Idream media
Idream media
వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చిన టీడీపీ తాజా, మాజీ ప్రజా ప్రతినిధులను పరామర్శించే కార్యక్రమాన్ని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొనసాగించారు. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించేందుకు, ధైర్యం చెప్పేందుకని చంద్రబాబు.. ధూళిపాళ్ల స్వగ్రామం చింతలపూడికి వెళ్లారు. నరేంద్ర స్వగృహంలో ఆయన్ను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
నరేంద్ర కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుంది..
వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే ధూళిపాళ్ల నరేంద్రపై కేసు పెట్టిందని, జైలుకు పంపిందని చంద్రబాబు ఆరోపించారు. ధూళిపాళ్ల కుటుంబం 30 ఏళ్లుగా రైతులకు సేవ చేసిందని, అలాంటి కుటుంబానికి చెందిన నరేంద్రను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. పోలీసులు కనీసం నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. నరేంద్ర కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అచ్చెం నాయుడు నుంచి మొదలైన అక్రమ అరెస్ట్‌లు కొనసాగుతున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అచ్చెం నాయుడు నుంచి నరేంద్ర వరకూ..
వివిధ కేసుల్లో అరెస్ట్ అయి, బెయిల్ పై విడుదలైన నేతలందరినీ చంద్రబాబు లేదా ఆయన కుమారుడు పరామర్శిస్తూ వస్తున్నారు. అచ్చెం నాయుడు, కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డిలపై నమోదైన కేసులు, అందులో నిజానిజాలతో సంబంధం లేకుండా.. వారికి మద్ధతుగా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే తమ పార్టీ నేతలపై కేసులు పెట్టిందనేలా ఏక వాక్య తీర్మానాన్ని చదివేవారు. ఈ నేతలపై కోర్టులు చేసిన వ్యాఖ్యలను కూడా పట్టించుకోకుండా.. మద్ధతు ఇచ్చారు. అదే పంథాను ధూళిపాళ్ల నరేంద్ర విషయంలోనూ చంద్రబాబు కొనసాగించారు.
Also Read : తుది దశకు ఇన్‌సైడర్ కేసు : సుప్రీం ముందు ఏపీ కీలక ప్రతిపాదనలు
కోడెల ఏం పాపం చేశాడు..?
అవినీతి కేసులో అచ్చెం నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, హత్య కేసులో కొల్లు రవీంద్ర, ఫోర్జరీ పత్రాలతో కాలం తీరిన వాహనాలను విక్రయించిన కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డిలు అరెస్ట్ అయ్యారు. ఆయా నేతలకు పార్టీ తరఫున ఇచ్చిన మద్ధతు.. తమ నేతకు ఎందుకు ఇవ్వలేదని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అనుచరులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోడెలపై కేసులు నమోదయ్యాయి కానీ అరెస్ట్ కాలేదు. కేసులు నమోదైన సమయంలో చంద్రబాబు గానీ, లోకేష్ గానీ.. కనీసం స్పందించలేదు. ప్రభుత్వం కక్ష సాధిస్తుందంటూ అప్పుడు మాట్లాడలేదు. పార్టీ అండగా ఉంటుందని కనీసం మాట మాత్రం కూడ అనలేదు. చంద్రబాబును కలిసేందుకు యత్నించినా అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని అనుచరులు గుర్తుచేసుకుంటున్నారు. పైగా సత్తెనపల్లిలో కోడెలకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణుల చేత కార్యక్రమాలు చేయించారు. ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించేలా మాట్లాడించారు.
మనస్తాపంతో ఉరి..
అటు కేసులు నమోదు కావడం, ఇటు పార్టీ నుంచి మద్ధతు లేకపోవడంతోపాటు దూరం పెట్టేలా చంద్రబాబు వ్యవహరించడంతో కోడెల తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఆ క్రమంలోనే ఉరిపోసుకుని చనిపోయారంటూ కోడెల అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. అచ్చెం నాయుడు నుంచి ధూళిపాళ్ల వరకూ.. పార్టీ నుంచి, చంద్రబాబు నుంచి వచ్చిన మద్ధతులో కనీసం పదో వంతు అయినా కోడెలకు లభించి ఉంటే.. ఈ రోజు ఆయన తమ మధ్య ఉండేవారని కోడెల అనుచరులు వాపోతున్నారు
Also Read : రఘురామరాజుకు ఎదురుదెబ్బ..!