Idream media
Idream media
కోస్తా ప్రాంతంలోని ముస్లిం మైనారిటీల్లో మంచి పట్టున్న దివంగత నేత, మాజీ ఎంపీ లాల్‌జాన్ బాష సోదరుడు మాజీ ఎమ్మెల్యే జీయావుద్దిన్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది మే నెలలో టీడీపీకి రాజీనామా చేసిన జీయావుద్ధిన్.. తాజాగా వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు ఆయన వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు.
లాల్‌జాన్ బాష. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ నిర్మాణంలో విశేష కృషి చేశారు. కోస్తా ప్రాంతంలో ముస్లిం మైనారిటీల్లో బలమైన నేతగా ఎదిగారు. కాంగ్రెస్‌కు కంచుకోట వంటి గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఎన్‌జీ రంగాను ఓడించి సంచలనం సృష్టించారు.
1957 అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన రెండవ ఎన్నిక (మొదటి ఎన్నిక 1951) నుంచి గుంటూరు లోక్‌సభ స్థానం కాంగ్రెస్ పార్టీదే. కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్త రఘురామయ్య నాలుగు సార్లు, ఆ తర్వాత ఎన్‌జీ రంగా మూడుసార్లు గెలిచారు. 1991లో తొలిసారి ముస్లిం మైనారిటీ నేత అయిన లాల్‌జాన్ బాషను టీడీపీ బరిలోకి దింపి విజయవంతమైంది. కాంగ్రెస్ కంచుకోటను లాల్‌జాన్ బాష బద్దలు కొట్టారు. 1996, 1998 ఎన్నికల్లో మళ్లీ ఇదే స్థానం నుంచి లాల్‌జాన్ బాష కాంగ్రెస్ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు.
సామాజిక సమీకరణాలు బేరీజు వేసి రాజకీయాలు చేసే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. గుంటూరులో లాల్‌జాన్ బాష వరుసగా రెండు సార్లు ఓడిపోవడంతో 1999 ఎన్నికల్లో నరసారావుపేట నుంచి బరిలోకి దింపారు. అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నేదురుమల్లి జనార్థన్ రెడ్డి పోటీ చేస్తుండడంతో.. ఆయనపై బలమైన అభ్యర్థిని పెట్టాలనే ఆలోచన చేసిన చంద్రబాబు.. సినీ గ్లామర్ ఉన్న ఆలీ, సామాజికంగా, ఆర్థికంగా ,సామాజికంగా బలమైన సినీ నటుడు మురళీమోహన్‌ను పోటీ చేయించేందుకు యత్నించారు. నాడు నరసారావుపేట లోక్‌సభ పరిధిలో ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, కంభం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. ఆ ప్రాంతాల్లో అధికంగా ఉన్న ముస్లిం ఓటర్లను అకట్టుకునేందుకు లాల్‌జాన్ బాషను బరిలోకి దింపారు. బాబు ఊహించినట్లుగానే లాల్‌జాన్ బాష నేదురుమల్లికి ముచ్చెమటలు పట్టించారు. కేవలం 13,882 స్వల్ప ఓట్ల మెజారిటీతో నేదురుమల్లి బయటపడ్డారు.
లాల్‌జాన్ బాష తమ్ముడు జీయావుద్దిన్ 1994లో తొలిసారి గుంటూరు 2 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మాజీ మంత్రి మహ్మద్ జానీని ఓడించారు. 1999లోనూ రెండోసారి ఎన్నికయ్యారు. గుంటూరు ప్రాంతంలో లాల్‌జాన్ బాష హవా నడిచింది. టీడీపీకి మద్ధతుగా ముస్లిం మైనారిటీలను కూడగట్టారు.
1999లో గుంటూరు 2 నుంచి జీయావుద్ధిన్ గెలిచినా.. నరసారావుపేట నుంచి లాల్‌జాన్ బాష ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయంగా వీరి తిరోగమనం ప్రారంభమైంది. వరుసగా మూడు సార్లు ఓడిపోయిన లాల్‌జాన్ బాషకు 2002లో రాజ్యసభ సీట్ ఇచ్చారు. అప్పటి నుంచి లాల్ జాన్ బాష ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయలేద,2013 ఆగస్టులో ఒక రోడ్ ప్రమాదంలో చనిపోయారు.
2009 ఎన్నికల్లో గుంటూరు 2 నుంచి మూడోసారి పోటీ చేసిన జీయావుద్ధిన్ కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్‌వలీ చేతిలో ఓడిపోయారు.ఆ ఎన్నికల్లో జరిగిన త్రిముఖపోటీలో గుంటూరు ఈస్ట్ నుంచి పోటీ చేసిన జీయావుద్దిన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్ వలీ గెలిచారు. పీఆర్‌పీ తరఫున పోటీ చేసిన మాజీ కార్పొరేటర్.. షేక్ సౌకత్ రెండో స్థానంలో నిలిచారు.
గుంటూరులో వరుసగా రెండుసార్లు ఓడిపోయిన లాల్‌జాన్ బాషను సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని నరసారావుపేట నుంచి బరిలోకి దింపిన చంద్రబాబు.. ఈ ఫార్ములాను గుంటూరు ఈస్ట్‌లోనూ ప్రయోగించారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఓడిపోయిన జీయావుద్దిన్‌కు నామినేటెడ్ పదవి ఇస్తానని చెప్పిన చంద్రబాబు.. వైశ్య సామాజికవర్గానికి చెందిన మద్ధాళి గిరికి 2014లో టిక్కెట్ ఇచ్చారు. అయితే వైసీపీ అభ్యర్థి ముస్తఫా ఇక్కడ గెలిచారు. టీడీపీ అధికారంలోకి రావడంతో జీయావుద్దిన్‌కు మైనారిటీ కమిషన్ చైర్మన్ పదవి దక్కింది.
2019లోనూ జీయావుద్దిన్‌కు టిక్కెట్ ఇవ్వలేదు. గుంటూరు ఈస్ట్ నుంచి మరో మస్లిం నేత అయిన మహ్మద్ నజీర్‌ను బరిలో దింపారు. మద్ధాళి గిరిని గుంటూరు వెస్ట్‌కు పంపారు. వెస్ట్‌లో గిరి గెలిచారు.. ఈస్ట్‌లో నజీర్ ఓడిపోయారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉంటూ.. పార్టీ నిర్మాణంలోనూ, ముస్లిం మైనారిటీల మద్ధతు కూడగట్టడంలోనూ ప్రధాన పాత్ర పోషించిన లాల్‌జాన్ బాష కుటుంబాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేశారనే ఆవేదన గుంటూరులోని ముస్లింలలో నెలకొని ఉంది. టీడీపీలో ఇక తనకు భవిష్యత్ లేదని అంచనాకు వచ్చిన జీయావుద్దిన్.. రాజకీయ భవిష్యత్‌ను వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీ లో చేరుతున్నారు. వైసీపీలో ఆయనకు మంచి ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. ఇటీవల భర్తీ చేసిన నామినేటెడ్ పదవుల్లో మైనారిటీ కమిషన్ చైర్మన్ పోస్టు లేదు. గతంలో తాను నిర్వహించిన మైనారిటీ కమిషన్ చైర్మన్ పదవే మళ్లీ జీయావుద్దిన్‌కు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.