Idream media
Idream media
దేశంలోని ఐదు ప్రధాన రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల కోలాహలం నడుస్తోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరిగా ప్రచారం చేస్తున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికల నోటిఫికేన్ కు ముందు నుంచే రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. 30 స్థానాలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఒకే విడతలో ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణ స్వామికి షాకిచ్చింది. జాబితాలో ఆయనకు చోటు లేదు. రెండో జాబితాలో కూడా ఉండే అకాశాలు లేని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పోటీ ఆసక్తికరంగా మారింది.
దక్షిణ భారతదేశంలో అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకటైన పుద్దుచ్ఛేరి లో రెండు నెలలుగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలోనే ఎన్నికలు జరుగుతాయనగా ఎమ్మెల్యేల రాజీనామాతో ముందుగానే ప్రభుత్వం కూలిపోయింది. నోటిఫికేషన్ కు ముందు రోజే నాటి లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడీని తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. కిరణ్ బేడీని తప్పించిన కేంద్రం పుదుచ్చేరి అదనపు బాధ్యతలను తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌కు అప్పగించింది. బాధ్యతలు స్వీకరించిన వెంటనే తమిళి సై మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని బలం నిరూపించుకోమనడం, ప్రభుత్వం పడిపోవడం తెలిసిందే. ఇదంతా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు కొన్ని రోజుల ముందే జరిగింది. అనంతరం ఎన్నికల సంఘం కూడా నాలుగు ప్రధాన రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీకి కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ రాష్ట్రంపై కన్నేసిన బీజేపీ పకడ్బందీగా వ్యూహాలు అమలు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా మళ్లీ అధికారం కోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం పడిపోయిన అనంతరం నారాయణ స్వామి మాట్లాడుతూ ప్రజల మద్దతుతో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పుడు ఆయనకే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇచ్చింది. తాజాగా 14 అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. అయితే ఆ జాబితాలో నారాయణస్వామి పేరు లేదు. రెండో జాబితాలోనూ ఆయనకు అవకాశం ఉండదని తెలుస్తోంది. నారాయణస్వామి నియోజకవర్గం నెల్లిథోప్ స్థానాన్ని డీఎంకేకు కేటాయించారు. షా జహన్ కామ్‌రాజ్ నగర్, వి.సుబ్రమణ్యన్ కరైకల్ (నార్త్), కందసామి ఎంబలమ్, కమలకణ్నన్ థిరునల్లర్ స్థానాల్లో పోటీ చేయనున్నారు. ఎన్నికల వ్యవహారాలు, ప్రచారం బాధ్యతలను నారాయణస్వామి చూసుకుంటారని.. అందుకే ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పార్టీ పుదుచ్చేరి వ్యవహారాల ఇన్‌చార్జి గుండురావు తెలిపారు. అయితే నారాయణస్వామి పేరు ప్రకటించకపోవడం కొంత పార్టీలో విబేధాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.