Idream media
Idream media
మరో రెండేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణపై జెండా ఎగురవేయాలని ఏ పార్టీకి ఆ పార్టీయే ఉవ్విళ్లూరుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత నుంచి టీఆర్ఎస్ – బీజేపీ మధ్య పోరు ఉధృతం కాగా, రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ కూడా కధనానికి సై అంటోంది. ఈ క్రమంలో అన్ని పార్టీలూ నియోజకవర్గాల వారీగా ఇప్పటి నుంచే పరిస్థితులను అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ టీఆర్ఎస్ పటిష్టంగా ఉన్నప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని చోట్ల అంతగా ప్రభావం చూపలేకపోతోంది. అందులో ఒకటి.. అశ్వరావుపేట నియోజకవర్గం. ఆ నియోజకవర్గ టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తాజా వ్యాఖ్యలతో ఆ పార్టీ పరిస్థితి స్థానికంగా ఎలా ఉందో వెలుగులోకి వచ్చింది. దీంతో ఇదే అదునుగా కాంగ్రెస్, బీజేపీ ఆ నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై ఓ కన్నేశాయి.
అక్కడ టీఆర్ఎస్ కు చోటు లేదా?
గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు పై పదమూడు వేలకు పైగా మెజార్టీతో గెలుపొందాడు. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పోటీ చేసిన తాటి వెంకటేశ్వర్లు విజయం సాధించారు. ఇలా టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తన ప్రభావం పెంచుకున్న అధికార టీఆర్ఎస్‌కు ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గం మాత్రం ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలింది. నియోజకవర్గ నేతల్లో వర్గపోరే ఇందుకు కారణమని ఇందుకు కారణమని తెలుస్తోంది.
తాటి వ్యాఖ్యలు దేనికి సంకేతం
పరిస్థితి ఇలా ఉంటే.. టీఆర్ఎస్ జెండా పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని అన్నెపురెడ్డి మండలంలో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ చార్జి తాటి వెంకటేశ్వర్లు చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో మరింత కలకలం రేపుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అంత బలంగా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. జిల్లాలో నాయకులు కలిసికట్టుగా పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐక్యత లేకనే ఇక్కడ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి రాకూడదంటే అధిష్టానం, మంత్రి జోక్యం చేసుకోవాలని అన్నారు. అందరూ కలిసి పని చేసేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని తాటి వెంకటేశ్వర్లు సూచించారు. ఈ వ్యాఖ్యల ద్వారా అశ్వరావు పేట టీఆర్ఎస్ అంత సఖ్యత లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది.
గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు కూడా ప్రస్తుతం టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు, తాటి వెంకటేశ్వర్లు వర్గం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా తాటి వ్యాఖ్యలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ బలపడేందుకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పావులు కదుపుతున్నారు.