ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరుతో ఆ పార్టీ కేడర్ ఇబ్బంది పడుతోంది. నేతల పర్యటనల్లో పాల్గొనేందుకు కూడా కార్యకర్తలు భయపడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజుకున్న ఈ విభేదాలు ప్రస్తుతం తారాస్థాయికి చేరాయి. కొత్త, పాత నేతల మధ్య సమన్వయం కొరవడటంతో పాటు గ్రూపు రాజకీయాలకు ప్రాధన్యమిస్తున్నారు. కొత్తగూడెం, పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఇప్పటికే క్యాడర్ రెండు వర్గాలు విడిపోగా.. తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి చేసిన వ్యాఖ్యలతో అధికారపార్టీలో ఆధిపత్య రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. సంస్థాగత ఎన్నికల సాక్షిగా ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఖమ్మం టీఆర్ఎస్ లో చిచ్చుకు కారణమవుతున్నాయి. .
శీనన్న బ్రాండ్ ఇమేజ్
ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో వర్గపోరు ‘శీనన్న బ్రాండ్’ పేరుతో మరోసారి బహిర్గతమైంది. పార్టీ సంస్థాగత పదవులు, నామినేటడ్ పోస్టుల విషయంలో ఎంపీ, మంత్రి నిర్ణయాలే ఫైనల్ అవుతుండటంతో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో తన బ్రాండ్ (శీనన్న బ్రాండ్) ను తుడిచివేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధిరలో జరిగిన టీఆర్ఎస్ సంస్థాగత సమావేశం సాక్షిగా ఆయన తన మనసులో మాట బయటపెట్టారు. ‘మధిర నియోజకవర్గంలో తన పర్యటనల్లో పాల్గొంటున్న నేతలను బెదిరించే ప్రయత్నం’ సరైన చర్య కాదని హితువు పలికారు. ‘ఫలానా నేత వెంట వెళితే పదవులు తీసేస్తామని బెదిరించడం బాధాకరమన్న పొంగులేటి… తనకు పదవులు ఉన్నా లేకున్నా ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. తనకు పదవులు కన్నా ప్రజలే ముఖ్యమని పార్టీ సమావేశంలో తేల్చి చెప్పారు’.
Also Read : స్పీకర్ కుటుంబంలో వారసత్వ పోరు
ఓన్లీ కేసీఆర్ బ్రాండ్..
పొంగులేటి వ్యాఖ్యలకు ప్రస్తుత ఎంపీ నామా నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ‘జిల్లాలో ఎవరి బ్రాండ్ లు లేవన్న నామా.. ఉన్నదల్లా కేసీఆర్ బ్రాండేనని’ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పదవులు రానివారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అందరూ ఐకమత్యంగా ఉండి టీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని కోరారు.
పనిచేసేవారికే పదవులు…
అదే సమావేశంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా పొంగులేటి వ్యాఖ్యలపై స్పందించారు. ‘ వర్గాలు లేవు.. కులాలు లేవు.. ఉన్నదల్లా గులాబీ కండువా ఒక్కటే’నని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేతలు ఎవరు పర్యటనకు వచ్చినా ఆంక్షలు లేకుండా గౌరవించుకోవాలన్నారు. పార్టీ పట్ల నిబద్దతతో పనిచేసేవారికి పదవులు వస్తాయని వివరించారు.
ప్రజల్లోనే పొంగులేటి..
వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఆపార్టీ నుంచే ఖమ్మం ఎంపీగా విజయం సాధించారు. తర్వాత టీఆర్ఎస్ లో చేరిన పొంగులేటి.. జిల్లాలో కీలకంగా వ్యవహరించారు. ఎంపీగా ఉన్న సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఆయన పనితీరును ఇష్టపడిన చాలా మంది శ్రీనివాసరెడ్డి ఫాలోవర్స్ గా మారారు. ప్రస్తుతం పదవి లేకున్నప్పటికీ తన కేడర్ ను కాపాడుకునేందుకు శ్రీనివాస్ రెడ్డి శ్రమిస్తున్నారు. పార్టీ పదవులు, నామినేటడ్ పోస్టుల విషయంలో కూడా మంత్రి, ఎంపీల మాటే ఫైనల్ అవుతుండటంతో పొంగులేటి వర్గం అసంతృప్తితో ఉంది.
Also Read : మాజీ ఎంపీ వివేక్ తెరాస కు దగ్గరవుతున్నాడా ?
టికెట్ దక్క లేదు
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కొత్తగూడెం శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. ఆ స్థానం నుంచి జలగం వెంగళరావు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓడారు. అయితే పొంగులేటి కారణంగానే వెంకట్రావు ఓటమి చెందారని జలగం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగులేటికి తర్వాత ఎంపీగా పోటీ చేసే అవకాశం కూడా రాలేదు. కారణాలు ఏమైనప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యత్వం కూడా దక్కలేదు. దీంతో ఆయన అభిమానులు నిరాశ చెందారు. ఈ విషయంలో పొంగులేటి కూడా అసంతృప్తి గానే ఉన్నారు.
టీఆర్ఎస్ లో నామా చేరికతో ….
2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ లోకి వలసలు పెరిగాయి. ఖమ్మం అసెంబ్లీ నుంచి టీడీపీ తరఫున పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ చేతిలో ఓడిన నామా నాగేశ్వరరావు లోక్ సభ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ తరఫున నామా ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి పొంగులేటికి ఎలాంటి పదవి దక్కలేదు. అయినప్పటికీ ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తూనే ఉన్నారు. పార్టీ పరమైన కార్యక్రమాలతో పాటు వ్యక్తిగత పర్యటనల్లో పాల్గొంటున్నారు. అయితే ఆయన పర్యటనల్లో కార్యకర్తలు పాల్గొనకుండా ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పుబడుతున్నారు. తన పర్యటనల్లో పాల్గొనే వారి పదవులు తీసేస్తామని చెప్పడాన్ని ప్రశ్నిస్తున్నారు.
రెండు పర్యాయాలుగా ఎన్నికల్లో ప్రత్యర్థులుగా రు పోటీకి దిగిన నేతలంతా ఇప్పుడు టీఆర్ఎస్ గూటికి చేరడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైంది. అయితే జిల్లాలో వర్గపోరు తీవ్రమైనా టీఆర్ఎస్ హైకమాండ్ మాత్రం సీరియస్ తీసుకోకవపోవడంతో గులాబీ శ్రేణులు తీవ్ర అయోమయంలో ఉన్నారు.
Also Read : జలగం వెంగళరావు కుటుంబం రాజకీయంగా ఏమి చేస్తుంది ?