీఎంసీ నేత‌ను క‌లిసిన రాజిబ్

బీజేపీ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ టీఎంసీలో చేరిన విష‌యం తెలిసిందే. ఆ మ‌ర్నాడే బీజేపీలో ఉన్న మాజీ మంత్రి రాజీబ్ బెనర్జీ తృణమూల్ ప్రతినిధి కునాల్ ఘోష్తో తో సమావేశమయ్యారు. ఆయ‌న టీఎంసీలో చేర‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌లే బీజేపీని విమ‌ర్శిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టు కూడా పెట్టారు. ఈ క్ర‌మంలో వారి భేటీ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాజీబ్ మాత్రం మర్యాదపూర్వకంగా క‌లిశాన‌ని చెప్పారు. “నేను అనారోగ్యంతో ఉన్న బంధువును కలవడానికి ఉత్తర కోల్‌కతాకు వచ్చాను. చిరకాల మిత్రుడు కునాల్ ఘోష్ నివాసం సమీపంలోనే ఉన్నందున అత‌న్ని క‌లుసుకున్నాను. రాజకీయ చర్చలు జరగలేదు ” అని బెనర్జీ అన్నారు.